రెండు రాష్ట్రాలు.. ఐదు విడతలు

రెండు రాష్ట్రాలు.. ఐదు విడతలు - Sakshi


జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా  షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

 

నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు పోలింగ్ డిసెంబర్ 23న ఓట్ల లెక్కింపు

ఢిల్లీలోని మూడు అసెంబ్లీ స్థానాలకూ వచ్చేనెల 25నే ఉప ఎన్నికలు

తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్

కాశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులేవీ లేవన్న ఈసీ


 

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 మధ్య మొత్తం ఐదు దశల్లో ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ వెలువ రించింది. డిసెంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపడతామని తెలిపింది. శనివారమిక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వీఎస్ సంపత్ విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఢిల్లీల్లోని మూడు అసెంబ్లీ స్థానాలకు(కృష్ణానగర్, మెహ్రౌలీ, తుగ్లాబాద్) కూడా నవంబర్ 25నే ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ మూడు స్థానాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న బీజేపీ నేతలు హర్షవర్ధన్, ప్రవేశ్ వర్మ, రమేశ్ బిధురిలు ఎంపీలుగా నెగ్గడంతో ఆయా చోట్ల తిరిగి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్‌ల్లో తక్షణమే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందన్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల వరదలు ముంచెత్తడంతో ఎన్నికలు వాయిదా వేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ముఖ్యంగా అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) పార్టీ వాయిదా కోసం గట్టిగా పట్టుబట్టింది. అయితే ఎన్నికల నిర్వహణకు ఇబ్బందేమీ లేదని వీఎస్ సంపత్ తెలిపారు.



అక్కడి అధికార యంత్రాంగంతో, వివిధ రాజకీయపార్టీలతో పలుమార్లు సమావేశమయ్యామని, అన్ని అంశాలు పరిశీలించాకే ఎన్నికల నిర్వహణకు మొగ్గుచూపినట్లు చెప్పారు. కాగా, ఓటు ఎవరికి వేశారో నిర్ధారించుకునేందుకు ఓటర్లకు రసీదును ముద్రించి చూపే ‘ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ’ విధానాన్ని అమలు చేయనున్నారు. జమ్మూకాశ్మీర్‌లో మూడు, జార్ఖండ్‌లో ఏడు స్థానాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. జమ్మూకాశ్మీర్ శాసనసభ గడువు జనవరి 19, 2015తో పూర్తవనుంది. జార్ఖండ్ అసెంబ్లీకి జనవరి 2, 2015తో గడువు ముగియనుంది. ప్రస్తుతం జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తిమోర్చా, ఆర్జేడీలు మిత్రపక్షాలుగా కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. జమ్మూకాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మిత్రపక్షాలుగా అధికారంలో కొనసాగుతున్నాయి.

 

బాధితులను వదిలి.. రాజకీయాలు: సీఎం ఒమర్



వరద బాధితులను ఆదుకోవాలని తాము భావిస్తుంటే.. మిగతా పార్టీలు రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నాయని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో తుపాను సహాయ కార్యక్రమాలకు విఘాతం ఏర్పడుతుందని పేర్కొంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఎన్నికలకు దూరంగా ఉండే ప్రశ్నే లేదని, తమ శక్తిమేరకు పోరాడతామని చెప్పారు. ‘‘ప్రజలు ఇంకా తుపాను బీభత్సం నుంచి తేరుకోలేదు. బాధితులను ఆదుకోవాల్సిన సమయమిది. కానీ మేం తప్ప మిగతా పార్టీలు దీనిపై దృష్టి పెట్టడం లేదు’’ అని నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అలీ మొహమ్మద్ సాగర్ అన్నారు. కాగా, ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ వెలువరించడాన్ని అధికార పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ స్వాగతించాయి. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 14 లోక్‌సభ స్థానాలకుగాను 12 సీట్లను నెగ్గిన బీజేపీ మంచి ఊపు మీద ఉంది.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top