పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ

పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ - Sakshi


2014 జనవరికే 7.5 లక్షల ఖాళీలు

మొత్తం కలిపితే 17 లక్షలకు పైగానే..

పదేళ్లలో రైల్వేలోనే 5 లక్షల ఉద్యోగాలు

ప్రస్తుత ఉద్యోగుల్లో మూడో వంతు

50-60 ఏళ్ల వయసు వారే

ఏడో వేతన సంఘం నివేదికలో వెల్లడి


 

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ కానున్నాయ్! ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో మూడో వంతు 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు వారే కావటంతో.. వచ్చే పదేళ్లలో వీరందరూ పదవీ విరమణ పొందనున్నారు. దీంతో వీరి స్థానాలన్నీ ఖాళీ కానున్నాయి. రైల్వే శాఖలో 4,93,609 మంది, రక్షణ శాఖలోని సివిల్ ఉద్యోగుల్లో 1,51,161 మంది పదవీ విరమణ పొందబోతున్నారు. గత పదేళ్లలో (2004-2014 వరకు) ఏటా కేవలం లక్ష ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడంతో.. 2014 జనవరి 1 నాటికే ఏడున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జస్టిస్ ఏకే మాథుర్ నేతృత్వంలోని ఏడో వేతన సంఘం గత వారం కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించిన నివేదికలో ఈ ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

 

 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు జీత భత్యాలు, పింఛను 23.55 శాతం పెంచాలన్న కమిషన్.. ఉద్యోగుల కనీస మూల వేతనం నెలకు రూ. 18 వేలు, గరిష్టంగా రూ. 2.5 లక్షలుగా ఉండాలని నిర్ణయించింది. ఏటా ఇప్పటివరకు రూ. 4.33 లక్షల కోట్లు వేతనాలకు కేంద్రం వెచ్చిస్తుండగా తాజా సిఫారసులతో ఈ మొత్తం రూ. 5.35 లక్షల కోట్లకు చేరుకుంటుంది. దేశంలో 2012-2017 మధ్య కాలంలో ఏటా 90 లక్షల మంది శ్రామికులు పెరుగుతారని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఇంత పెద్దమొత్తంలో ఉద్యోగ కల్పనకు శ్రీకారం చుడితే.. ఉపాధి అవకాశాలు కాస్త మెరుగుపడతాయనేది వాస్తవం.

 

 50 శాతానికి పైగా పెద్ద వయసు వారే!

 50-60 ఏళ్ల మధ్య ఉన్న వారు జౌళి, బొగ్గు, పట్టణాభివృద్ధి, పెట్రోలియం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారీ పరిశ్రమలు, పునరుత్పాదక విద్యుత్తు, ఆయుష్, విద్యుత్తు తదితర శాఖల్లోనే ఎక్కువగా ఉన్నారు. ఈ శాఖల్లో 50% నుంచి 75% వరకు 50-60 వయసు గ్రూపు వారే ఉండడం గమనార్హం. అయితే ఇంతవరకు ప్రభుత్వం ఆయా శాఖల్లో పదవీ విరమణ రేటుతో సమానంగా ఉద్యోగాల భర్తీ చేపట్టలేదు.

 

ఏయే శాఖల్లో ఎంత మంది?

రిటైర్మెంటు ఆధారంగా నియామకాలు అధికంగా జరిగేందుకు ఆస్కారం ఉన్న వాటిని ‘సాక్షి’ విశ్లేషించింది. దీని ప్రకారం కమ్యూనికేషన్లు, ఐటీ శాఖలో 80,933 మంది ఉన్నారు. వీరిలో 79,295 మంది ఉద్యోగులు పోస్టల్ శాఖకు చెందిన వారే. అలాగే రక్షణ శాఖలోని సివిల్ ఉద్యోగుల్లో 1,51,161 మంది, ఆర్థిక శాఖలో 33,307 మంది, ఆరోగ్య శాఖలో 7,296 మంది, హోం శాఖలో 67,933 మంది, గనుల శాఖలో 4,223 మంది ఉన్నారు. పట్టణాభివృద్ధి శాఖలో 18,962 మంది ఉన్నారు. రైల్వేల్లో మొత్తంగా 13.16 లక్షల మంది ఉద్యోగులు ఉండగా వీరిలో 4,93,609 మంది పదేళ్లలో పదవీ విరమణ పొందుతున్నారు.

 

 ఎందుకు తగ్గిపోతున్నారు?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గటం, పదవీ విరమణ పొందనున్న వారి సంఖ్య పెరగటానికి 2001లో కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ (డీవోపీటీ) సూచించిన ఆంక్షలే కారణం. 2001 మార్చి 2009 వరకు అమల్లో ఉన్న ఆంక్షల ప్రకారం.. మొత్తం ఉద్యోగాల్లో కొత్త నియామకాలు ఒక శాతానికి మించరాదు. అలాగే పదవీ విరమణ పొందే వారి సంఖ్యలో 3 శాతం మాత్రమే నియమకాలుండాలి. ఏటా 2 శాతం ఉద్యోగులను తగ్గించడమే దీని ఉద్దేశం. ఐదేళ్లలో 10 శాతం ఉద్యోగులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ ఆంక్షలు విధించారు. అయితే ఇది సరికాదని.. ఆరో వేతన సంఘం 2009లో హెచ్చరించింది.

 

ఇలాంటి నిర్ణయాల వల్ల కార్యనిర్వహణ వేగం తగ్గుతుందని స్పష్టం చేసింది. పెద్ద వయసులో ఉన్నవారు సాంకేతికతను త్వరగా అందిపుచ్చుకోలేరని.. అందువల్ల ప్రభుత్వ సేవలు వేగంగా, సమర్థవంతంగా చేరాలంటే కొత్త రక్తం అవసరమని తేల్చిచెప్పింది. అంతిమంగా నియామకాలపై ఆంక్షలను సడలించాలని సూచించింది. దీంతో డీవోపీటీ ఆంక్షలను కేంద్రం 2009లోనే ఆపేసింది. 2006 నుంచి 2010 మధ్య 2,86,939 ఉద్యోగాలు మాత్రమే భర్తీకాగా, 2010-2014లో 5,70,825 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఈ వివరాలన్నింటినీ ఏడో వేతన సంఘం విశ్లేషించింది. అంతేకాకుండా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను తీసుకోవడం పెరిగిపోతోందని, దీని వల్ల జవాబుదారీతనం తగ్గే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

 

 మరికొన్ని విశేషాలు

 - మొత్తంగా 40,48,707 మంజూరైన పోస్టులు ఉండగా.. వీటిలో 33,01,536 మంది ఉద్యోగులు ఉన్నారు. 7,47,171 ఖాళీలు ఉన్నాయి. ఇది 18 శాతానికి సమానం.

 - ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో కేవలం 3 శాతం మాత్రమే గ్రూపు ఏ ఉద్యోగాలు ఉండగా.. 9 శాతం గ్రూపు-బీ, 88 శాతం గ్రూపు-సీ ఉద్యోగులున్నారు.

 - ఏటా వేతన బడ్జెట్ పెరుగుతున్నప్పటికీ.. జీడీపీలో దాని శాతంలో మార్పేమీ ఉండడకపోవడం గమనార్హం. వేతన బడ్జెట్ 2010-11 నుంచి జీడీపీలో 1.8 నుంచి 2 శాతం, పెన్షన్లలో 0.9 నుంచి 1 శాతం ఉంటోంది.

 

 01.01.2014 నాటికి

 --------------

 మొత్తం సిబ్బందిః 33.02 లక్షలు

 ఏ వయస్సు గ్రూపులో ఎంత శాతంః

 20- 30 ఏళ్లలోపుః 22 శాతం

 30-40 ఏళ్లలోపుః 22 శాతం

 40-50 ఏళ్లలోపుః 26 శాతం

 50- 60 ఏళ్లలోపుః 29 శాతం

 

 50-60 మధ్య వయస్సు గల వారు ఏ శాఖలో ఎంత

 ---------------------------

 (ఉద్యోగుల సంఖ్య లక్షల్లో)

 --------------------------------------------------------

 శాఖ     ఉద్యోగులు        50-60 వయస్కులు    మొత్తం ఉద్యోగుల్లో వీరి శాతం

 --------------------------------------------------------

 రైల్వేలు            13.16        4.94                38

 హోం శాఖ            9.80            0.68                7

 రక్షణ(సివిల్)        3.98            1.51                38

 పోస్టల్            1.90            0.79                42

 రెవెన్యూ            0.96            0.33                34

 ఐఏఅండ్ ఏడీ        0.48            0.16                33

 పట్టణాభివృద్ధి        0.31            0.19                62

 ఆటమిక్ ఎనర్జీ        0.32            0.11                34

 ఆరోగ్యం            0.21            0.07                33

 ఇతరులు            1.86            0.70                38

 మొత్తం            32.98        9.48            29

 --------------------------------------

 

 ---------------------------------

 ఇప్పటికే ఉన్న ఖాళీలు

 (01.01.2014 నాటికి గల గణాంకాలు)




 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top