మోదీ మ్యానియా

మోదీ మ్యానియా - Sakshi


వరుస విజయాలతో పెరిగిన బలం, రాష్ట్రపతి ఎన్నికతో సుస్థిరం

ప్రధానమంత్రిగా మూడేళ్లు దేశాన్ని ముందుకు నడిపించాక నరేంద్రమోదీ మరింత బలవంతుడయ్యారు. జనాదరణలో  ఇతర నేతల కన్నా ముందే ఉన్నారు. పాలనా యంత్రాంగంపై గట్టి పట్టుతో పాటు నిరంతరం తన ఇమేజ్‌ను కాపాడుకుంటూ, దాన్ని పెంచుకునే వ్యూహాలు అమలు చేయడంలో ‘నమో’ను మించినవారెవరూ ప్రస్తుతం లేరనే చెప్పాలి.


పన్నెండేళ్లకు పైగా గుజరాత్‌ సమర్థ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని, వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించాక 2013 డిసెంబర్‌తర్వాత పారీ‍్ట(ఎన్డీఏ) ప్రధాని అభ్యర్థిగా నేతలు, కార్యకర్తల ఆమోదం పొందారు మోదీ. 2002 ఆరంభంలో జరిగిన గుజరాత్‌మత ఘర్షణల్లో రెండువేల మంది ప్రాణాలు కోల్పోయాక దేశ ప్రజల ముందు దోషిగా నిలబడిన మోదీ పాలనా సామర్థ్యంతో ఆర్థిక రంగంలో సాధించిన విజయాలతో ఎన్నికల్లో విజేతగా నిలిచారు.



ఘన విజయాలు

భారీ హామీలు, జనం ఆశల మధ్య 2014 మే 26న పాలన ప్రారంభించిన నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ప్రయాణం సాఫీగానే మొదలైంది. తొలి ఏడాది జరిగిన మహారాష్ట్ర,, హరియాణా, జార్ఖండ్, జమూ‍్మ కశ్మీర్‌అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం బాధ్యత భుజాన వేసుకుని మొదటి మూడు రాష్ట్రాల్లో గెలుపు సాధించి, తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రులను గద్దెనెక్కించారు.


కశ్మీర్‌లో పీపుల్స్‌డెమొక్రాటిక్‌పార్టీ(పీడీపీ)కి జూనియర్‌భాగస్వామిగా ప్రభుత్వంలో తొలిసారిగా బీజేపీ చేరింది. మహరాష్ట్ర అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించి శివసేన మద్దతు ప్రకటించకముందే ప్రభుత్వం ఏర్పాటుచేసింది. తప్పనిసరి స్థితిలో శివసేన బీజేపీ కేబినెట్‌లో చేరింది. హరియాణాలో మొదటిసారి సంపూర్ణ మెజారిటీ(47) సంపాదించి అధికారంలోకి వచ్చింది. జార్ఖండ్‌లో దాదాపు మెజారిటీ మద్దతు కూడగట్టి బీజేపీ పాలన చేపట్టింది.



ఓటముల సంవత్సరం 2015

మరుసటి సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన దిల్లీ శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం మూడు సీట్లతో కాషాయపక్షం చతికలపడింది. ఆప్‌నేత అరవింద్‌కేజ్రీవాల్‌జనాకర్షణ శక్తి మందు ‘మోదీ మేజిక్‌’’ పనిచేయలేదు. తర్వాత నవంబర్‌చివర్లో జరిగిన బిహార్‌అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పరివార్‌పక్షాలైన జేడీయూ, ఆరే‍్జడీలు జూనియర్‌భాగస్వామి కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసి బీజేపీపై బ్రహాండమైన విజయం సాధించించాయి.


మతాలవారీగా ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తూ మోదీ ఉధృతంగా చేసిన ప్రచారం వల్ల ఓట్ల శాతం పెరిగిందేగాని సీట్లు బాగా తగ్గిపోయాయి. బిహార్‌సీఎం నితీశ్‌కుమార్‌కు దూరమైన దళిత నేత జీతన్‌రాం మాంఝీతో చేతులు కలిపినా ప్రయోజనం లేకపోయింది. ఈ రెండు పరాజయాలూ బీజేపీని, నరేంద్రమోదీని తాత్కాలికంగా బాగా కుంగదీశాయి.



అస్సాంలో మొదటి విజయం!

కిందటేడాది వేసవిలో బీజేపీకి ఏ మాత్రం విజయావకాశాలు, పునాదిస్థాయి బలంలేని నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించిన బీజేపీ మొదటిసారి 34.4 శాతం ముస్లింలున్న అస్సాంలో జూనియర్‌మిత్రపక్షం ఏజీపీతో కలిపి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అంతేగాక ఆదివాసీ నేతను సీఎం పీఠంపై కూర్చోపెట్టింది.


అతిపెద్ద దాదాపు 25 శాతం ముస్లింలున్న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఓట్లు పది శాతం దాటినా సీట్లు మాత్రం మూడు నుంచి ఆరుకు మాత్రమే పెరిగాయి. అలాగే, ముస్లింలు, క్రైస్తవులు 45 శాతం వరకూ ఉన్న కేరళలో ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు 15  శాతం వరకూ పెరగడం విశేషం. తమిళనాడులో మాత్రం కేవలం 2.86 శాతం ఓట్లే కాషాయపక్షం సాధించింది. అస్సాం విజయంతో ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విస్తరణకు మంచి ఊపు లభించింది.



యూపీలో నాలుగింట మూడొంతుల మెజారిటీ!

ఈ ఏడాది ఫిబ్రవరిమార్చిలో జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2019 పార్లమెంటు ఎన్నికలకు సెమీఫైనల్‌గా వర్ణించిన మీడియా ఉత్తర్‌ప్రదేశ్‌లో మెజారిటీ సాధిస్తేనే ప్రధాని మోదీ పరువు నిలుస్తుందని ముందుగానే ప్రకటించింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, ఇతర హిందీ రాష్ట్రాల నేతల తోడ్పాటుతో మోదీ యూపీలో విస్తృత ఎన్నికల ప్రచారం చేసి అందరినీ దిగ్భాంతి పరిచేలా బీజేపీకి మున్నెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో బ్రహ్మాండమైన ఘనవిజయం సాధించిపెట్టారు.


హిందువులను ఆకట్టుకునే విధంగా మాట్లాడి, అయిదేళ్ల ఎస్పీ పాలనలో హిందువులకు జరిగిన మేలేమీ లేదనే రీతిలో ప్రధాని చేసిన ప్రచారం రాష్ట్ర ప్రజలను బీజేపీ వైపునకు తిప్పింది. మొత్తం 403 సీట్లకు బీజేపీ(312) మిత్రపక్షాలతో కలిసి 325 సీట్లు సంపాదించింది. నాలిగింట మూడొంతుల మెజారిటీ సాధించడంతో ఆ విజయం మోదీ ఖాతాలో పడింది. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో 71 సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ అదే స్థాయిలో అసెంబ్లీ పోరులో విజయం సాధించడంతో అప్పటికి నాలుగు నెలలుగా ప్రజలను ఇబ్బంది పెట్టిందనుకున్న పెద్ద నోట్ల రద్దు గొడవ నుంచి మోదీ విజయవంతంగా బయటపడ్డారు.



రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో బీజేపీకి మరింత బలం!

పదిహేనేళ్ల క్రితం వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్క ఉపరాష్ట్రపతి పదవికి మాత్రమే బీజేపీ నేత భైరవ్‌సింగ్‌షెఖావత్‌ఎన్నికయ్యారు. అన్ని పక్షాల ఏకాభిప్రాయంతో రాజకీయ నేపథ్యం లేని ఏపీజే అబ్ధుల్‌కలాం రాష్ట్రపతి పదవిచేపట్టారు. అప్పటితో పోల్చితే బీజేపీ మెరుగైన స్థితిలో ఉండడం, కాంగ్రెస్‌నానాటికి తీసికట్టు అన్నట్టు బలహీనం కావడంతో రేపు జులై ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థే రాష్ట్రపతి కావచ్చు.ఎన్డీయేతర ప్రాంతీయపక్షాలు కొన్ని బీజేపీకి అనుకూలంగా మారడంతో మోదీ సూచించే నేత సునాయాసంగా రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశముంది.



( మరిన్ని వివరాలకు చదవండి. )

(57 విదేశీ పర్యటనలు)

(ఇండియా ఫస్ట్‌)

(మోదీ ప్రజల ప్రధానే..!)

(కొంచెం మోదం! కొంచెం ఖేదం!!)


(సాక్షి నాలెడ్జ్ సెంటర్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top