వినోద్‌ ఖన్నా ఇకలేరు

వినోద్‌ ఖన్నా ఇకలేరు - Sakshi


అలనాటి స్టార్‌ హీరో, బాలీవుడ్‌ అందగాడు అస్తమయం

- రాష్ట్రపతి, ప్రధాని, బాలీవుడ్‌ ప్రముఖుల తీవ్ర సంతాపం



ముంబై: అలనాటి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, లోక్‌సభ ఎంపీ వినోద్‌ ఖన్నా(70) గురువారం ఉదయం ముంబైలో తుదిశ్వాస విడిచారు. అమర్‌ అక్బర్‌ ఆంథోనీ, ఖుర్బానీ, ఇన్సాఫ్‌ వంటి హిట్‌లతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని అలరించిన ఖన్నా... గత కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ ముంబైలోని సర్‌ హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం 11.20 నిమిషాలకు వినోద్‌ ఖన్నా కన్నుమూశారని, ఇది మా అందరికీ ఎంతో విషాదకరమని ఆయన సోదరుడు ప్రమోద్‌ ఖన్నా తెలిపారు. తీవ్రమైన డీహైడ్రేషన్‌తో ఈ ఏడాది మార్చి 31న ఖన్నాను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.



అయితే ఆయనకు బ్లాడర్‌(మూత్రాశయ) క్యాన్సర్‌ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు చికిత్స కొనసాగించినా ఫలితం లేకపోయింది. కుటుంబసభ్యులు, స్నేహితులు, బాలీవుడ్‌ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు మధ్య గురువారం సాయంత్రం వర్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. వినోద్‌ ఖన్నాకు భార్య కవితా ఖన్నా, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మొదటి భార్య గీతాంజలి కుమారులైన రాహుల్, అక్షయ్‌లు ఇద్దరూ బాలీవుడ్‌ నటులే. అలనాటి బాలీవుడ్‌ అందగాళ్లలో ఒకరిగా పేరొందిన వినోద్‌ ఖన్నా.. 1968లో ‘మన్‌ కా మీత్‌’తో సినీ రంగ ప్రవేశం చేశారు. తొలినాళ్లలో ప్రతినాయకుడు, సహాయక పాత్రల్లో కన్పించిన ఆయన 1971లో గుల్జార్‌ సినిమా ‘మేరే అప్నే’తో హీరోగా గుర్తింపు పొందారు.



వరుస విజయాలతో మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ 1982లో ఆయన సినిమాలకు విరామం ప్రకటించారు. ఐదేళ్లపాటు పుణేలోని ఓషో రజనీష్‌ ఆశ్రమంలో గడిపి తిరిగి సినిమాల్లోకి పునఃప్రవేశం చేశారు. అనంతరం ఇన్సాఫ్, సత్యమేవ జయతే చిత్రాలతో మళ్లీ పుంజుకున్నారు. చివరిసారిగా 2015లో షారూక్‌ ఖాన్‌ సినిమా దిల్‌వాలేలో నటించారు.

మొదటినుంచి రాజకీయాల్లో చురుకుగా వ్యవరించిన ఖన్నా, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నుంచి బీజేపీ తరఫున నాలుగుసార్లు లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం అక్కడి నుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  



ప్రముఖుల సంతాపం

వినోద్‌ ఖన్నా మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులు, బాలీవుడ్‌ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఖన్నా మృతితో దేశ సినీపరిశ్రమ అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘గొప్ప నటుడిగా, అంకితభావం కలిగిన నేతగా, మంచి మనిషిగా వినోద్‌ ఖన్నా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన మృతి వార్త విని ఎంతో బాధపడ్డా.. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఆకట్టుకునే వ్యక్తిత్వంతో సామాన్య ప్రజల్ని వినోద్‌ ఖన్నా ఎంతో ప్రభావితం చేశారని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ అన్నారు.



లోటు తీర్చలేనిది: రజనీకాంత్‌

‘ఇది నాకు వ్యక్తిగతంగా జరిగిన నష్టం. ఇద్దరం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోను కలిసి ప్రయాణించాం’ అని ఆయన సమకాలీన నటుడు శత్రుఘ్న సిన్హా ఆవేదన వ్యక్తంచేశారు. ‘నా ప్రియమిత్రుడు వినోద్‌ ఖన్నా లేని లోటు తీర్చలేనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే సంజయ్‌ దత్, కరణ్‌ జోహర్, పరేష్‌ రావల్, అజయ్‌ దేవ్‌గణ్, అనుష్క శర్మ, సోనాక్షీ సిన్హా, తీవ్ర సంతాపం తెలిపారు.



బాహుబలి ప్రీమియర్‌ షో రద్దు

వినోద్‌ ఖన్నా మృతి నేపథ్యంలో బాలీవుడ్‌లో గురువారం సాయంత్రం ప్రదర్శించాల్సిన బాహుబలి సినిమా ప్రీమియర్‌ షోను రద్దు చేశారు. ఈ మేరకు దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, నిర్మాత కరణ్‌ జోహర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top