సంకటంలో ‘కరుణ’

సంకటంలో ‘కరుణ’


సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం కరుణానిధికి సంకట పరిస్థితులు ఎదురవుతున్నాయి. అధికారం లక్ష్యంగా వ్యూహ రచనల్లో ఉన్న తరుణంలో సతీమణి దయాళు అమ్మాల్, గారాల పట్టి కనిమొళిపై నగదు బదలాయింపు నేరారోపణ నమోదు కావడం ఇరకాటంలో పడేస్తోంది. తన కుటుంబీకులు చిక్కుల్లో పడడంతో, ఎలా ఎదుర్కొవాలోనని మల్లగుల్లాలు పడుతున్నారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపు కుంభకోణం డీఎంకేను పతనం అంచుకు చేర్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతుకు దారి తీసింది. కరుణ గారాల పట్టి కనిమొళి, అనుంగు శిష్యుడు రాజా ఈ వ్యవహారంలో నెలల తరబడి కారాగార వాసం అనుభవించి బెయిల్ మీదకు బయటకు వచ్చారు.

 

 వాయిదాల మీద వాయిదాలతో విచారణ కాలాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 2జీ కేసుకు అనుబంధంగా దాఖలైన మరో కేసు రాజా, కనిమొళితోపాటుగా తన సతీమణి దయాళు అమ్మాల్ మెడకు చుట్టుకోవడం కరుణానిధిని సంకటంలోకి నెడుతున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టడం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాల్లో కరుణానిధి ఉన్నారు. ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన తమ వాళ్ల మీదున్న కేసుల్ని పరిగణనలోకి తీసుకుని అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు శిక్ష పడ్డ నేపథ్యంలో ఎలాంటి వ్యాఖ్యల్ని సంధించ లేదు. తాను ఆనంద పడనూ లేదు, చింతించనూ లేదన్న ఒక్క ముక్కతో తన సమాధానాన్ని ముగించారు. ఈ నేపథ్యంలో అధినేత కుటుంబీకుల మీదున్న కేసుల రూపంలో పార్టీకి ఎక్కడ మళ్లీ గడ్డు పరిస్థితులు నెలకొంటాయోనన్న ఆందోళన డీఎంకే వర్గాల్లో మొదలైంది.

 

 నేరారోపణతో సంకటం: జయలలితకు పడ్డ జైలు శిక్షను అస్త్రంగా చేసుకుని కొన్ని పార్టీలు అన్నాడీఎంకే మీద విమర్శలు గుప్పిస్తున్నాయి. తమ బలాన్ని పెంచుకునేందుకు పదేపదే ఆ శిక్షను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి చొచ్చుకెళ్లే యత్నంలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తన వాళ్లపై నేరారోపణ కేసు నమోదు కావడం కరుణానిధికి సంకటంగా మారింది. 2జీ కేటాయింపులకు ప్రతి ఫలంగా కరుణ కుటుంబానికి చెందిన కలైంజర్ టీవీలోకి రూ. 200 కోట్లు వచ్చినట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ టీవీలో కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్‌కు 60 శాతం, కనిమొళికి 20 శాతం, ఆ టీవీ డెరైక్టర్ ప్రసాద్‌కు మరో 20 శాతం వాటాలు ఉన్నాయి. అయితే, రూ. 200 కోట్ల ఆరోపణల్ని కలైంజర్ టీవీ యాజమాన్యం ఖండించింది. స్వాన్ టెలికాం నుంచి కేవలం అప్పుగా తీసుకుని, తిరిగి చెల్లించడం జరిగిందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని స్వాన్ టెలికాం కూడా ప్రకటించింది. అయితే, రంగంలోకి దిగిన డెరైక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్(డీవీఏసీ) తన విచారణలో గుట్టును బయటకు లాగింది.

 

 చిక్కుల్లో కని, దయాళు అమ్మాల్

 డీవీఏసీ విచారణలో వెలుగు చూసిన అంశాలు సీబీఐ కోర్టులో దాఖలయ్యాయి. కేటాయింపులకు ప్రతి ఫలంగా నగదు పరివర్తన జరిగినట్టు వెలుగు చూసింది. దీంతో నగదు పరివర్తనకు సంబంధించి నేరారోపణ కేసు(మనీలాండరింగ్) దాఖలుకు సీబీఐ కోర్టు న్యాయమూర్తి సైనీ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విచారణ నవంబర్ 11 తేదీ నుంచి సాగనుంది. ఈ విచారణ నిమిత్తం కనిమొళి, రాజా, దయాళు అమ్మాల్ పదే పదే ఢిల్లీకి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారం రోజుల వరకు మనవళ్లు దయానిధి మారన్, కళానిధి మారన్‌కు సంబంధించిన కేసుల వ్యవహారం కరుణను ఉక్కిరి బిక్కిరి చేస్తే, తాజాగా కని, దయాళు అమ్మాల్ మెడకు కొత్త కేసు చుట్టుకోవడం డైలమాలో పడేసినట్టు సమాచారం. తాజా పరిణామాలు ఎక్కడ తమ పార్టీకి గడ్డు పరిస్థితులను సృష్టిస్తాయో, ఇతర పార్టీలు ఎక్కడ వేలు ఎత్తి చూపుతూ విమర్శల వర్షం కురిపిస్తాయోనన్న బెంగ డీఎంకే వర్గాల్లో మొదలైంది. ఈ కేసుల వ్యవహారం ఎక్కడ ఎన్నికల నాటికి ముదురుతుందో, ఆ సమయంలో పార్టీ ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందోనన్న ఆందోళన డీఎంకే వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top