'సైకిల్' రూట్ మార్చిన అఖిలేశ్

'సైకిల్' రూట్ మార్చిన అఖిలేశ్ - Sakshi


న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు 'సైకిల్‌'ను సొంతం చేసుకున్న యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌.. తన తండ్రిపై ప్రేమను మరోసారి చాటుకున్నారు.  ఓవైపు సైకిల్‌ గుర్తుపైకానీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్ష స్థానంపైగానీ తమ వాదనలు వినకుండా ముందస్తు ఆదేశాలు జారీచేయవద్దంటూ సుప్రీంకోర్టును అభ్యర్థించిన అఖిలేశ్.. మరోవైపు తండ్రి ఫొటోలతోనే ఎన్నికల ప్రచారంలోకి దిగుతుండటం గమనార్హం. పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌ను సొంతం చేసుకున్న తర్వాత భార్య డింపుల్ యాదవ్‌తో సహా తండ్రి ములాయంను కలుసుకుని ఆయన అశీర్వాదం తీసుకున్నారు. అయితే ఎస్పీలో తండ్రీకొడుకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని అందరూ భావిస్తున్న నేపథ్యంలో అఖిలేశ్ మాత్రం ఎంతో తెలివిగా తండ్రి ములాయం వర్గాన్ని మెప్పించాలని 'నాన్నకు ప్రేమతో..' అనే శైలిలో ప్రచారాన్ని చేపట్టారు.



అఖిలేశ్ అంటే తండ్రి ములాయం సింగ్ అనే తరహాలో సీఎం వ్యవహరిస్తున్నారు. తండ్రి నుంచి తాను జీవితాన్ని అందుకున్నానని, యూపీ నుంచి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నానని భారీ ఫ్లెక్సీలతో ప్రచారానికి సిద్ధమయ్యారు అఖిలేశ్. తండ్రి ములాయం సింగ్ ఎస్పీని ఎంతో కష్టపడి ఏర్పాటుచేసి, అభివృద్ధి సాధించారని తెలియజేసే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో తండ్రి ములాయం పాత్ర ఎలాంటిదో ఈ తాజా పోస్టర్ల ద్వారా యూపీ సీఎం చెప్పకనే చెబుతున్నారు.





ఎప్పటిలాగే కలిసి పనిచేద్దాం.. విజయాన్ని సాదిద్ధాం అనే తాజా కొటేషన్లతో దూసుకుపోతున్నారు అఖిలేశ్. తొలిదశ ఎన్నికలకు మంగళవారం నోటిషికేషన్‌ విడుదలైంది. 15 జిల్లాల్లోని 73 స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో వీరి మధ్య విభేదాలు పార్టీకి నష్టాన్ని కలిగిస్తాయని భావించిన సీఎం వర్గీయులు ఎంతో తెలివిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి ఏర్పాటు చేసిన పార్టీ ఎస్పీ, ఎన్నికల గుర్తు సైకిల్ ఎప్పుడూ ములాయం పేరుతోనే నడుస్తాయని అర్ధం వచ్చేలా ఫ్లెక్సీలపై ముద్రించి ప్రచారం చేస్తున్నారు.



నేటి ఉదయం మరోసారి తండ్రి ములాయంతో సీఎం అఖిలేశ్ భేటీ అయ్యారు. తాను పోటీచేసే స్థానంలోనే బరిలోకి దిగుతానని హెచ్చరించిన తండ్రిని ఆయన శాంతింపజేయడంలో విజయం సాధించారు. తాను రూపొందించిన జాబితా నుంచి 40 మందికి పోటీచేసే అవకాశం కల్పించాలని అశిలేశ్‌ను ములాయం కోరారు. తన వర్గీయులు శివపాల్ యాదవ్, శివపాల్ కుమారుడు అదిత్యా యాదవ్ లకు అవకాశం కల్పించాలని ములాయం కోరగా దీనిపై మరోసారి ఆలోచిస్తానని అఖిలేశ్ చెప్పారు. తమపై నమ్మకం ఉంచితే విజయంఖాయమని, యూపీలో మరింత అభివృద్ధి సాధిస్తామని తనమాటగా అఖిలేశ్ తన తండ్రికి నచ్చజెప్పారు. తండ్రితో విభేదాలు లేవని సూచించేలా విస్తృత ప్రచారాన్ని చేయాలని అఖిలేశ్ భావిస్తున్నారు. అందులో భాగంగానే అఖిలేశ్ తన సైకిల్ రూట్ మార్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 







 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top