మైనారిటీ బాలికలకు 40% సీట్లు

మైనారిటీ బాలికలకు 40% సీట్లు


100 నవోదయ తరహా పాఠశాలల్లో రిజర్వేషన్‌: కేంద్ర మంత్రి నక్వీ

న్యూఢిల్లీ: మైనారిటీలకు మెరుగైన విద్యనందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ప్రతిపాదిత 100 నవోదయ తరహా పాఠశాలలు, ఐదు ఉన్నత విద్యా సంస్థల్లో మైనారిటీ బాలికలకు 40 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని నిర్ణయించింది. మైనారిటీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తర్‌ అబ్బాస్‌ నక్వీ చెప్పారు. ఈ వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని, ఈ క్రమంలోనే బాలికలకు 40 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించామని తెలిపారు.


బహురంగాల అభివృద్ధి కార్యక్రమం (ఎంఎస్‌డీపీ) కింద భవనాల నిర్మాణం జరుగుతుందని, సాధ్యమైనంత వరకు వచ్చే ఏడాది ఈ పాఠశాలలను ప్రారంభిస్తామని నక్వీ వెల్లడించారు. ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటుకు ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌ ప్రభుత్వాలు ఆసక్తి చూపాయన్నారు. మైనారిటీల్లో, ముఖ్యంగా ముస్లింలలో విద్యా వెనకబాటుతనాన్ని అధిగమించేందుకు మౌలానా ఆజాద్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ (ఎంఏఈఎఫ్‌) నియమించిన ఉన్నత స్థాయి కమిటీ మూడంచెల విధానాన్ని ప్రతిపాదించింది. కేంద్రియ/నవోదయా తరహా బోధనా విధానంతో ప్రాథమిక, సెంకడరీ, ఉన్నత స్థాయిలో 211 పాఠశాలలు, 25 కమ్యూనిటీ కాలేజీలు, ఐదు విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది.

 

ఎంపీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. ఆదివారం భోపాల్‌లో మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వ హయాంలో  బాలికలు, మహిళలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇప్పుడు వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగాల్లో మన కూతుళ్లకు (యువతులకు) 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు. అయితే.. అటవీ శాఖకు మాత్రం ఈ రిజర్వేషన్ల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. 12వ తరగతిలో 75 శాతం లేదా, సీబీఎస్‌ఈలో 85 శాతం పొందిన విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్‌ విద్య  ఖర్చును బీజేపీ భరిస్తుందని చౌహాన్‌ ప్రకటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top