దాడికి సూత్రధారి ఎవరు?

దాడికి సూత్రధారి ఎవరు?


ఉడీలో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారతీయుల గుండెలన్నీ ఒక్కసారిగా భగభగ మండిపోయాయి. ప్రతీకార జ్వాలలు రగులుకున్నాయి. పాకిస్థాన్ పీచమణచాల్సిన సమయం ఇదేనని మాజీ సైనికులు కూడా గర్జించారు. కానీ.. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఆశించిన స్పందన రాలేదు. జవాన్ల త్యాగాలు వృథాగా పోనివ్వబోమని మాత్రమే ప్రధానమంత్రి చెప్పారు. అయితే.. అప్పటికే తెరవెనక జరగాల్సింది అంతా జరిగిపోతోంది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ప్రధానమంత్రికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎక్కడా తెరమీద కనిపించలేదు. తెర వెనకనుంచే ఇద్దరూ వ్యూహరచనలో మునిగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.



పారికర్ - దోవల్.. వీళ్లిద్దరూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నమ్మిన బంట్లు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తాను తలపెట్టిన ఆర్థిక సంస్కరణలను సరిగ్గా అమలుచేయడానికి మన్మోహన్ సింగ్‌ను ఎలా ఎంచుకుని తీసుకొచ్చారో.. అలాగే నరేంద్రమోదీ ప్రధాని పదవి చేపట్టిన వెంటనే అప్పటివరకు గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌ను కూడా రక్షణ మంత్రిగా అలాగే తీసుకొచ్చారు. మరోవైపు అప్పటివరకు యూపీఏ హయాంలో పెద్దగా ప్రాధాన్యం లభించని అజిత్ దోవల్‌ను కూడా జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. 2014 మే 26న మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, 30వ తేదీన దోవల్ ఎన్‌ఎస్‌ఏ పదవిలో నియమితులయ్యారు. అప్పటి నుంచి ప్రభుత్వం విదేశీ వ్యవహారాలకు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఆయన హస్తం ఉండని సందర్భం లేదు.



ఎవరీ దోవల్.. ఏం చేశారు

అజిత్ దోవల్.. 1968 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. కేరళ కేడర్‌లో చేరిన ఈయన, 2004-05 సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా వ్యవహరించారు. 1980లలో మిజో నేషనల్ ఫ్రంట్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించింది. ఆ సమయంలో దోవల్ ఆ సంస్థలోకి చొరబడి, దాని అగ్రకమాండర్లు ఆరుగురిని మట్టుబెట్టారు. దాంతో ఎంఎన్ఎఫ్ ఉనికి దాదాపు నిర్వీర్యం అయిపోయింది. ఇక పాకిస్థాన్‌లో గూఢచారిగా ఏడు సంవత్సరాలు పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఒక భిక్షగాడి వేషంలో కూడా తిరిగేవారని అంటారు. పాకిస్థాన్‌లో భారత గూఢచారులు పట్టుబడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. చిత్రహింసలు పెట్టి మరీ చంపేస్తారు. అది తెలిసి కూడా ఏకంగా ఏడేళ్ల పాటు అక్కడే ఉండి వాళ్ల రహస్యాలను తెలుసుకున్న ఘనత దోవల్‌కు ఉంది.



ఇక భారత సైన్యం ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించిన సమయంలో దోవల్ ముందుగానే స్వర్ణదేవాలయంలోకి వెళ్లిపోయారు. అక్కడ ఆయన పాకిస్థానీ గూఢచారిగా నటించి, ఉగ్రవాదుల ప్లాన్లు అన్నీ తెలుసుకుని, వాటిని సైన్యానికి అందించారు. కుక్కే పారే లాంటి కశ్మీరీ ఉగ్రవాదులను ఆయా ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా మార్చేశారు. ఇటీవలే ఎన్ఎస్ఏగా బాధ్యతలు స్వీకరించిన అతి కొద్ది కాలానికే ఇరాక్ నుంచి 45 మంది భారతీయ నర్సులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు.



శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహీంద రాజపక్స ఓటమి వెనక ఉన్నది కూడా అజిత్ దోవలే! రాజపక్స భారతదేశానికి తలనొప్పిగా మారి, చైనాకు అనుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. దాంతో తర్వాతి ఎన్నికల్లో ఆయన నెగ్గడానికి ఏమాత్రం వీల్లేదని భావించిన దోవల్.. అక్కడకు వెళ్లి ఏం మాయ చేశారో గానీ, మైత్రిపాల సిరిసేన తదుపరి అధ్యక్షుడయ్యారు. ఒకప్పుడు రాజపక్సకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండే సిరిసేనను ఆయనపై రెచ్చగొట్టి పోటీకి నిలబెట్టింది కూడా దోవలే. అంతేకాదు.. మాజీ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేను పోటీ చేయొద్దని కోరి.. ఒప్పించారు కూడా. దాంతో రాజపక్స ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసి.. సిరిసేనను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top