మెలకువ వచ్చాక తేదీలు చూసుకుంటారు!

మెలకువ వచ్చాక తేదీలు చూసుకుంటారు!


 ఆ ఊర్లో కోడికూతలుండవు. ఒకవేళ కోడి కూసినా.. నిద్రలేవడం కాదు కదా.. కనీసం ఉలిక్కిపడేవారూ ఉండరు. ఎందుకంటే.. ఊరు ఊరంతా నిద్రమత్తులో జోగుతోంది. ఒకసారి నిద్ర ముంచుకొచ్చిందంటే.. కొన్ని రోజులు గడిస్తే గానీ వారికి మెలకువ రాదు. కుంభకర్ణుడి వారసులతో నిండినట్లున్న ఆ ఊరు ఉత్తర కజాఖ్‌స్థాన్‌లో ఉంది. పేరు కలాచీ. జనాభా ఆరొందలే. నాలుగేళ్ల నుంచీ జనాలంతా బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా నిద్రలోకి జారుకుంటున్నారు. మెలకువ వచ్చాక తేదీలు చూసుకుని అవాక్కవుతున్నారు. ఇప్పటికే కొంతమందికి భ్రమలు, జ్ఞాపకశక్తి సమస్యలూ మొదలయ్యాయట. కొందరు నిలబడలేకపోతుండగా, మరికొందరు అడ్డదిడ్డంగా నడుస్తూ, పరుగెడుతున్నారట.


ఆ ఊరి ప్రజల మెదళ్లలో అప్పుడప్పుడూ అదనపు నీరు చేరుతుండటం వల్లే ఇలా జరుగుతోందని ఎట్టకేలకు వైద్యులు గుర్తించారు. కానీ అతినిద్ర వ్యాధి గానీ, వైరల్, బ్యాక్టీరియల్ వ్యాధులేమీ లేకపోవడంతో ఈ అతినిద్ర ఎందుకొస్తోందో తేల్చలేకపోతున్నారు. అక్కడి మట్టిలో, నీటిలో కూడా ప్రమాదకర రసాయనాలు లేవని పరిశోధనల్లో తేలింది. అయితే, ఈ గ్రామానికి సమీపంలో సోవియెట్ కాలం నాటి మూతపడిన యురేనియం గనుల నుంచి వస్తున్న రేడియేషన్ వల్లే నిద్రరోగం వస్తోందని కొందరు, గ్రామం వద్ద విషపూరిత వ్యర్థాలను పాతిపెట్టారని మరికొందరు భావిస్తున్నారు. గ్రామంలో రేడియేషన్ సాధారణం కంటే 16 రెట్లు ఎక్కువగా ఉన్నా, ఈ నిద్రరోగానికి రేడియేషన్‌కు సంబంధం లేదనీ తేలడంతో ఇది మరింత మిస్టరీగా మారింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top