పాప ఏడుస్తోందని.. నేలకేసి కొట్టింది!

పాప ఏడుస్తోందని.. నేలకేసి కొట్టింది!

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసేవాళ్లయితే పిల్లలను చూసుకోవడం కష్టం. అందుకోసం వాళ్లను క్రష్‌లలో వదిలిపెడతారు. నవీముంబైలో ఇలాగే ఒక పది నెలల పాపను క్రష్‌లో చేరిస్తే.. పాప ఏడుస్తోందని ఆమెను చితక్కొట్టడమే కాక, ఏకంగా నేలకేసి కొట్టింది. దాంతో ఆ కేర్‌టేకర్‌తో పాటు క్రెష్ యజమానిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. మహారాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే స్పందించారు. మొత్తం డేకేర్ సెంటర్లు, క్రష్‌లు అన్నింటిలోనూ సీసీటీవీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. 
 
నవీముంబైలోని ఖర్ఘర్ ప్రాంతంలో గల పూర్వ ప్లేస్కూల్ అండ్ క్రష్‌లో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజి బయటకు వచ్చింది. దాన్ని పోలీసులతో పాటు చిన్నారి తల్లిదండ్రులు కూడా చూశారు. అఫ్సానా షేక్ అనే కేర్‌టేకర్‌తో పాటు, క్రష్ యజమాని ప్రియాంకా నికమ్ (34)ను అరెస్టు చేశారు. తర్వాత ప్రియాంకను ష్యూరిటీ బెయిల్‌మీద విడుదల చేయగా, అఫ్సానాకు మాత్రం పోలీసు కస్టడీ విధించారు. 
 
రుచితా సిన్హా, రజత్ సిన్హా అనే దంపలతులు తమ పదేళ్ల పాపను ప్రతిరోజూ ఉదయం ఆఫీసులకు వెళ్లేటపుడు ఆ క్రష్‌లో వదిలిపెడతారు. సాయంత్రం తమ పాపను తీసుకొచ్చేటప్పుడు ఆమె నుదురు మీద గాయం ఉండటాన్ని చూశారు. వెంటనే రుచిత దానిపై క్రష్ యజమాని ప్రియాంకను ప్రశ్నించగా, ఆమె నుంచి సరైన సమాధానం రాలేదు. దాంతో వైద్యుడి వద్దకు పాపను తీసుకెళ్తే.. పాపను గట్టిగా కొట్టి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 
 
సీసీటీవీ ఫుటేజి చూసిన తర్వాత పాప తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. కొంతమంది పిల్లలు నిద్రపోతుండగా, సిన్హా దంపతుల పాప ఏడుస్తుండటంతో.. ఆమెను అఫ్సానా షేక్ బాగా కొట్టడం, నేలకేసి బాదడం సీసీటీవీలో కనిపించింది. చిన్నారికి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన చాలా షాకింగ్ అని మంత్రి పంకజా ముండే అన్నారు. దాంతో అన్ని ప్లేస్కూళ్లలోను సీసీటీవీ కెమెరాలు అమర్చడం తప్పనిసరి చేశామని తెలిపారు. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top