పెట్రోల్‌పై 54 పైసల తగ్గింపు

పెట్రోల్‌పై 54 పైసల తగ్గింపు - Sakshi


మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి..

డీజిల్ తగ్గింపుపై మోదీ తిరిగొచ్చాక నిర్ణయం


 

 న్యూఢిల్లీ: పెట్రోల్ ధర లీటరుకు స్వల్పంగా 54 పైసలు తగ్గింది. స్థానిక పన్నుల్లోనూ తగ్గింపు కలుపుకుంటే ప్రాంతాల వారీగా మరికొంత తగ్గనుంది. తగ్గింపు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో లీటరు ధర 65 పైసలు తగ్గి రూ.67.86కు, ముంబైలో 68 పైస లు దిగి రూ. 75.73కు చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గడంతో ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్ ధర తగ్గించాయి. దీని ధర గత నెల 31న రూ.1.50 తగ్గడం తెలిసిందే. కాగా, 14.2 కేజీల సబ్సిడీయేతర గృహోపయోగ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 21 తగ్గింది. ఢిల్లీలో దీని ధర రూ. 901 నుంచి రూ.880కి చేరుకుంది. విమాన ఇంధన ధర కిలోలీటరు3శాతం తగ్గి, రూ.67,525కు చేరింది.



లీటరు డీజిల్‌పై రూపాయి లాభం..



కాగా, ఐదేళ్లలో తొలిసారి కిందికి దిగనున్న డీజిల్ ధర తగ్గింపుపై నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నుంచి స్వదేశానికి తిరిగొచ్చేంతవరకు వాయిదా వేశారు. చమురు కంపెనీలకు నష్టాలు పూడ్చుకోవడానికి లీటరు డీజిల్‌పై ప్రతినెలా 40 నుంచి 50 పైసలు పెంచుకునేందుకు కేంద్ర కేబినెట్ 2013 జనవరిలో అనుమతించినప్పటినుంచి ధర తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అధికారం తనకు లేదని చమురు శాఖ భావిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల తగ్గుదల కారణంగా ఈ కంపెనీలకు సెప్టెంబర్ 16 నుంచి లీటరు డీజిల్ అమ్మకంపై వస్తున్న 35 పైసల లాభం ప్రస్తుతం ఒక రూపాయికి పెరిగింది. ధరల స్థితిగతులపై చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. మోదీకి లేఖ రాసినట్లు సమాచారం. మహారాష్ట్ర, హర్యా నా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధర తగ్గింపునకు అనుమతి కోసం ఆ శాఖ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిందని, తగ్గింపుపై మోదీ వచ్చాక నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు చెప్పాయి. ప్రైవేటు చమురు కంపెనీలు అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా డీజిల్, పెట్రోల్ రేట్లను నిర్ధారిస్తున్నందున,ప్రభుత్వ కంపెనీల రక్షణ కోసం డీజిల్ ధర తగ్గించాలని చమురు శాఖ కోరుతోంది.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top