పరుగుల రాణికి కాళ్లు, చేతులు లేకపోతేనేం....

పరుగుల రాణికి కాళ్లు, చేతులు లేకపోతేనేం.... - Sakshi


న్యూఢిల్లీ: ‘నాకు పట్టరానంత కోపం, ఆవేశం వచ్చేది. అంతలోనే బాధ, భయం, కలత, కలవరం కలిగింది. నాకే ఎందుకు ఇలా అయింది. నేనేమి తప్పుచేశాను. ఏదో తప్పు చేశానేమోనన్న ఆలోచన. కర్మ ఫలం కాబోలు! అనే నిర్లిప్తత. ఊహు, దొంతర్లుగా దొర్లిపోతున్న ఇలాంటి ఆలోచనలను, అనుమానాలను పక్కన పెట్టాల్సిందే. విలువైన సమయం జారిపోకుండా జీవితంలో ముందుకు సాగాల్సిందే, పైకి రావాల్సిందే అన్న పట్టుదలతో నా జీవితం మళ్లీ చిగురించింది’ ఈ మాటలు శాలిని సరస్వతి ఇటీవల ఫేస్‌బుక్‌లో వ్యక్తం చేసినవి.



ఆమె కాంబోడియాకు వెళ్లినప్పుడు అనూహ్యంగా జబ్బు పడ్డారు. అత్యంత అరుదైన బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌తో ఆమె శరీరంలో ఒక్కో అవయవం చచ్చుపడి పోవడం ప్రారంభమైంది. వెంటనే ఆమె చికిత్స కోసం కాంబోడియా ఆస్పత్రిలో చేరారు. సకాలంలో జబ్బు నయం కాకపోవడంతో ఒక కాలు, ఆ తర్వాత మరోకాలు. ఒక చేయి, ఆ తర్వాత మరోచేయి శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు తొలగించాల్సి వచ్చింది. రెండు కాళ్లు, రెండు చేతులు లేకుండా ఒట్టి పోయిన జీవితం తనకే ఎందుకంటూ నాటి పరిస్థితుల్లో మానసికంగా తాను అనుభవించిన బాధను, ఆందోళనను, ఆ పరిస్థితిని జయంచేందుకు తీసుకున్న దఢనిశ్చయాన్ని,  జయంచానన్న ఆత్మ సంతప్తిని చెప్పేందుకు ఫేస్‌బుక్‌లో ఆమె తన భావాలను ఈ మాటల్లో వ్యక్తం చేశారు.



రెండు కాళ్లు, రెండు చేతులు లేకపోతేనేమీ ఆమె ఇప్పుడు ఎన్నో అవార్డులు అందుకున్న ప్రముఖ బ్లేడ్‌ రన్నర్‌ శాలినీ సరస్వతి. ఆమె గతేడాది బెంగళూరులో జరిగిన ప్రతిష్టాకరమైన ‘టీసీఎస్‌ 10కే రేస్‌’లో పాల్గొనడమే కాకుండా రెండు గంటల్లో ఆ రేస్‌ను పూర్తి చేయడం ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు 32 ఏళ్లున్న శాలినికి ఐదేళ్ల క్రితమే పెళ్లియింది. పెళ్లైన కొత్తలో విహార యాత్రకు కాంబోడియా వెల్లడంతో దురదష్ణవశాత్తు జబ్బు దాపురించింది. అప్పుడు ఆమెకు పూర్తి అండగా నిలిచిన ఆమె భర్త ప్రశాంత్‌ చౌడప్ప ఆ తర్వాత ఆమె బ్లేడ్‌ రన్నర్‌గా రాణించడానికి కూడా ఎంతో సహాయపడ్డారట. శాలిని 2013లో మొదటిసారి కత్రిమ కాళ్లను ధరించారు. ఇంట్లో మూలకు కూర్చొని కష్ణా రామా అంటూ బతకడం ఆమెకు దుర్భరం అనిపించింది. కాళ్లకు బ్లేడ్స్‌ ధరించి నడవడం ప్రారంభించారు. కోచ్‌ల దగ్గర ప్రత్యేక శిక్షణ పొంది రన్నింగ్‌ రేసుల్లో పాల్గొనడం ప్రారంభించారు.



 ‘జీవితంలో నాకు కాళ్లు ఉంటేనేమీ లేకపోతేనేమీ నా నిర్ణయాలు నాకుంటాయి. నా ఆశయాలు నాకుంటాయి. ఒక పర్వతం ఎక్కి దిగితే ఎక్కాల్సిన మరో పర్వతం కనిపిస్తుందంటారు. ఆ మాటేమోగానీ  నేను జీవించి ఉన్నంత వరకు పరుగెత్తుతూనే ఉంటాను. పరుగాపను. పరుగెత్తుతున్నప్పుడు రెక్కలు కట్టుకొని గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది. ఎంతో ఆనందం వేస్తోంది. ఆనందంకన్నా జీవితం మరేముంటుంది’ అన్న పదాలతో ఆమె ముగించిన ఫేస్‌బుక్‌ను ఇప్పటికే పది లక్షల మంది చదివారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top