మాకు 371- డి ఉంది

మాకు 371- డి ఉంది - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 డీ ద్వారా సంక్రమించిన ప్రత్యేక హక్కులు ఉన్నందున తమను నీట్ నుంచి మినహాయించాలని సుప్రీంకోర్టుకు ఏపీ ఉన్నత విద్యామండలి, ఏపీ ప్రభుత్వం విన్నవించాయి. ఈ హక్కులను కొనసాగించేలా.. పునర్ వ్యవస్థీకరణ చట్టం పదేళ్ల పాటు ప్రస్తుతం ఉన్న అడ్మిషన్లను యథాతథంగా కొనసాగించుకునే హక్కును కల్పించినందున తమకు నీట్ వర్తించబోదని వాదించాయి. ఇప్పటికే ఎంసెట్ నిర్వహించుకున్నామని, వాటి ద్వారానే అడ్మిషన్లు కల్పిస్తామని పేర్కొన్నాయి. ‘నీట్’ నుంచి తమను మినహాయించాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్లపై జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్, జస్టిస్ శివకీర్తి సింగ్‌తో కూడిన ధర్మాసనం గురువారం పలు రాష్ట్రాల వాదనలు విన్నది. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 వరకు విచారణ సాగింది.

 

 ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయి: ఏపీ ఉన్నత విద్యామండలి తరపున సీనియర్ న్యాయవాది పీపీ రావు వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలోని ఆర్టిక్ 371-డి ద్వారా ఏపీ, తెలంగాణల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రత్యేకంగా స్థానికతపై రిజర్వేషన్లు ఉన్నాయని వివరించారు. ‘ఈ నిబంధనలు కొనసాగేలా విభజన చట్టం-2014 సెక్షన్ 95లో ఏపీ, తెలంగాణలో మరో పదేళ్లపాటు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అప్పటికే ఉన్న ప్రక్రియను కొనసాగించాలన్నారు. అప్పటికి అమలులో ఉన్న ఎంసెట్ ద్వారా ఏపీలో వైద్య విద్యకు ప్రవేశాలు కల్పిస్తాం’ అని పేర్కొన్నారు.  

 

 తెలుగు మీడియం విద్యార్థులకు ఇబ్బంది: అనంతరం ఏపీ ప్రభుత్వం తరఫున బసవ ప్రభు పాటిల్ వాదిస్తూ ‘తెలుగు మీడియం విద్యార్థులు నీట్ ద్వారా ఇబ్బంది పడతారు.  విద్యార్థులు నష్టపోవడమే కాక ఇప్పటికిప్పుడు సిలబస్‌లోని అంతరాలను పూడ్చడం, పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి తేవడం సాధ్యం కాదు. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పులు కూడా మాకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాయి.. అందువల్ల ఏపీకి నీట్ వర్తించదు..’ అని వాదించారు.  చివరగా తెలంగాణ, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల తరఫు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించేందుకు సిద్ధమవగా శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు విచారిస్తామని, అందరూ ఒక్కో పేజీలో తమ వాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని ధర్మాసనం కోరింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది హరేన్‌రావల్ రెండు నిమిషాల సమయం కోరినా కోర్టు సమ్మతించలేదు.

 

 రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లదు..:  కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ రాష్ట్రాల హక్కులకు  భంగం వాటిల్లదని, కేవలం స్థానిక చట్టాల ఆధారంగానే అడ్మిషన్లు ఉంటాయని వివరించారు. చివరగా ఎంసీఐ తరపున వికాస్ సింగ్ వాదిస్తూ ప్రైవేటుమెడికల్ కళాశాలలు పరీక్షలు నిర్వహించుకునే విధానానికి స్వస్తి పలికేలా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉండాలని కోరగా.. జస్టిస్ అనిల్ దవే స్పందిస్తూ ప్రైవేటు కళాశాలలు పరీక్షలు నిర్వహించుకునే ప్రశ్నే తలెత్తదని స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top