ఎంగవీట్టి పిళ్లైకి విజయ్ ఆమోదం

ఎంగవీట్టి పిళ్లైకి విజయ్ ఆమోదం


 ఎంగవీట్టి పిళ్లై టైటిల్‌కు ఇళయదళపతి ఆమోద ముద్ర వేసినట్లు తాజా సమాచారం. విజయ్ 60వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఆ భారీ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ పతాకంపై స్వర్గీయ బి.నాగిరెడ్డి ఆశీస్సులతో బి.వెంకటరామిరెడ్డి సమర్పణలో భారతీరెడ్డి నిర్మిస్తున్నారు. కాగా ఇంతకు ముందు విజయ్ హీరోగా అళగీయ తమిళ్‌మగన్ చిత్రాన్ని తెరకెక్కించిన భరతన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అందాలతార కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్నారు.

 

  టాలీవుడ్ స్టార్ నటుడు జగపతిబాబు ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సతీష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో విజయ్ తొలిసారిగా పూర్తి గ్రామీణ యువకుడిగా నటించడం విశేషం. ఇది కుటుంబం, ఆస్తుల వివాదాల ఇతివృత్తంగా రూపొందుతున్న కథా చిత్రం అని సమాచారం. అమాయకుడైన విజయ్‌ను ఆస్తి కోసం బాధలు పెట్టే కుటుంబ సభ్యులను నగరం నుంచి వచ్చిన మరో విజయ్ ముప్ప తిప్పలు పెట్టి వారి ఆటలు కట్టించారన్నదే చిత్ర కథ అని కోడంబాక్కమ్ వర్గాల సమాచారం.

 

 ఇది చదువుతుంటే ఎమ్జీఆర్ నటించిన ఆనాటి మధురం ఎంగవీట్టి పిళ్లై చిత్రం గుర్తుకు వస్తుంది కదూ’ఆ చిత్రాన్నే ఈ తరానికి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేసి నిర్మిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. కాగా ఈ చిత్రానికి ఎమ్జీఆర్ చిత్ర టైటిల్ ఎంగవీట్టి పిళ్లైనే విజయ్ చిత్రానికి పెట్టాలని నిర్మాతలు భావించినట్లు, అయితే ఈ విషయమై ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయని విజయ్ తాజాగా అదే టైటిల్‌కు ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో జరుపుకుంటోంది. త్వరలోనే చిత్ర టీజర్‌ను విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం.

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top