ఉత్తరాదిన వరద విలయం

ఉత్తరాదిన వరద విలయం - Sakshi


► బిహార్, యూపీ, ఈశాన్య రాష్ట్రం అస్సాంలో 473 మంది మృతి

► సహాయక చర్యల్లో ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు




లక్నో: దేశ ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బిహార్, ఉత్తర ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో వరదలకు 473 మంది ప్రాణాలు కోల్పోగా కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు. ఆర్మీతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నాయి. మరోవైపు ఆదివా రం కూడా ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తడంతో ట్రాఫిక్‌ కష్టాలు తప్పలేదు

ఉత్తర ప్రదేశ్‌లో వరద పరిస్థితి ఆదివారం నాటికి మరింత విషమించింది. మృతుల సంఖ్య 69కి చేరగా.. రాష్ట్రంలోని మొత్తం 24 జిల్లాల్లో 20 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నారు. 2,523 గ్రామాలు నీట మునిగాయని పునరావాస శాఖ వెల్లడించింది.


పశ్చిమ యూపీ జిల్లాల్లో మొత్తం 39,783 మందిని సహాయక శిబిరాలకు తరలించామని, నేపాల్‌ వైపు నుంచి వరద ప్రవాహం తగ్గకపోవడంతో పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని ఆ శాఖ పేర్కొంది. వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, పీఏసీ(యూపీ ఆర్మ్‌డ్‌ కానిస్టేబుల్స్‌) సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారు. 20 కంపెనీల ఎన్డీఆర్‌ఎఫ్, 29 కంపెనీల పీఏసీ సిబ్బందితో పాటు ఆర్మీ కూడా సాయమందిస్తోంది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్ల సాయంతో ముంపు ప్రాంతాలకు ఆహారం, నీరు చేరవేస్తున్నారు. యూపీలో శారద, ఘాఘ్రా, రాప్తీ, బుధి రాప్తీ, రోహిణ్‌ నదులు ఇంకా ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని కేంద్ర జల సంఘం వెల్లడించింది.  



బిహార్‌లో 253 మంది మృతి

బిహార్‌లో వరద మృతుల సంఖ్య 253కి చేరింది. అరారియా జిల్లాలో అత్యధికంగా 57 మంది మరణించారు. 18 జిల్లాలో 1.21 కోట్ల మంది వరదల్లో చిక్కుకున్నారు. 1,336 కేంద్రాలు ఏర్పాటు చేసి 4.22 లక్షల మందికి పునరావాసం కల్పిస్తున్నారు. 28 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 16 రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.అస్సాంలో మూడుసార్లు సంభవించిన వరదలకు ఇంతవరకూ 151 మంది మరణించారు.


తాజాగా దుబ్రి, మోరిగావ్, గోలాఘాట్‌ జిల్లాలో మూడు మరణాలు సంభవించాయి. 16 జిల్లాల్లో 22 లక్షల మంది ఇంకా ముంపులోనే ఉన్నారని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. మొత్తం 328 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది. కాగా వరుసగా రెండో రోజు ఆదివారం కూడా ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. పల్లపు ప్రాంతాలు నీటమునగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు.



కజిరంగ పార్కులో 346 జంతువులు మృతి

ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన అస్సాంలోని ప్రఖ్యాత కజిరంగ జాతీయ పార్కులో వరద ధాటికి 346 జంతువులు మృత్యువాత పడ్డాయి. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉండటంతో ఈ పార్కుకు వరద తాకిడి ఎక్కువగా ఉంటుంది. గతనెల నుంచి ఇప్పటికి మూడు సార్లు పార్కుకు వరద రాగా మూడోసారి 239 జంతువులు చనిపోయాయి.


వాటిలో 200కు పైగా జింకలే ఉండటం బాధాకరం. 15 ఖడ్గ మృగాలు, ఒక బెంగాల్‌ పులి, నాలుగు ఏనుగులు, నాలుగు అడవి పందులు, రెండు అడవి దున్నలు కూడా వరదల్లో చిక్కుకుని మరణించాయి. 430 చ.కి.మీ ఉన్న కజిరంగా పార్కులో వరదఉధృతంగా ఉన్నప్పుడు 87 శాతం భూభాగం నీట మునిగింది. ఇప్పటికీ 22 శాతం భూభాగం నీటిలోనే ఉంది. 1988లో వరదలు వచ్చినప్పుడు ఈ పార్కులో అత్యధికంగా 1,203 జంతువులు చనిపోయాయి.  



25 శాతం భూభాగంలో లోటు వర్షపాతం

న్యూఢిల్లీ: ప్రస్తుత నైరుతి రుతుపవనాల కాలంలో ఇప్పటివరకు దేశంలోని నాలు గింట ఒక వంతు (25%) భూ భాగంలో లోటు వర్షపాతం నమోదైంది. అయితే రుతుపవన కాలం ముగిసే సెప్టెంబర్‌ లోపు ఆ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభా గం (ఐఎండీ) ఆశాభావం వ్యక్తం చేస్తోం ది. ఈ వర్షా కాలంలో ఇప్పటికి దేశవ్యా ప్తంగా సగటున 5 శాతం లోటు వర్షపాతం నమోదైంది.


నాలుగింట ఒక వంతు భూ భాగంలో మాత్రం లోటు మరింత ఎక్కువగా ఉందని ఐఎండీ వెల్లడించింది. మహారాష్ట్రలోని విదర్భ, మరఠ్వాడ ప్రాం తాల్లో 32%, కర్ణాటకలోని ఉత్తర, దక్షిణ భాగాల్లో 20 నుంచి 25% వరకు లోటు వర్షపాతం నమోదైందనీ, కేరళ, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతా ల్లోనూ వర్షాలు సరిగా కురవలేదని ఐఎం డీ పేర్కొంది. అయితే ఆయా ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలయ్యా యనీ, సెప్టెంబర్‌ ఆఖరు కల్లా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top