నటులు రాజకీయాల్లో వస్తే?

నటులు రాజకీయాల్లో వస్తే?


 చెన్నై : చెన్నైకు చెందిన మక్కల్ ఆయువగం సంస్థ నేతృత్వంలో ప్రజానాడిని పసిగట్టే విధంగా  తరచూ సర్వేలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయాల్లో ఈ సంస్థ జరిపిన సర్వేలు స్పష్టతను ఇచ్చిన సందర్భాలు అనేకం. తాజాగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్ష పడడంతో ఆమె హవా రాష్ట్రంలో తగ్గిందా? ఆమె మీద పడ్డ మచ్చ గురించి ప్రజల్లో సాగుతున్న ఆసక్తికర చర్చతో పాటుగా, మళ్లీ అన్నాడీఎంకే అధికారం చేజిక్కించుకునేనా? ఇతర పార్టీల పరిస్థితి, నటులు రాజకీయాల్లో వస్తే? ఇలా పలు అంశాల్ని అస్త్రంగా చేసుకుని తన సర్వేను ఈ సంస్థ నిర్వహించింది. రాష్ట్రంలోని 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే సాగింది. ఒక్కో నియోజకవర్గంలో వివిధ కేటగిరీల్లో 3320 మంది అభిప్రాయాలతో తాము సేకరించిన సమాచారాల్ని పరిశీలించి, పరిశోధించి వివరాల్ని ఆ సంస్థ డెరైక్టర్ రాజనాయగం ప్రకటించారు.

 

 అమ్మకే పట్టం : ఆ సర్వే మేరకు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్దతుగా నిలిచేందుకు ఎక్కువ శాతం మంది సిద్ధంగా ఉన్నట్టు తేలింది. ఎన్నికలు వస్తే  అన్నాడీఎంకేకు 44 శాతం మేరకు ఓట్లు వస్తాయని, డీఎంకేకు 26 శాతం ఓట్లు, బీజేపీకి తొమ్మిది శాతం ఓట్లు దక్కుతాయని ప్రకటించారు. ఉత్తమ పరిపాలనా దక్షత కలిగిన నేతగా జయలలితకు 58 శాతం మంది మద్దతు తెలియజేశారు. తిరుచ్చి శ్రీరంగానికి ఉప ఎన్నిక వస్తే భారీ ఆధిక్యంతో అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపు తథ్యమని ఆ సర్వే ద్వారా తేల్చారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై అభ్యర్థిని నిలబెట్టినా, అన్నాడీఎంకే అభ్యర్థే గెలుస్తారన్న అభిప్రాయాన్ని మెజారిటీ శాతం మంది వ్యక్తం చేశారు. జయలలితకు జైలు శిక్ష పడడాన్ని జీర్ణించుకోలేక సానుభూతి తెలియజేస్తున్న వారిలో 53 శాతం మంది ఉండగా, ఆమెకు ఇంత పెద్ద శిక్ష వేస్తారనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన వాళ్లు 30 శాతం మంది ఉన్నారు. దీన్ని బట్టి జయలలితకు 83 శాతం మేరకు సానుభూతి ఉన్నట్టు తమ సర్వేలో తేలిందని రాజనాయగం పేర్కొన్నారు. 14 శాతం మంది మాత్రం జయలలితకు శిక్ష పడటాన్ని సమర్థించి ఉన్నారు. మిగిలిన వారు ఎటూ తేల్చని సమాధానం చెప్పడం గమనార్హం.

 

 డీఎండీకే గల్లంతు : గత అసెంబ్లీ ఎన్నికలతో ప్రధాన ప్రతిపక్షంగా విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే అవతరించిన విషయం తెలిసిందే. అయితే,ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆపార్టీ గల్లంతు అయింది. తొలి స్థానాన్ని అన్నాడీఎంకే, రెండో స్థానాన్ని డీఎంకే, మూడో స్థానాన్ని బీజేపీ కైవశం చేసుకుని ఉంది. కేంద్రంలో పీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ర్టంలో బీజేపీ బలం పెరిగినట్టు తమ సర్వేలో తేలిందని ఆయన పేర్కొన్నారు. రజనీకాంత్, విజయ్‌ల రాజకీయ ప్రవేశం అంశంపై తమ అభిప్రాయాల్ని ప్రజలు వ్యక్తం చేశారు. రజనీ పార్టీకి మద్దతుగా 17 శాతం, విజయ్ పార్టీకి  మద్దతుగా 21 శాతం మంది తమ అభిప్రాయం తెలియజేయడంతో పాటుగా, ఆ ఇద్దరు రాజకీయాల్లోకి రావడం కన్నా, సినీ వినీలాకాశంలో మరింతగా మెరవాలని కాంక్షించిన వాళ్లే అధికంగా ఉండటం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top