ఎప్పటికైనా జానపదమో... పౌరాణికమో తీస్తాను!

ఎప్పటికైనా జానపదమో... పౌరాణికమో తీస్తాను!


మదర్, ఫాదర్ ఫేమస్ డాక్టర్లు. చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్.పేరెంట్స్ ప్రేరణతో ఇట్టే డాక్టరైపోవచ్చు. కానీ, నాగ్ అశ్విన్‌రైటర్ వాలనుకున్నాడు... డెరైక్టర్ కావాలనుకున్నాడు. చిన్నప్పట్నుంచీ ఇదే తపన. ఇదే కసి. కట్ చేస్తే -  ఇప్పుడతనో సెలబ్రిటీ. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. నాగ్ అశ్విన్‌తో ‘సాక్షి’ స్పెషల్ టాక్.




 

 తొలి ప్రయత్నంలోనే ఇంత పేరు, ఆదరణ. ఎలా ఉంది ఈ అనుభూతి?

 స్కూలు రోజుల నుంచీ సినిమాలే నా లక్ష్యం. ఈ స్థాయికి రావడం కోసం అనేక మజిలీలు. అవన్నీ తలచుకుంటుంటే గమ్మత్తుగా అనిపిస్తోంది.

 

 మీ తల్లితండ్రులిద్దరూ పేరొందిన వైద్యులు. సినిమా రంగానికి వెళ్తానంటే వాళ్లు ఒప్పుకున్నారా?

 నాన్నగారు జయరామిరెడ్డి యూరాలజిస్ట్. అమ్మ జయంతీ రెడ్డి గైనకాలజిస్ట్. మా జె.జె. హాస్పటల్ హైదరాబాద్‌లోనే ఫేమస్. వాళ్ల వారసత్వాన్ని నిలబెడతానని వారు అనుకునే ఉంటారు. అందుకే నేనీ మార్గంలో వెళ్తానన్నప్పుడు కొంచెం నిరుత్సాహపడ్డారు. తర్వాత నా తపన చూసి ప్రోత్సహించారు. వాళ్ల అండదండలే లేకపోతే నేను మణిపాల్‌లో మాస్ కమ్యూనికేషన్ కోర్సు చేసేవాణ్ణి కాదు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డెరైక్షన్ కోర్సు చేసేవాణ్ణి కాదు. ‘ప్రాణ ఫిలిమ్స్’ పేరుతో యాడ్ కంపెనీ పెట్టేవాణ్ణీ కాదు.

 

 శేఖర్ కమ్ముల దగ్గర శిష్యరికం చేసినట్టున్నారు?

 అవును. ‘లీడర్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశా. ఆర్టిస్టుల ఎంపిక, ప్రచార వ్యవహారాలు ఎక్కువ చూసేవాణ్ణి. నాకు తెలిసి ఆయనంత పర్‌ఫెక్ట్‌గా ఎవ్వరూ స్క్రిప్టు చేయలేరేమో. ఆయన దగ్గర పనిచేయడం నాకెంతో మంచిదైంది.

 

 ఇంతకీ ‘ఎవడే సుబ్రమణ్యం’ డెరైక్ట్ చేసే అవకాశం ఎలా వచ్చింది?

 శేఖర్ కమ్ముల గారి దగ్గర నుంచీ వచ్చేశాక, ఇద్దరు స్నేహితులతో కలిసి ‘ప్రాణ ఫిలిమ్స్’ అనే సంస్థ మొదలుపెట్టి యాడ్ ఫిల్మ్స్, సినిమాటిక్ వెడ్డింగ్ ఫిల్మ్స్ చాలా చేశాం. ఆ సమయంలోనే నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంకా దత్‌లు పరిచయమయ్యారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఓ షార్ట్ ఫిల్మ్ చేయమని అడిగారు. రెండ్రోజులు మాత్రమే టైమ్ ఉంది. కాన్సెప్ట్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, అప్‌లోడింగ్... ఇవన్నీ రెండు రోజుల్లోనే పూర్తి చేశాం. ‘యాదోంకి బారాత్’ పేరుతో చేసిన ఆ లఘు చిత్రం కాన్‌‌స ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైంది. దాంతో ప్రియాంక, స్వప్నలకు నా మీద నమ్మకం వచ్చింది. సినిమా చేసే అవకాశం ఇచ్చారు. మొదట వేరే కథ అనుకుని దాని మీద చర్చలు చేస్తున్నాం. మరోపక్క నాకు ఓ ఐడియా వచ్చి 5డి కెమెరాతో ఓ చిన్న సినిమా చేద్దామని ప్రయత్నాలు మొదలుపెట్టా. ఆ ఐడియా గురించి ప్రియాంక వాళ్లకు చెబితే చాలా ఎగ్జయిటయ్యారు. అది మనమే చేద్దామన్నారు. అదే ‘ఎవడే సుబ్రమణ్యం’. హీరో నానికి కథ నచ్చడంతో వెంటనే మొదలైంది.

 

 ఈ కథకు ప్రేరణ ఏమిటి?

 ‘నీవెవరో నీవు తెలుసుకో’ అనే ఆలోచనలో నుంచి ఈ కథ పుట్టింది. ఎక్కడా సినిమాటిక్ ఆలోచనలు లేకుండా నిజాయతీగా ఈ కథ చేసుకున్నా. చుట్టూ ఉండే సమాజం, చదివిన పుస్తకాలు... ఇవన్నీ కలగలిసి ఈ కథను పరిపుష్టం చేశాయి. మా స్కూల్లో సుబ్రమణ్యం అనే సీనియర్ ఉన్నాడు. ఫొటోగ్రాఫర్‌గా స్థిరపడ్డాడు. ఫేస్‌బుక్‌లో రోజూ జీవితం గురించి మంచి కామెంట్లు పెడుతుంటాడు. అవన్నీ చాలా బాగుంటాయి. అందుకే నా సినిమాలో హీరో పేరు సుబ్రమణ్యం అని పెట్టా. తొలుత ఈ సినిమాకు ‘హూ యామ్ ఐ’ అనే పెడదామనుకున్నాం. తర్వాత ‘హూ ఈజ్ సుబ్రమణ్యం’ అనుకుని ఫైనల్‌గా ‘ఎవడే సుబ్రమణ్యం’ అని పెట్టాం.

 

 కృష్ణంరాజు, షావుకారు జానకి, ప్రతాప్ పోతన్ లాంటి సీనియర్ తారలను ఎంచుకోవాలని ఎందుకనిపించింది?

 నేను స్క్రిప్టు దశలో రామయ్య పాత్ర అనుకున్నపుడే కృష్ణంరాజుగారిని ఊహించుకున్నా. నాకెందుకో ఆయనను అలా చూడాలనిపించింది. నేను పాత సినిమాలు బాగా చూస్తా. అలా నాకు ‘షావుకారు’ జానకి గారంటే బాగా ఇష్టం. ఆవిడైతే ఇందులో పాత్రకు బావుంటారనిపించింది. ఇక ప్రతాప్ పోతన్ పోషించిన పాత్రకు నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని అనుకున్నా. ఇవి చిన్న చిన్న పాత్రల్లా అనిపిస్తాయి కానీ, సినిమాకు అవే హార్ట్ అండ్ సోల్. వాళ్లు చేశారు కాబట్టే, సినిమాకు అంత డెప్త్ వచ్చింది.

 

 దూద్‌కాశీ నేపథ్యంలో ఈ సినిమా చేయాలని ఎందుకనిపించింది?

 మొదట వేరే లొకేషన్ ఏదో అనుకున్నాం. కాశీలో ఆఖరి మజిలీ పూర్తి చేసుకోవాలని చాలామంది అనుకుంటుంటారు. అలాంటి లొకేషన్ గురించి ఆలోచిస్తుంటే దూద్ కాశీ గుర్తొచ్చింది. ఇప్పుడు నన్ను కలిసిన వాళ్లంతా దూద్ కాశీకి ఎలా వెళ్లాలని అడుగుతున్నారు.

 

 ఇందులో ఒక పాటను ఇళయరాజాతో చేయించాలని ఎందుకనిపించింది?

 నాజర్ డెరైక్ట్ చేసిన తమిళ చిత్రం ‘అవతారం’లోని పాటంటే ప్రియాంకకు చాలా ఇష్టం. ఈ సినిమాలో ఓ సందర్భానికి ఆ పాట కరెక్ట్ అనిపించింది. ఇళయరాజా గారికి ట్రయిలర్, కొంత ఫుటేజ్ పంపితే, ఆయనకు నచ్చి ఆ తమిళ పాటనే తెలుగులో ‘చల్లగాలి’ పాటగా చేసి ఇచ్చారు.

 

 మీ రెండో సినిమా ఎప్పుడు?

 ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచిస్తున్నా. ‘ఎవడే సుబ్రమణ్యం’ తరహాలో నిజాయతీగా ఓ కథ చేసుకోవాలి. చాలామంది సినిమా చేయమని అడుగుతున్నారు కానీ, నాకేమో హడావిడిగా కథ చేసేయాలని లేదు. ఏదో ఇన్‌స్టెంట్ ఫుడ్‌లా కాక, లైబ్రరీలో నిలిచిపోయే సినిమాలు చేయాలని ఉంది.

 

 మీ అభిమాన దర్శకుడు?

 కేవీ రెడ్డి గారు. ఆయన లేకపోతే తెలుగు సినిమానే లేదు. ‘పాతాళభైరవి, మాయాబజార్, జగదేకవీరుని కథ’ లాంటి క్లాసిక్స్ తీసిన మహానుభావుడాయన. మరో వందేళ్ల తర్వాతా ఆయన గుర్తుంటారు. ఆయన ప్రేరణతో ఎప్పటికైనా మంచి జానపదమో, పౌరాణికమో తీస్తాను.

 

 ‘‘అశ్విన్ మా లాగా డాక్టర్ కావాలని కోరుకున్నాం. కానీ వాడేమో జర్నలిజం, యాడ్‌ఫిల్మ్స్, సినిమాలూ అంటూ తిరుగుతుంటే కొంచెం బెంగపడ్డాం. మణిపాల్‌లో మాస్ కమ్యూనికేషన్ చదువుతున్నప్పుడు వాడికి భవిష్యత్తు మీద ఓ స్పష్టత వచ్చేసినట్టుంది. దాంతో మేం కూడా సంతోషపడ్డాం. మంచి సినిమా తీస్తాడనుకున్నాం కానీ, ఇంత పేరు ప్రఖ్యాతు లొచ్చే సినిమా తీస్తాడని అనుకోలేదు. అశ్విన్‌ని చూసి మేం గర్వపడుతున్నాం. ఇందులో నాతో టీచర్ వేషం కూడా వేయించాడు.’’

 - జయంతీ రెడ్డి,  ప్రసిద్ధ గైనకాలజిస్ట్

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top