బ్రెడ్ ప్యాకెట్లో నుంచి ఎలుక దూకింది!

బ్రెడ్ ప్యాకెట్లో నుంచి ఎలుక దూకింది!


న్యూఢిల్లీ: అస్వస్థతతో బాధ పడుతున్న మీరు అధిక పోషక విలువలుగల గోధుమ బ్రెడ్‌ను తిందామని సీల్డ్ ప్యాకెట్‌ను విప్పితే హఠాత్తుగా అందులో నుంచి  బతికున్న ఎలుక బయటకు దూకితే ఆ అనుభవం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి! ఎవరికైనా ఒళ్లు జలధరిస్తుంది కదా! ఈ సంఘటన రోజుకు వందలాది మంది రోగులకు చికిత్సచేసే ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలో ఏయిమ్స్ ఆస్పత్రిలోనే జరిగింది. పర్యవసానంగా ఆ బ్రెడ్‌ను తయారుచేసి సరఫరా చేసిన ఎం/ఎస్ బాన్ న్యూట్రియెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఏయిమ్స్ షోకాజ్ నోటీసును జారీ చేసి, మూడేళ్లపాటు ఆ కంపెనీ ఉత్పత్తుల సరఫరాను నిషేధిస్తున్నామని ప్రకటించింది.



బ్రెడ్స్, బిస్కట్లు, కేక్స్, కుకీస్ లాంటి వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తయారుచేసి దేశంలోనే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్న ప్రముఖ బాన్ న్యూట్రియెంట్స్ కంపెనీ విషయంలోనే ఇలా జరిగితే ఇక సాధారణ కంపెనీలను ఎలా నమ్మగలం. సీల్డ్ బ్రెడ్ ప్యాకెట్‌ను విప్పగానే సజీవ ఎలుక సాక్షాత్కరించిన సంఘటన ఏయిమ్స్‌లో గత జూలై 29వ తేదీన జరగ్గా, దానిపై స్పందించేందుకు ఏయిమ్స్ లాంటి వైద్య విజ్ఞాన సంస్థ కూడా తాత్సారం చేసింది. సెప్టెంబర్ 9వ తేదీతో సెప్టెంబర్ 24వ తేదీన సదరు కంపెనీ ఉత్పత్తుల కొనుగోలును నిలిపివేస్తున్నట్టు నోటీసు జారీ చేసింది.



 ఎందుకింత ఆలస్యంగా స్పందించారని మీడియా ప్రశ్నించగా, అసలు అలాంటి సంఘటన జరిగినట్టు తన దృష్టికే రాలేదంటూ ఆస్పత్రి సూపరింటెండ్ వ్యాఖ్యానించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండడం వల్ల బ్రెడ్ నాణ్యతను గుర్తించగలిగామని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఏయిమ్స్ సీనియర్ డాక్టరొకరు వెల్లడించారు. తమ ఆస్పత్రిలో సాధారణ రోగులకే కాకుండా శస్త్ర చికిత్సలు చేసిన వారికి కూడా అధిక పోషక పదార్థాల కోసం బ్రౌన్ బ్రెడ్ అందిస్తామని ఆయన తెలిపారు. ఇన్‌ఫెక్షన్ సోకిన బ్రెడ్‌ను తిన్నట్లయితే ఎలర్జీ, ఫీవర్, డయేరియా లాంటి జబ్బులే కాకుండా బ్లడ్ ఇన్‌ఫెక్షన్, మెనింజైటీస్ లాంటి ప్రమాదకర జబ్బులు కూడా వస్తాయని ఆయన వివరించారు.



 అలాంటి సంఘటన తన దృష్టికి రాలేదంటూ ఏయిమ్స్ సూపరింటెండెంట్ తప్పించుకోజూసినా 24, సెప్టెంబర్, 2015 నాడు కంపెనీకి జారీచేసిన షోకాజ్ నోటీసులో ఎలుక బయట పడిన సంఘటన ప్రస్థావన స్పష్టంగా ఉంది. ఇదే విషయమై బాన్ న్యూట్రియంట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఢిల్లీ డివిజన్ మేనేజర్‌ను మీడియా  సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. సీసం పాలు ఎక్కువ ఉందంటూ ఇటీవల మ్యాగీ ఉత్పత్తుల కంపెనీ ‘నేస్లీ’పై కొన్ని రాష్ట్రాల్లో నిషేధం విధించిన విషయం తెల్సిందే. భారత్‌లో తయారవుతున్న పలు బ్రాండ్ల ఆహోర్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు, సీసం పాళ్లు ఎక్కువగా ఉంటోందంటూ పలు ఉత్పత్తులను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ (ఎఫ్‌డీఏ) నిషేధించిన విషయం తెల్సిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top