నేను మంచోణ్ని కాను!

నేను మంచోణ్ని కాను!


ఖచ్చితంగా నేను అంత మంచి వాడిని కాననిపించింది అని అన్నారు నటుడు జయంరవి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యువ నటుడు తాజాగా నటిస్తున్న చిత్రం వనమగన్‌. థింక్‌ బిగ్‌ స్డూడియోస్‌ పతాకంపై నిర్మాత ఏఎల్‌.అళగప్పన్‌ నిర్మిస్తున్న చిత్రం వనమగన్‌. విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఇందులో జయంరవి కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా బాలీవుడ్‌ బ్యూటీ సాయేషాసైగల్‌ కథా నాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తిరు ఛాయాగ్రహణం, హారీస్‌జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమాన్ని శనివారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినిమాహాల్‌లో నిర్వహించారు.



దర్శకుడు బాలా, లైకా ప్రొడక్షన్స్‌ రాజా మహాలింగం, నిర్మా త ఐసరి గణేశ్‌ చిత్ర ఆడియోను ఆవిష్కరించగా ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గీతరచయిత నా. ముత్తుకుమార్‌ కుమారుడు ఆదవన్‌ తొలి సీడీని అందుకున్నారు. ప్రకృతికి ప్రాధాన్యతనిచ్చి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వరల్డ్‌ ఎర్త్‌డే రోజున జరగడం విశేషం. అదే విధంగా జాతీయ అవార్డును గెలుచుకున్న ఛాయాగ్రాహకుడు తిరును ఈ వేదికపై సత్కరించడం మరో విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌ మాట్లాడుతూ జయంరవి లేకపోతే ఈ వనమగన్‌ చిత్రం లేదన్నారు.



 అదే విధంగా మదరాసుపట్టణం చిత్రానికే హారీస్‌జయరాజ్‌ సంగీతం కోసం ప్రయత్నించానని, ఏడేళ్ల తరువాత ఈ చిత్రానికి ఆ ప్రయత్నం ఫలించిందని చెప్పారు. సాయేషా అంకితభావం కలిగిన నటి అని ప్రశంసించారు. సాయేషా మట్లాడుతూ వనమగన్‌ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుదేవా నృత్యదర్శకత్వంలో ఒక పాటకు డాన్స్‌ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. చిత్ర హీరో జయం రవి మాట్లాడుతూ తాను చాలా మంచి వాడినని అనుకునేవాడినని, దర్శకుడు విజయ్‌ని చూసిన తరువాత ఖచ్చితంగా తాను అంత మంచి వాడిని కాదనే భావన కలిగిందని అన్నారు.



తాను వనబిడ్డను అయితే విజయ్‌ దైవబిడ్డ అని పేర్కొన్నారు. నటి సాయేషా చాలా బాగా నటించారన్నారు. సాయేషాను ఇప్పుడే బుక్‌ చేసుకోండి. తరువాత ఆమె కాల్‌షీట్స్‌ దొరకడం కష్టం అని అన్నారు. వనమగన్‌ చిత్రంలో తాను చాలా టఫ్‌ పాత్రను పోషించానని, తాను చేసే పనిలో బోర్‌ కొట్టకూడదనే వైవిధ్యభరిత పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నానని అందుకు సపోర్ట్‌గా నిలుస్తున్న దర్శకులకు, తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top