500 మంది మతమార్పిడి

500 మంది మతమార్పిడి

  • గుజరాత్‌లో క్రైస్తవులను హిందువులుగా మార్చిన వీహెచ్‌పీ

  •  కేరళలో 30 మంది దళిత క్రైస్తవులను కూడా...

  •  క్రైస్తవులందరినీ మార్చేదాకా  మార్పిడి సాగుతుందని వెల్లడి

  •  హిందుత్వాన్ని కాపాడే మా ప్రభుత్వం వచ్చింది: సింఘాల్

  • వాల్సద్ (గుజరాత్)/అలప్పుజ (కేరళ): ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఇటీవల 200 మంది ముస్లింలను హిందూ మతంలోకి ధరమ్ జాగరణ్ సమితితోపాటు ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ బజ్‌రంగ్ దళ్ మార్చడంపై దుమారం చెలరేగుతుండగానే గుజరాత్, కేరళలలోనూ తాజాగా మతమార్పిళ్లు చోటుచేసుకున్నాయి. గుజరాత్‌లోని వాల్సద్‌లో ఉన్న అర్నాయ్ గ్రామంలో శనివారం 100 కుటుంబాలకు చెందిన 500 మంది గిరిజన క్రైస్తవులను హిందూ మతంలోకి మార్చిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆదివారం కేరళలోని అలప్పుజ జిల్లాలో 8 కుటుం బాలకు చెందిన 30 మంది దళిత క్రైస్తవులను తిరిగి హిందూ మతంలోకి చేర్చింది.



    వాల్సద్‌లో గిరిజనులను తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానించే ముందు మహా యజ్ఞం నిర్వహించిన వీహెచ్‌పీ అనంతరం వారందరికీ భగవద్గీతలు, రాముని పటాలు, రుద్రాక్ష మాలలను అందించింది. గతంలో క్రైస్తవంలోకి మారిన వీరంతా తిరిగి హిందూ మతంలోకి వచ్చేందుకు సుముఖత చూపడంతో ఈ కార్యక్రమం (ఘర్ వాపసీ) నిర్వహించినట్లు వీహెచ్‌పీ స్థానిక నేత అజిత్ సోలంకి తెలిపారు. క్రైస్తవులంతా స్వచ్ఛందంగానే తిరిగి మతం మార్చుకున్నారన్నారు. హిం దూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన గిరిజనులకు ముందుగా ఆశచూపినట్లుగా తిం డి, విద్య లభించలేదన్నారు.



    క్రైస్తవులంతా తిరిగి హిందూ మతంలోకి వచ్చేంత వరకూ ‘ఘర్ వాపసీ’ ప్రక్రియను కొనసాగిస్తామన్నారు.కాగా, స్వచ్ఛంద కార్యక్రమం కావడం వల్ల ఇందులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని గుజరాత్ ప్రభుత్వ ప్రతినిధి నితిన్ పటేల్ తెలిపారు. ఇక కేరళలోని కాణిచానల్లోర్‌లో ఉన్న ఓ గుడిలో ఘర్ వాపసీ కార్యక్రమంలో ఎనిమిది దళిత క్రైస్తవ కుటుంబాలకు చెందిన 30 మందిని తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చారు. మరో 150 క్రైస్తవ కుటుంబాలు తిరిగి హిందూమతం పుచ్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేశాయని కేరళ వీహెచ్‌పీ నేత పాడిక్కల్ తెలిపారు. కాగా, ఆగ్రాలో ముస్లింల మతమార్పిడి మోసపూరితమని యూపీ మైనారిటీ కమిషన్ పేర్కొంది.

     

    ‘హిందూ జనాభా 100 శాతానికి చేరుస్తాం’



    భోపాల్: దేశంలో హిందూ జనాభాను ప్రస్తుతమున్న 82 శాతం నుంచి 100 శాతానికి చేరుస్తామని వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఆదివారమిక్కడ అన్నారు.  హిందువుల సంఖ్య సగానికి పడిపోయి మైనారిటీల స్థాయికి పడిపోవడాన్ని ఉపేక్షించబోమన్నారు.

     

    ఆ చట్టం బాధ్యత విపక్షాలదే: అమిత్



    సాక్షి, చెన్నై: సంఘ్ పరివార్‌కు చెందిన కొన్ని సంస్థలు బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతుండటంపై దుమారం రేగిన నేపథ్యంలో మతమార్పిళ్ల నిరోధక చట్టం తెచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని...అందుకు మద్దతివ్వాల్సిన బాధ్యత విపక్షాలదేనని బీజేపీ చీఫ్ అమిత్ షా పేర్కొన్నారు. లౌకికవాదులమని చెప్పుకొనే ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వం తేవాలనుకుంటున్న మతమార్పిళ్ల నిరోధక చట్టానికి మద్దతిచ్చే దమ్ముందా? అని చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ షా సవాల్ విసిరారు. అభివృద్ధి ఎజెండా నుంచి తమ ప్రభుత్వాన్ని ఎవరూ పక్కకు నెట్టలేరని షా వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోనే కూటమి ఉంటుందని, సీఎం అభ్యర్థి పేరు ప్రకటించాకే ఎన్నికల్లోకి వెళ్తామన్నారు.

     

    భాగవత్ వ్యాఖ్యలపై మోదీ మౌనమేల?




    సంఘ్ పరివార్ సంస్థలు చేపడుతున్న మతమార్పిళ్లను సమర్థించడంతోపాటు దీన్ని వ్యతిరేకించే పార్టీలు దమ్ముంటే మతమార్పిళ్ల నిరోధక చట్టానికి మద్దతివ్వాలంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, సీపీఎం మండిపడ్డాయి. ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించాయి.

     

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top