మేమొస్తే 24 గంటల కరెంట్

మేమొస్తే 24 గంటల కరెంట్ - Sakshi


తాగునీరు సామాన్యుడి హక్కుగా మారుస్తాం

ఎన్నికల మేనిఫెస్టోలో ఆప్ హామీలు

మహిళల భద్రత కోసం 10 లక్షల సీసీటీవీ కెమెరాలు

 

 సాక్షి, న్యూఢిల్లీ: గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి విజయం కట్టబెట్టడంలో ముఖ్య పాత్ర పోషించిన హామీలనే ఆప్ మళ్లీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. తాగునీరు, విద్యుత్ అంశాలకు పెద్దపీట వేస్తూ మొత్తం 70 హామీలతో శనివారం ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని, తాగునీటిని సామాన్యుడి హక్కుగా మారుస్తామని, మహిళల భద్రత కోసం నగరంలో 10 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామని హామీలు గుప్పించింది. ఈ మేనిఫెస్టో కేవలం ఎన్నికల పత్రం కాదని.. తమకు గీత, బైబిల్, ఖురాన్, గురుగ్రంథ్ సాహెబ్ అని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అధికారంలోకి రాగానే ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

 

 అలాగే వచ్చే ఐదేళ్లలో దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే ఢిల్లీలోనే వ్యాట్ తక్కువ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ‘అమెరికా అధ్యక్షుడి పర్యటన సందర్భంగా 15 వేల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మన తల్లులు, చెల్లెళ్ల భద్రత కోసం అవే ఏర్పాట్లు ఎందుకు చేయకూడదు. మేం పగ్గాలు చేపడితే నగరంలో 10-15 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. ప్రతి బస్సులో ఒక సెక్యూరిటీ గార్డును పెడతాం. ప్రస్తుతం ఉన్న హోంగార్డులనే ఈ సేవలకు వినియోగిస్తాం. వారి కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి, పూర్తిస్థాయి ఉద్యోగులుగా పరిగణిస్తాం’’అని కేజ్రీవాల్ తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీలో రిటైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించబోమని స్పష్టంచేశారు. అలాగే విద్యుత్ రేట్లను సగానికి సగం తగ్గిస్తామని గత హామీని పునరుద్ఘాటించారు. ఢిల్లీ అభివృద్ధి కోసం బీజేపీకి కనీసం ఓ ఎజెండా కూడా లేదని, అందుకే మేనిఫెస్టో విడుదల చేయలేదని విమర్శించారు.

 

 మేనిఫెస్టోలో ముఖ్యమైన హామీలివీ..

 నీటి మాఫియాకు కళ్లెం. ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా.

 ప్రభుత్వఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలుగానే కొనసాగింపు.

 ప్రతి గ్రామంలో స్కూలు, ఆసుపత్రి. బలవంతపు భూస్వాధీనాల నిలిపివేత.

 కొత్తగా 900 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. ప్రభుత్వాసుపత్రుల్లో అదనంగా 30 వేల పడకలు.

 అత్యాచారం కేసుల సత్వర విచారణకు 47 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు. 10 వేల మంది హోంగార్డులతో మహిళా సురక్షా దళ్. 1984లో సిక్కుల ఊచకోత కేసుపై విచారణకు సిట్ ఏర్పాటు.

 ఢిల్లీ మురికివాడలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో 2 లక్షల మరుగు దొడ్ల ఏర్పాటు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top