మీ డెరైక్షన్‌లో సినిమా తీస్తానంటే..బాపుగారు జోక్ చేస్తున్నా అనుకున్నారు!

మీ డెరైక్షన్‌లో సినిమా తీస్తానంటే..బాపుగారు జోక్ చేస్తున్నా అనుకున్నారు! - Sakshi


ఆ హోటల్‌కి లంచ్‌కెళ్లా.

బఫే దగ్గర బాపు గారు కనబడ్డారు.

‘‘నమస్కారం సార్’’ అని పలకరించా.

ఆయన కూడా నాకు నమస్కారం చెప్పారు.

నేనెవరో ఆయనకు తెలీదు. ఎవరో అభిమాని అనుకున్నారు.

‘‘నేను మీ అభిమానినండీ’’అని చెప్పగానే, ‘‘చాలా థ్యాంక్సండీ’’ అన్నారాయన.



ప్లేట్‌లో ఫుడ్ ఐటెమ్స్ వడ్డించుకున్నాక ‘‘నేను ఆ మూల కూర్చుని తింటానండీ’’ అని చెప్పారు బాపు.

దానర్థమేంటో నాకు తెలుసు.నేను నవ్వుతూ ‘‘అలాగే సార్... మీ దగ్గరకు నేనే కాదు, ఇంకెవర్నీ రానివ్వను’’ అన్నాను. అన్నట్టుగానే ఆయన భోజనం చేసినంతసేపు ఎవరూ వెళ్లకుండా కాపలా కాశాను.బాపు గారితో నా ఫస్ట్ మీటింగ్ (?) అది.



తనికెళ్ల భరణి గారికో ఉత్తరమొచ్చింది.

రాసింది బాపుగారు.

‘‘ఒక మంచి సినిమా చూశాను. ‘అమ్మా - నాన్న - ఓ తమిళమ్మాయి’... నువ్వు కూడా చూడు. ఇది నిజం.

ఇట్లు

బాపు’’

ఈ విషయం భరణిగారు నాతో చెబితే ఎంత పొంగిపోయానో!



‘‘అమ్మా - నాన్న - ఓ తమిళమ్మాయి రిలీజైన కొన్ని రోజుల తర్వాత - నేను, రవితేజ ఓ అడ్రస్ వెతుక్కుని మరీ వెళ్లాం. అక్కడ బాపుగారు ఉన్నారు. నా పేరు చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయి ‘‘మీరు పెద్ద డెరైక్టర్ కదా... నా దగ్గర కొచ్చారేంటి?’’ అన్నారు. ‘‘సార్... రవితేజ హీరోగా మీ డెరైక్షన్‌లో ఓ సినిమా ప్రొడ్యూస్ చెయ్యాలనుకుంటున్నా’’ అని చెప్పగానే, ఆయన జోక్ అనుకున్నారు.



‘‘ఒరేయ్ రమణా... వీళ్లు నాతో సినిమా తీస్తారట’’ అని గట్టిగా అంటే, లోపల నుంచి రమణగారొచ్చారు.

‘‘మీరు బానే ఉన్నారుగా... ఎందుకండీ ఈ పిచ్చిపని. మా టైమ్ అయిపోయింది. మా సినిమాలు ఇప్పుడెవరూ చూడరు’’ అన్నారు రమణగారు.దానికి బాపుగారు వంత పాడారు - ‘‘మా దగ్గర కథల్లేవు. మీరే కథ ఇవ్వండి’’ అన్నారు బాపుగారు ఛలోక్తిగా. అక్కడ మేం ఉన్నంతసేపు మమ్మల్ని ఎంత నవ్వించారో. తమ మీద తాము అలా జోకులేసుకోవడానికి ఎంత ధైర్యం కావాలి. అంత నిజాయితీ మేం ఇంకెక్కడా చూడలేదు కూడా.ఇది బాపుగారితో నా సెకండ్ మీటింగ్. లాస్ట్ మీటింగ్ కూడా!



బాపుగారికి నేను వీరాభిమానిని. ఆయన చిత్రాలన్నా, సినిమాలన్నా ప్రాణం నాకు.

ఈ ప్రపంచంలో గొప్పగొప్ప ఆర్టిస్టులుండొచ్చు.

నవ్వునీ,ఏడుపునీ అద్భుతంగా ఆవిష్కరించొచ్చు.కానీ, ఆయనలా సిగ్గునీ, బిడియాన్నీ, మొహమాటాన్నీ, ఇబ్బందినీ బొమ్మలతో చూపించగలగడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఆయనలా బొమ్మలేయడం... ఆయనలా సినిమాలు తీయడం ఎవరితరమూ కాదు! ఇంకెన్ని తరాలు గడిచినా అంతే!



నేను పాతిక సినిమాలు తీసుంటే - అందులో సగం టైటిల్స్ బాపుగారి లెటరింగ్‌తోనే ఉంటాయ్. చూశారా.... ఆయన తెలీకుండానే నాపై ఎంత ముద్ర వేసేశారో!తెలుగువాళ్లు ఎవరైనా డెరైక్ట్‌గానో, ఇన్‌డెరైక్ట్‌గానో ఆయనను అనుకరించాల్సిందే! అనుసరించాల్సిందే!

అందుకే బాపుగారు చిరంజీవి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top