ముగ్గురిలోనూ అదే అంకితభావం : దర్శకుడు శ్రీను వైట్ల

ముగ్గురిలోనూ అదే అంకితభావం : దర్శకుడు శ్రీను వైట్ల


‘‘చిరంజీవిగారు, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్‌... ముగ్గురితోనూ పనిచేశా. ముగ్గురిలోనూ నటన పట్ల ఒకే విధమైన అంకితభావం ఉంది. ఈ సినిమాకు వస్తే... ఇది ముక్కోణపు ప్రేమకథ. ‘మిస్టర్‌’ అంటే ‘మంచోడు, మంచి మనసున్న వ్యక్తి’ అని మీనింగ్‌. అతడి మంచితనాన్ని తెరపైనే చూడాలి’’ అన్నారు దర్శకుడు శ్రీను వైట్ల. వరుణ్‌తేజ్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌’ మధు నిర్మిస్తున్న సినిమా ‘మిస్టర్‌’. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌ హీరోయిన్లు. బుధవారం ట్రైలర్‌ విడుదల చేశారు.



 ఈ నెల 29న పాటల్ని, ఏప్రిల్‌ 14న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు శ్రీను వైట్ల తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘మా నిర్మాతలు బుజ్జి, మధు గార్లు స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి మంచి సినిమా చేయగలిగా. వరుణ్‌తేజ్‌ ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్‌ అవుతాడు. అంత చక్కగా నటించాడు. మిక్కి జె. మేయర్‌ మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు. నా మార్క్‌ ఎక్కడా మిస్‌ కాదు. ఎమ్మెస్‌ నారాయణ గారంటే నాకెంతో అభిమానం. ఆయన లేని లోటును ప్రస్తుత కమెడియన్స్‌తో భర్తీ చేశా. ఇప్పటివరకూ నేను పనిచేయని కమెడియన్స్‌తో ఈ సినిమా చేశా.



గోపీమోహన్‌తో 14 ఏళ్ల ప్రయాణం నాది. ఆయన మంచి కథ ఇచ్చారు. శ్రీధర్‌ సీపాన అద్భుతమైన డైలాగులు రాశాడు’’ అన్నారు. వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ – ‘‘నా మొదటి సినిమా ‘ముకుంద’ నుంచి మా నిర్మాతలు బుజ్జి, మధుగార్లు నాకు మద్దతుగా నిలుస్తున్నారు. నా లుక్, డ్రెస్సింగ్, క్యారెక్టర్‌ పరంగా శ్రీను వైట్లగారు ఎంతో జాగ్రత్త తీసుకున్నారు.



 క్లైమాక్స్‌ బాగా నచ్చడంతో కథ వినగానే అంగీకరించా’’ అన్నారు. ‘‘ప్రతి కథానాయిక శ్రీను వైట్లగారి దర్శకత్వంలో పని చేయాలని కోరుకుంటుంది. ఈ సినిమాతో నా కోరిక తీరింది. వరుణ్‌తేజ్‌ మంచి కోస్టార్‌. బుజ్జి, మధులు స్వీట్‌ ప్రొడ్యూసర్స్‌’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. హెబ్బా పటేల్, రచయితలు గోపీ మోహన్, శ్రీధర్‌ సీపాన, నిర్మాత హరి తదితరులు పాల్గొన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top