గాజుపెంకులు పెట్టొద్దన్నారు..

గాజుపెంకులు పెట్టొద్దన్నారు.. - Sakshi

  • డీఆర్‌డీవోలో ఉన్నపుడు భవనం చుట్టూ ఉండే ప్రహరీపై గాజు పెంకులు పెడదామని సహచరులు సూచిస్తే... పక్షులకు గాయాలవుతాయని కలాం అంగీకరించలేదు.

  • డీఆర్‌డీవోలో సహచరుడొకరు పిల్లలను ఎగ్జిబిషన్‌కు తీసుకెళతానని చెప్పి వాగ్దానం చేసి పని ఒత్తిడిలో మర్చిపోయారు. కలాం స్వయంగా తానే సహచరుడి పిల్లలను ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లారు.

  • రాష్ట్రపతి అయ్యాక తొలిసారిగా కేరళకు వెళ్లిన కలాం తిరువనంతపురంలో రాజ్‌భవన్‌కు ఆహ్వానించిన వారిలో రొడ్డుపక్కనుండే ఓ చిన్న హోటల్ యజమాని కూడా ఉన్నారు. శాస్త్రవేత్తగా అక్కడ పనిచేసిన కాలంలో కలాం ఆ చిన్నిహోటల్‌లోనే భోజనం చేసేవారు. ఏళ్ల తర్వాత కూడా ఆ హోటల్ యజమానికి గుర్తుపెట్టుకొని రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు తన మూలాలను ఏనాటికీ మరువని మహామనిషి.

  • అది 2002. చెన్నైలో అన్నా యూనివర్సిటీలో కలాం తనకెంతో ఇష్టమైన పని చేస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ప్రధాని వాజ్‌పేయి నుంచి ఫోన్. క్లాస్‌రూములో ఉన్నందువల్ల ఫోన్‌ను రిసీవ్ చేసుకోలేకపోయారు. బయటికొచ్చాక ప్రధానికి కాల్ చేశారు. వాజ్‌పేయి... ‘రాష్ట్రపతి పదవి చేపడతారా?’. గంట సమయం అడిగారు కలాం.

  • ఈలోగా హితులు, శ్రేయోభిలాషులు, మిత్రులతో మాట్లాడారు. 60 శాతం మంది బాగుంటుందని చెబితే, 40 శాతం వద్దన్నారు. మెజారిటీ వైపే మొగ్గారు కలాం. ఎందుకో తెలుసా... రాష్ట్రపతి అయితే దేశం గురించి, విద్య గురించి, యువత గురించి తన ఆలోచనలను పంచుకోవడానికి ఓ పెద్ద వేదిక దొరుకుతుందనేది ఆయన భావన.

  • కలాం ప్రతిరోజూ 250-400 మంది దాకా పిల్లలను కలిసేవారు. ఆయన ప్రమాణ స్వీకారానికి సైతం దేశం నలుమూలల నుంచి 100 మంది చిన్నారులను ఆహ్వానించారు.

  •  పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే... ‘ఎందుకో జరగలేదంతే’ అనేది కలాం సమాధానం. ఇంత పెద్ద కుటుంబంలో (ఐదుగురు అబ్బాయిలు, ఒక సోదరి) ఒక్కరు పెళ్లి చేసుకోకపోతే నష్టమేంటి. వీరిలో చాలామందికి నేను అండగా ఉన్నాను. బంధువులతో టచ్‌లో ఉంటాను. ఎప్పుడూ ఒంటరితనం ఫీలవ్వలేదు’ అని చెప్పేవారయన.

  •  రాష్ట్రపతిగా కలాం ప్రమాణ స్వీకారానికి 64 మంది బంధువులు వచ్చారు. వారందరి ప్రమాణ, బస ఏర్పాట్లకు ఖర్చును ఆయనే పెట్టుకున్నారు.

  •  కలాం శాఖాహారి. 1950లో తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో స్కాలర్‌షిప్‌తో చదువుకున్నారు. స్కాలర్‌షిప్ కింద వచ్చే డబ్బుతో మాంసం, చేపలు తినడం అయ్యే పనికాదని మానేశారు. ‘ఆర్థిక పరిస్థితులే నన్ను శాఖాహారిని చేశాయి. అయితే నాకు అదే నచ్చడంతో అలా శాఖాహారిగానే ఉండిపోయాను’ అని ఒక సందర్భంలో చెప్పారు.

  •  కర్ణాటక సంగీతం వినడం ఆయనకు ఎంతో ఇష్టం. ‘ఎందరో మహానుభావులు’ అనే త్యాగరాజ కీర్తనను అమితంగా ఇష్టపడేవారు. ‘హైదరాబాద్‌లో ఉన్నపుడు వీణ నేర్చుకున్నాను. మేడమ్ కల్యాణి అని గొప్ప టీచర్’ అని ఒకసారి గుర్తుచేసుకున్నారాయన.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top