అమర్‌సింగ్‌ను ప్రశ్నించిన సిట్

అమర్‌సింగ్‌ను ప్రశ్నించిన సిట్


సునంద కేసులో 2 గంటల విచారణ

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసులో సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత, రాజ్యసభ ఎంపీ అమర్‌సింగ్‌ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించా రు. ఆమె చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఐపీఎల్ వివాదంపై తనతో మాట్లాడారని అమర్‌సింగ్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ విషయంలో ఆరోపణలన్నింటినీ తన భర్త కోసం కావాలనే తనపై వేసుకున్నానని, నిజానిజాలన్నీ శశిథరూర్‌కి మాత్రమే తెలుసునని సునంద తనతో అన్నట్లు అమర్ పేర్కొన్నారు.

 

 ఈ నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆయన్ని క్షుణ్ణంగా ప్రశ్నించినట్లు సమాచారం. థరూర్ కుటుంబానికి సన్నిహితుడిగా చెప్పుకొనే అమర్‌సింగ్ నుంచి పలు అంశాలపై వివరణ తీసుకున్నారు. థరూర్ దంపతుల మధ్య ఎలాంటి బంధం ఉండేది, ఐపీఎల్ వివాదం, పాక్ జర్నలిస్టు మెహర్ తరార్‌తో శశిథరూర్‌కు సంబంధాలు ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై అమర్‌సింగ్‌కు సునంద ఏమైనా చెప్పారా అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హత్య జరిగినట్లు వెలుగుచూడడంతో నిజాలను దాచడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. అలాగని శశిథరూర్‌కు మంచి జరగరాదని తాను కోరుకోవడం లేదని, ఆయన కుట్ర చేసినట్లు తాను ఆరోపించడం లేదని చెప్పారు.

 

 తనకు తెలిసిన అన్ని విషయాలను పోలీసులకు వెల్లడించినట్లు తెలిపారు. పోలీసులు తనను 2 గంటలపాటు ప్రశ్నించారన్నారు. కాగా, అమర్‌ను ప్రశ్నించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ కూడా ధ్రువీకరించారు. అలాగే సునంద కుమారుడు శిశ్ మీనన్‌ను కూడా త్వరలో ప్రశ్నిస్తామని ఆయన పేర్కొన్నారు. థరూర్‌ను కూడా మళ్లీ పిలుస్తామని, ఈ నెల 19న ఆయన్ను మూడున్నర గంటలపాటే ప్రశ్నించామని, అంత తక్కువ సమయంలో అన్ని వివరాలను అడగలేకపోయామని బస్సీ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top