ఆ పదేళ్ల బాలిక బిడ్డకు బాధ్యులెవరు?

ఆ పదేళ్ల బాలిక బిడ్డకు బాధ్యులెవరు? - Sakshi


న్యూఢిల్లీ: సమీప బంధువు లైంగిక దాడి కారణంగా గర్భవతి అయిన చండీగఢ్‌కు చెందిన పదేళ్ల బాలికకు గురువారం నాడు వైద్యులు విజయవంతంగా సిజేరియన్‌ చేసి బిడ్డకు ప్రసవం చేసిన  విషయం తెల్సిందే. ఏడు నెలలకే పురుడు పోసుకున్న ఆ శిశువుకు ఇప్పుడు తండ్రెవరు? తల్లెవరు? కామాంధుని చేతిలో బలైన ఆ పదేళ్ల బాలిక గర్భస్రావానికి అనుమతించని చండీగఢ్‌ డివిజనల్‌ కోర్టు, సుప్రీం కోర్టు ఈ ప్రశ్నకు సమాధానం చెబుతాయా? సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తాయా? తన పేగును పంచుకొని కడుపులో ఓ బిడ్డ పెరుగుతుందని, చివరకు కోర్టులు, డాక్టర్ల జోక్యం వల్ల ఆ పేగును తెంచుకొని ఆ బిడ్డ పుట్టిందని ఇప్పటి వరకు తెలియని మైనర్‌ బాలికకు రేపు తెలిస్తే పరిస్థితి ఏమిటీ? అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు?



సమీప బంధువు చేతిలో పలు మార్లు అత్యాచారానికి గురైన బాలికకు ఆమె గర్భవతి అయిన విషయం కూడా తెలియదట. కడుపునొప్పి కారణంగా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడు ఆమె కడుపులో ఓ పిండం పురుడు పోసుకుంటున్న విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసింది.  ఆ బాలికకు ఈ విషయం చెప్పకుండానే ఆమెకు అబార్షన్‌ చేయించాలని తల్లిదండ్రులు చూశారు. మైనర్‌ బాలికలు లైంగిక దాడులకు గురైన సందర్భాల్లో గర్భవతి అయిన 20 వారాల్లోపైతేనే అబార్షన్‌కు భారత్‌లోని చట్టాలు అనుమతిస్తాయి. అప్పటికే 20 వారాలు దాటి పోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు వైద్యుల సలహాపై చండీగఢ్‌ డివిజనల్‌ కోర్టును ఆశ్రయించారు. అప్పటికే పుట్టే బిడ్డకు 26 వారాలని తెలసి అబార్షన్‌కు అనుమతించేందుకు కోర్టు నిరాకరించింది. తల్లిదండ్రులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.



సుప్రీం కోర్టు కేసును విచారించి, వైద్యుల బృందం సలహా తీసుకొని తీర్పు చెప్పే నాటికి బాలిక కడుపులో బిడ్డకు 32 వారాలు దాటింది. ఇంతకుముందు ఓ కేసులో 26 వారాల గర్భస్త్ర పిండం ఉన్నప్పటికీ ఓ మైనర్‌ అబార్షన్‌కు సుప్రీం కోర్టు అనుమతించడం ఇక్కడ గమనార్హం. కేవలం ఆరు వారాలు ఆలస్యమైందన్న కారణంగా చండీగఢ్‌ డివిజనల్‌ కోర్టు అబార్షన్‌కు అనుమతించేందుకు నిరాకరించింది. ఇలాంటి కేసుల్లో తన విచక్షణాధికారాలను ఉపయోగించి తీర్పు చెప్పాల్సిన సుప్రీం కోర్టు వెంటనే తీర్పు చెప్పకుండా వైద్యులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి సలహా కోరింది. గర్భస్థ శిశువుకు 30 వారాలు దాటిన నేపథ్యంలో అబార్షన్‌ చేసినట్లయితే ఇటు తల్లికి, అటు బిడ్డకు ప్రాణాపాయమని వైద్యుల బృందం తేల్చిచెప్పింది. కోర్టు ఏర్పాటు చేసిన వైద్యుల బృందంలోలేని మరికొంత మంది వైద్యులు తల్లికి ఎలాంటి ప్రాణాపాయం ఉండదని తేల్చి చెప్పారు. ఇలాంటి కేసుల్లో తల్లికి ప్రాణాపాయం ఉందా, లేదా? అన్న అంశాన్ని కోర్టులు పరిగణలోకి తీసుకొని ఉంటే బాగుండేది.



పదేళ్ల బాలిక అబార్షన్‌ కేసును సకాలంలో సుప్రీం కోర్టు విచారించి ఉన్నట్లయితే పరిష్కారం కచ్చితంగా లభించేది. పుట్టబోయే బిడ్డ వద్దనుకోవడం వల్లనే అబార్షన్‌ కోరుకున్నారు కనుక, తల్లి ప్రాణాలకు ముప్పుందా, లేదా అన్న అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నా సమస్యకు పరిష్కారం లభించేది. ఇలా మైనర్లను వేదన కు గురిచేయడం కూడా సంస్థాగత హింసే అవుతుంది. 18 ఏళ్లలోపు మైనర్లు, ముఖ్యంగా అత్యాచారాల కారణంగా ఆబార్షన్లు అనుమతించాలని కోరుతున్నారు. ఆ మేరకు చట్టాలను మార్చడం ఎంతైనా సముచితం. అలాంటి అబార్షన్‌ కేసులను కూడా మెడికల్‌ ఎమర్జీన్సీ కేసుల కింద పరిగణించడం మరింత మంచిది. ఈ విషయంలో మహిళలకు అబార్షన్‌ హక్కులు కల్పించాలంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ‘మై బాడీ మై చాయిస్‌’ అంటూ ఆందోళనలు కూడా చేస్తున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top