పార్టీ టికెట్లు అమ్ముకుంటూ.. స్టింగ్‌కు దొరికేశాడు

పార్టీ టికెట్లు అమ్ముకుంటూ.. స్టింగ్‌కు దొరికేశాడు - Sakshi


పంజాబ్‌లో ఎన్నికలకు వెళ్లడానికి తమ దగ్గర డబ్బులు లేవంటూ సాక్షాత్తు పార్టీ ముఖ్య నాయకుడే చెప్పారు కదా అనుకున్నారో ఏమో గానీ.. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ కన్వీనర్ ఓ కార్యకర్తకు టికెట్ ఇప్పిస్తానంటూ అతడి దగ్గర డబ్బులు తీసుకుంటూ దొరికిపోయారు. దాంతో పార్టీ రాష్ట్రశాఖ కన్వీనర్ సుచా సింగ్ ఛోటేపూర్‌పై బహిష్కరణ వేటు వేయాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఛోటేపూర్‌పై చర్య తీసుకోవాలంటూ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దాదాపు 25 మంది పంజాబ్ అగ్రనేతలు లేఖ రాశారు.



అయితే, ఇదంతా తన సొంత పార్టీ వాళ్లు చేసిన కుట్రేనని, ఆరోపణలు నిరాధారమని ఛోటేపూర్ అంటున్నారు. అన్ని విషయాలూ త్వరలోనే వెల్లడిస్తానన్నారు. కానీ ఛోటేపూర్ డబ్బులు తీసుకుంటుండగా స్టింగ్ ఆపరేషన్ చేశామని, ఆ వీడియో ఇప్పటికే అధిష్ఠానం వద్దకు వెళ్లిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీలో అవినీతికి చోటు లేదని, సాక్ష్యాధారాలు అగ్రనేతలకు చేరితే ఛోటేపూర్‌పై తప్పకుండా కఠినచర్యలు ఉంటాయని పార్టీ అధికార ప్రతినిధి హిమ్మత్‌సింగ్ షేర్‌గిల్ చెప్పారు.



అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్థుడైన ఛోటేపూర్ గత ఎన్నికల్లో గురుదాస్‌పూర్ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల పంపిణీపై ఛోటేపూర్ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు, కేజ్రీవాల్‌కు చెడిందని చెబుతున్నారు. ఇప్పటికి రెండు జాబితాలను పార్టీ విడుదల చేసినా, రెండుసార్లూ ప్రెస్‌మీట్లలో ఛోటేపూర్ లేరు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top