ఆ జాబితా ఎవరిచ్చారో చెప్పండి

ఆ జాబితా ఎవరిచ్చారో చెప్పండి


సీబీఐ డెరైక్టర్ ఇంటి గుట్టు వ్యవహారంలో ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీం ఆదేశం



న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా అధికార నివాసానికి వచ్చిన వెళ్లినవారి వివరాలుండే సందర్శకుల జాబితాను, 2జీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ అంతర్గత నోట్స్‌ను అందజేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలని సోమవారం సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ తేదీకల్లా ఆ పేరును సీల్డ్ కవర్‌లో సమర్పించాలని జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. ఈ కేసులోని ఆరోపణలు సీబీఐ డెరైక్టర్ ప్రతిష్టను దెబ్బతీయడంతోపాటు స్కాం దర్యాప్తుపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయని, ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి ఎవరో వెల్లడిస్తే, ఈ ఆరోపణల్లో నిజానిజాలెంతో నిర్ధారించవచ్చని పేర్కొంది.  

 

దాన్నిబట్టి  తదుపరి నిర్ణయం తీసుకుంటామంది. అయితే తనకు వివరాలిచ్చిన వ్యక్తి పేరు బయటపెట్టాలన్న కోర్టు సూచనను ఆయన  వ్యతిరేకించారు. సుప్రీంకోర్టుకు తాను సమర్పించిన సందర్శకుల జాబితా రిజిస్టర్ అసలైనదేనని, కావాలంటే దాని ప్రామాణికతను తెలుసుకునేందుకు ఓ కమిటీని లేదా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించుకోవచ్చని నివేదించారు. ‘‘ఆ రిజిస్టర్ ప్రామాణికతపై ఎలాంటి సందేహం అక్కర్లేదు. అందులోని వివరాలను మార్చడం అసాధ్యం. ఆ రిజిస్టర్‌ను సీబీఐ డెరైక్టర్ నివాసం గేటు వద్ద నిర్వహించిందే అని పూర్తి ఘంటాపథంగా చెప్పగలను’’ అని ప్రశాంత్ స్పష్టంచేశారు. అయినప్పటికీ ఆ వ్యక్తి పేరు సీల్డ్ కవర్‌లో తెలియజేయాలని ధర్మానసం ఆయనకు సూచించింది.

 

కాగా, సుప్రీంకోర్టుకు  భూషణ్ సమర్పించిన తన ఇంటి సందర్శకుల జాబితా రిజిస్టర్ వాస్తవికతపై రంజిత్ సిన్హా అనుమానం వ్యక్తంచేశారు. అందులో పది శాతం వివరాలు సరైనవి అయి ఉండొచ్చని, మిగిలిన 90 శాతం వివరాలను మార్చేశారని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలను ఎవరో నియంత్రిస్తున్నారని, లేకుంటే అసలైన సందర్శకుల జాబితాను ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారని మీడియా ముందుగానే కథనాలు ఎలా ప్రచురించిందని రంజిత్ సిన్హా తరఫు న్యాయవాది వికాస్ సింగ్ సందేహం లేవనెత్తారు. వీటి వెనుక ఓ కార్పొరేట్ సంస్థ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top