నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాతే

నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాతే - Sakshi


 వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెల్లడి



 సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాతేనని వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టత కోసం ఆయన సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ డాక్టర్ నసీం జైదీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉంది.



ఎప్పటివరకు పెరుగుతాయన్న విషయంలో సందిగ్ధత నెలకొంది.  అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయని, ఇంకో 50 మందిని సర్దుబాటు చేయగలమని చెబుతూ ఇటీవల సీఎం చంద్రబాబు ఇతర పార్టీల నుంచి చాలా మందిని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ద్వారా స్పష్టత తీసుకుందామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిశాం. ఎన్నికల సంఘానికి కేంద్రం నుంచి సూచనలు ఏమైనా వచ్చాయేమోనని కలిశాం. వారు ఇదివరకే అటార్నీ జనరల్ అభిప్రాయం కూడా తీసుకున్నారని అనుకుంటున్నాను.



2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన వీలుపడదని అటార్నీ జనరల్ చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు మాత్రం ఎందుకిలా చెబుతున్నారో తెలియదు. ఇతర పార్టీల నుంచి, వైఎస్సార్‌సీపీ నుంచి కొందరిని తీసుకుందామనే ఉద్దేశం ఆయనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది’’ అని మేకపాటి పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ల ఆందోళన వెనక వైఎస్సార్‌సీపీ ఉందన్న విమర్శలు వస్తున్నాయని మీడియా ప్రస్తావించగా... ‘‘మంచి జరిగితే తమది, లేదంటే వైఎస్సార్‌సీపీదని నిందలు వేయడం పరిపాటిగా మారింది. ముద్రగడ పద్మనాభం సీనియర్ నేత. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది చేయాలని అడిగారు’’ అని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top