కేజ్రీవాల్ వీటికి బదులివ్వు!

ఢిల్లీలోని తాజ్ ఎన్ క్లేవ్ గీతా కాలనీలో ఎన్నికల ప్రచారంలో కిరణ్ బేడీ


* ఆప్ అధినేతకు ఐదు ప్రశ్నలు సంధించిన బీజేపీ

* కాంగ్రెస్ మద్దతు తీసుకోనని చెప్పి ఎందుకు మాట తప్పారని నిలదీత

* ఇకపై ప్రతిరోజూ ఐదు ప్రశ్నలు అడుగుతామని వెల్లడి


 

 సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఢిల్లీలో వేడి రాజుకుంటోంది! ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆమ్ ఆద్మీలు వ్యూహ, ప్రతి వ్యూహాల్లో మునిగిపోయాయి. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా ప్రచారం ఉధృతం చేయాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఫిబ్రవరి 5 వరకు ప్రతిరోజూ కేజ్రీవాల్‌కు ఐదు ప్రశ్నలు సంధించనుంది. ఈ మేరకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు. గురువారం ఆయన కేంద్రమంతి నిర్మలా సీతారామన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌కు ఐదు ప్రశ్నలు సంధించారు. ఆప్ మాత్రం దీన్ని తేలిగ్గా తీసుకుంది. ప్రశ్నలు అడగడానికి బదులు ఆ పార్టీ సీఎం అభ్యర్థి కిరణ్‌బేడీని కేజ్రీవాల్‌తో చర్చకు ర ప్పించాలని ఆప్ నేత యోగేంద్ర యాదవ్ సవాలు విసిరారు.

 

 నిస్తేజం వీడండి: అమిత్‌షా

 ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో నిస్తేజంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ ఢిల్లీ విభాగంలోని పలువురు సీనియర్ నేతలపై ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి ఆప్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సమైక్యంగా పోరాడాలని వారికి కరాఖండిగా తేల్చిచెప్పారు. గురువారం జరిగిన బీజేపీ ఢిల్లీ విభాగం సమావేశంలో అమిత్‌షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో షా మాట్లాడుతూ.. పార్టీ ముఖ్యంత్రి అభ్యర్థిగా ప్రకటించిన కిరణ్‌బేడీకి ప్రతి ఒక్కరూ మద్దతుగా ఉండాలని.. ఎలాంటి క్రమశిక్షణా రాహిత్యాన్నీ సహించేది లేదని స్పష్టంచేసినట్లు సమాచారం. పార్టీ ఎన్నికల ప్రచారం స్ఫూర్తిదాయకంగా లేదన్నారు.  

 

 త్వరలో మోదీ ర్యాలీలు..

 త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో నాలుగు ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తారని, మొత్తమ్మీద పార్టీ తరఫున 250 ర్యాలీలు జరుపుతామని కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో పలువురు కేంద్రమంత్రులు సహా పార్టీకి చెందిన 120 మంది ఎంపీలు పాలుపంచుకుంటారని మరో కేంద్రమంత్రి అనంత్‌కుమార్ తెలిపారు. బలాన్నంతా కూడదీసుకొని ఎన్నికలకు వెళ్తున్నామని, ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీ సాధించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయబోదని, నగర అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూ విజన్ డాక్యుమెంట్‌ను మాత్రమే వెల్లడిస్తామన్నారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించడంపై పార్టీ నేతల మధ్య ఏర్పడిన భిన్నాభిప్రాయాల కారణంగానే మేనిఫెస్టో విడుదల చేయకూడదని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. మేనిఫెస్టో రూపకల్పనకు కేంద్రమంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. రాష్ట్రానికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాకు మొగ్గుచూపినట్లు తెలిసింది. అయితే పార్టీ అధిష్టానం అందుకు సుముఖంగా లేదని అంటున్నారు. ఈ హోదా కల్పించినట్లయితే ఢిల్లీ పోలీసు విభాగంపై అధికారాన్ని కేంద్ర హోంశాఖ.. రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాల్సి ఉంటుందని, అది అధిష్టానానికి ఇష్టం లేదని చెబుతున్నారు.

 

 బేడీ ఓటరు కార్డు వివాదానికి తెర

 ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీకి రెండు ఓటరు కార్డుల వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. ఈ విషయంలో బేడీకి గురువారం ఎన్నికల కమిషన్ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఢిల్లీలోని తల్కతోరా చిరునామా కలిగిన ఓటరు కార్డును రద్దు చే యాల్సిందిగా ఆమె గతంలోనే తమకు దరఖాస్తు చేసుకున్నారని, ప్రస్తుతం ఉదయ్‌పార్క్ చిరునామా కలిగిన ఓటరు కార్డునే వాడుతున్నారని స్పష్టంచేసింది. కిరణ్ బేడీకి ఉదయ్‌పార్క్, తల్కతోరా లేన్ చిరునామాలతో రెండు ఓటరు కార్డులు ఉన్నట్టు ఆరోపణలు రావడంతో దీనిపై ఈసీ దర్యాప్తుకు ఆదేశించింది. రెండు చిరునామాలతో ఓటరు కార్డులు జారీ అయినా.. తల్కతోరా ఓటరు కార్డును రద్దు చేయాల్సిందిగా బేడీ ఇదివర కే తమను కోరినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టంచేసింది.

 

 బీజేపీ సంధించిన ప్రశ్నలివే

 -    కాంగ్రెస్ మద్దతు తీసుకోబోనని కొడుకుపై ప్రమాణం చేసి చెప్పిన కేజ్రీవాల్ .. తర్వాత ఆ పార్టీ మద్దతుతోనే ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేశారు?

 -    షీలాదీక్షిత్‌పై దర్యాప్తు  కమిటీ వేస్తానని చెప్పి ఎందుకు మాట తప్పారు? ఆమె అవినీతి ఆరోపణలకు సంబంధించిన అంశాలను ఎందుకు

 వెల్లడించలేదు?

 -    తనను తాను సామాన్యుడిగా పేర్కొనే కేజ్రీవాల్... సీఎం అయిన తర్వాత పోలీసు భద్రతను ఎందుకు స్వీకరించారు?

 -    తమ ప్రభుత్వం హంగూ ఆర్భాటాలకు దూరమని అంతకుముందు చెప్పి.. మంత్రివర్గంలోని వారందరికీ అత్యాధునిక వాహనాలు సమకూర్చేందుకు ఎందుకు యత్నించారు?

 -    ప్రమాణ స్వీకారానికి మెట్రోలో వచ్చిన కేజ్రీవాల్.. చందాల వసూలు కోసమంటూ ప్రైవేటు విమానాల్లో బిజినెస్ క్లాస్‌లో ఎలా ప్రయాణించారు?

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top