6 లక్షల లీటర్ల రక్తం వృథా

6 లక్షల లీటర్ల రక్తం వృథా - Sakshi


ఒకవైపు అత్యవసరమైన ఆపరేషన్ల కోసం రక్తం కావాలంటూ నిరంతరం చాలామంది కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతారు. కానీ మరోవైపు బ్లడ్ బ్యాంకులు, ఆస్పత్రుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల భారీగా రక్తం వృథా అవుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన ఐదేళ్లలో ఇలా వృథా అయిన రక్తం మొత్తం 28 లక్షల యూనిట్లు!! లీటర్లలో చెప్పాలంటే మొత్తం 6 లక్షల లీటర్ల రక్తం వృథా అయ్యింది. 53 వాటర్ ట్యాంకర్లు నింపడానికి ఇది సరిపోతుంది. వాస్తవానికి మన దేశంలో ఏడాదికి 30 లక్షల యూనిట్ల రక్తం రోగులకు అందడం లేదు. హోల్ బ్లడ్, ప్లాస్మా, ప్లేట్‌లెట్లు దొరక్కపోవడం వల్ల గర్భిణుల మరణాలు తరచు సంభవిస్తున్నాయి. ప్రమాదాలలో కూడా మృతుల సంఖ్య పెరగడానికి సమయానికి రక్తం అందకపోవడమే ప్రధాన కారణం.



బ్లడ్ బ్యాంకులలో రక్తాన్ని కొంతకాలం పాటు నిల్వ ఉంచవచ్చు. కానీ ఆ తర్వాత అది ఎందుకూ పనికిరాదు. ఇలా రక్తాన్ని వృథా చేస్తున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ముందున్నాయి. కేవలం 2016-17 సంవత్సరంలోనే 6.57 లక్షల యూనిట్ల రక్తం, దాని ఉత్పత్తులను వృథాగా పారేశారు. సాధారణంగా హోల్ బ్లడ్‌ను గానీ ఎర్ర రక్తకణాలను గానీ 35 రోజుల్లోగా వాడేయాల్సి ఉంటుంది. కానీ ప్లాస్మా అయితే ఏడాది వరకు ఉంచచ్చు. వృథా అవుతున్న దాంట్లో 50 శాతం ప్లాస్మా కూడా ఉండటం మరీ దారుణం. చేతన్ కొఠారీ అనే వ్యక్తి దేశవ్యాప్తంగా రక్తం వాడకం గురించి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో) ఈ సమాధానాలు ఇచ్చింది. పది లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించి అందరికంటే ముందున్న మహారాష్ట్ర.. వృథాలో కూడా ముందే ఉంది. రక్త సేకరణలో రెండు, మూడు స్థానాల్లో పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. వృథా చేయడంలో మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.



ప్రధానంగా బ్లడ్ బ్యాంకులు, ఆస్పత్రుల మధ్య సమన్వయం లేకపోవడం.. రక్తాన్ని గురించిన సమాచారాన్ని పంచుకునే నెట్‌వర్కులు పటిష్టంగా లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని తెలుస్తోంది. రక్తదాన శిబిరాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నా, వాటిలో చాలావరకు ప్రచారానికి మాత్రమే పనికొస్తున్నాయి తప్ప అక్కడినుంచి రక్తాన్ని సరిగా బ్లడ్ బ్యాంకులకు చేర్చడం లేదన్న అపవాదు కూడా ఉంది. క్యాంపులలో ఏకంగా వెయ్యి నుంచి 3వేల యూనిట్ల వరకు రక్తాన్ని సేకరిస్తున్నారని, దీన్నంతటినీ నిల్వ చేయడానికి తమకు స్థలం కూడా ఉండట్లేదని ఒక రక్తనిధి నిర్వాహకురాలు చెప్పారు. దానికంటే ప్రతి మూడునెలలకు ఒకసారి నేరుగా బ్లడ్ బ్యాంకులకు వెళ్లి రక్తదానం చేస్తే మంచిదని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top