‘చింతచెట్టు’తో భయపెడతా!

‘చింతచెట్టు’తో భయపెడతా!


శతాధిక చిత్రాల దర్శకుడు     కోడి రామకృష్ణ తనని తాను నిత్య విద్యార్థిలాగానే భావిస్తారు. 32ఏళ్లుగా అదే పరిశ్రమ.. అదే అంకితభావం... అదే క్రమశిక్షణ. ఏ తరహా సినిమానైనా అవలీలగా తెరకెక్కించే ఈ సీనియర్ సృజనాత్మక దర్శకుడి తాజా ప్రయత్నం ‘అవతారం’ రేపు విడుదల కానుంది. ఈ సినిమా గురించి, తన భవిష్యత్ ప్రణాళికల గురించి     కోడి రామకృష్ణ ఈ విధంగా చెప్పారు.

 

 కేరళలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా  ‘అవతారం’ సినిమా చేశాం. పాలు అమ్ముకునే అమ్మాయి, 120 ఏళ్ల వృద్ధురాలు, దేవత.. ప్రధానంగా వీరి చుట్టూ తిరిగే కథ ఇది.  గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే సినిమా ఇది. కానీ, ఏ సన్నివేశంలో గ్రాఫిక్స్ ఉండాలో అక్కడే ఉంటాయి. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నేననుకున్న విధంగా ‘అవతారం’ని తెరకెక్కించాను. ఇది చాలా మంచి సినిమా. ఇప్పటివరకూ నేను చాలా సినిమాలు చేశాను. కానీ, అన్ని సినిమాలకూ ఇలా చెప్పలేదు. ముఖ్యంగా ఈ సినిమాకి చెప్పడానికి కారణం కథాబలం. రాధిక కుమారస్వామి, రిషి నా కథకు న్యాయం చేశారు. ఇక, భానుప్రియ అభినయం ఓ ప్రత్యేక ఆకర్షణ. ఖర్చుకు వెనకాడకుండా నిర్మాత యుగంధర్ రెడ్డి ఈ సినిమా నిర్మించారు. అవుట్‌పుట్ పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారు.

 

 మొదట నుంచీ కూడా నిర్మాతను నా పక్కన పెట్టుకుని సినిమా చేయడం నా అలవాటు. ఒకవేళ నిర్మాత అందుబాటులో లేకపోతే, ఆయనను సంప్రదించిన తర్వాతే సీన్స్ తీస్తా. ఎందుకంటే, ఏ సినిమాకైనా నిర్మాతే ప్రాణం అని నమ్ముతాను. ప్రస్తుతం ‘పుట్టపర్తి సత్యసాయిబాబా’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సినిమా నలభై శాతం పూర్తయ్యింది. అలాగే అర్జున్, లక్ష్మీరాయ్ కాంబినేషన్‌లో ‘రాణీ రాణమ్మ’ చేస్తున్నా. ‘అంకుల్ ఆంజనేయస్వామి’ అనే చిత్రం చేయనున్నాను. ఇందులో ఆంజనేయుడిగా నటించడానికి రాజేంద్రప్రసాద్ సుముఖంగా ఉన్నారు. నా ‘దేవుళ్లు’ సినిమాలో ఆయన ఆంజనేయుడిగా చేశారు. రాజేంద్రప్రసాద్, నా కాంబినేషన్‌లో ఐదు సినిమాలు వచ్చాయి. అవన్నీ వంద రోజుల సినిమాలే కావడం విశేషం.

 

  మా ఊళ్లో నా కళ్ల ముందు జరిగిన సంఘటనలతో ‘చింత చెట్టు’ టైటిల్‌తో ఓ సినిమా చేయాలనుకుం టున్నా. ఇది థ్రిల్లర్ మూవీ. ఈ కథలో విశేషం. ఏంటంటే... మా ఊరు పాలకొల్లులో ఒక చింత చెట్టు ఉండేది.  ఆ చెట్టు దగ్గర ప్రతిరోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటలు వరకూ గోలీలు ఆడేవాళ్లు. ఏదో కాలక్షేపం కోసం కాదు... ఆ రోజుల్లోనే లక్షల్లో పందెం కట్టి ఆడేవాళ్లు. అయితే ఆరు తర్వాత ఆ చెట్టు దగ్గరకు ఎవరూ వెళ్లేవాళ్లు కాదు. ఒకవేళ ఎవరైనా వెళితే, ఒక షరతు మీద వెళ్లేవాళ్లం. అక్కడికెళ్లిన ప్రతిసారీ ఎవరో పిలిచినట్లు ఉంటుంది. కానీ, వెనక్కి తిరిగి చూడకూడదు. అదే షరతు. దెయ్యం ఉంటుందని భయం. ఆ సంఘటనల సమాహారంతో ఈ ‘చింత చెట్టు’ సినిమా చేయబోతున్నా.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top