పరాటా కంటే వేగంగా.. మెక్సీకో కన్నా క్రూరంగా

పరాటా కంటే వేగంగా.. మెక్సీకో కన్నా క్రూరంగా - Sakshi


టైటిల్: ఉడ్తా పంజాబ్

జానర్: క్రైమ్ థ్రిల్లర్

డైరెక్టర్: అభిషేక్ చౌబే

ప్రొడ్యూసర్: శోభా కపూర్, ఏక్తా కపూర్, అనురాగ్ కాశ్యప్

డైలాగ్స్: సందీప్ శర్మ

స్క్రీన్ ప్లే: సందీప్ శర్మ, అభిషేక్ చౌబే

నటీనటులు: షాహిద్ కపూర్, ఆలియా భట్, కరీనా కపూర్, దల్జీత్ దోసాంగ్ తదితరులు

సంగీతం: అమిత్ త్రివేది

బ్యాక్ గ్రౌండ్ స్కోర్: బెనెడిక్ట్ టేలర్, నరేన్ చంద్రవర్కార్

సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి

నిడివి: 2గంటల 19 నిమిషాలు

విడుదల: జూన్ 17, 2016


ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలనుకున్న గ్రీకు వీరుడి నుంచి అరబ్బులు, టర్క్‌లు, ఇరానియన్లు, ఆఫ్ఘన్లు, మొఘలుల వరకు భారత్ లోకి ప్రవేశించాలంటే మొదట పంజాబ్ ను దాటి రావాలి. కానీ అదే అసలుసిసలు సమస్య. ఇండియాకు సంబంధించి మొదటి యుద్ధభూమిగా పేరుగాంచిన పంజాబ్.. పోరాట పటిమకు మరో పేరు. అందుకే యుద్ధరంగంలో ఆరితేరిన, మృత్యువుకు వెరవకుండా పోరాడిన లక్షలాది పంజాబీ వీరుల గాథలు చరిత్ర పొడవునా వినిపిస్తాయి.. వినిపిస్తున్నాయి. ఐదు(పంచ) నదులు ప్రవహిస్తూ పైకి సస్యశామలంగా కనిపించే పంజాబ్ నేడు ఎదుర్కొంటోన్న భీకర సమస్యకు తెర రూపమే 'ఉడ్తా పంజాబ్' సినిమా.



కథ ఏంటి?

పంజ్ అంటే ఐదు. ఆబ్ అంటే నీరు. ఐదు నీటి ప్రవాహాల(నదుల) సమాహారమే పంజాబ్. ఇక ఉడ్తా పంజాబ్.. నాలుగు కథల సమాహారం. పంజాబీ రాక్ స్టార్ టామీ సింగ్ (షాహిద్ కపూర్), బిహారీ వలస కూలీ కుమారి పింకీ (ఆలియా భట్), పోలీస్ అధికారి సర్తాజ్ (దిల్జిత్), వైద్యురాలు ప్రీత్ (కరీనా కపూర్) ల జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనల దృశ్యరూపం. ఒకరికొకరు ఏమాత్రం సంబంధంలేని ఈ నలుగురూ మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్నవారే.



యూత్ ఐకాన్ గా పేరుతెచ్చుకున్న టామీ.. డ్రగ్స్ తీసుకుంటే తప్ప పాటలు పాడలేడు. ఒకప్పుడు హాకీ ప్లేయర్ అయిన పింకీ, అనుకోని పరిస్థితుల్లో పంజాబ్ కు కూలీగా వలసవెళ్లి మాదకద్రవ్యాల వలలో పడిపోతుంది. పొలీస్ అయి ఉండీ కించిత్ సంకోచం లేకుండా డ్రగ్స్ మాఫియా నుంచి లంచాలు తీసుకునే సర్తాజ్.. చివరికి ఆ డ్రగ్స్ వల్లే తన సోదరుణ్ణి కోల్పోతాడు. డ్రగ్స్ బారినపడి సర్వం కోల్పోయి రిహ్యాబిలిటేషన్ సెంటర్ లో చేరిన వారికి సపర్యలు చేస్తూ, మాదకద్రవ్యాల సరఫరాపై తనదైన శైలిలో పోరాడుతుంది డాక్టర్ ప్రీత్. వీరి జీవితాల్లోని ప్రతి అంకం డ్రగ్స్ తో ముడిపడి ఉన్నదే. డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్న టామీ సింగ్, పింకీలు ఆ చిక్కుముడులను తెంచుకుని ఉడ్తా పంఛీ(స్వేచ్ఛగా ఎగిరే పక్షి)లుగా మారతారా? లంచగొండి సర్తాజ్ నిజాయితీ పరుడిగా మారతాడా? మహమ్మారి బారిన పడినవారిని కాపాడే క్రమంలో డాక్టర్ ప్రీత్ విజయం సాధిస్తుందా? అనే ప్రశ్నలకు తెరపైనే సమాధానాలు కనిపిస్తాయి.



ఎలా తీశారు?

'ఉడ్తా పంజాబ్' రెగ్యులర్ మూవీ కాదనే విషయాన్ని గుర్తుకు తెచ్చేలా సినిమా మొత్తాన్ని డాక్యుమెంటరీలా తీశాడు దర్శకుడు అభిషేక్ చౌబే. అయితే ఎంచుకున్న విషయం సమకాలీన సమస్య కావడంతో సీన్లన్నీ రియలిస్టిక్ గా, వాస్తవ ప్రతిబింబాలుగా కనిపిస్తాయి. నిజానికి ఉడ్తా పంజాబ్ సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే. సుదీప్ శర్మతో కలిసి రాసుకున్న స్క్రిప్టును అచ్చుగుద్దినట్లు తెరకెక్కించడంతో అభిషేక్ చుబే విజయం సాధించాడు. వాస్తవాలు ఎంత కఠినంగా ఉంటాయనడానికి ఈ సినిమాపై చెలరేగిన వివాదాలే నిదర్శనం.



నటీనటులు అందరిలోకి ఆలియా భట్ అద్భుతంగా  అమరింది.  డిఫరెంట్ షేడ్స్ ఉన్న పింకీ పాత్రలో ఆమె నటనను మెచ్చుకోనివారుండరు. రాక్ స్టార్ గా, డ్రగ్స్ బానిసగా షాహిద్ సైతం అదరగొట్టినా ఎక్కువ మార్కులు పడేది ఆలియాకే. దల్జిత్, కరీనాలు పాత్రల్లో జీవించారు. డైలాగ్స్ అన్నీ పంజాబీలో ఉండటం వల్ల వాటిని అర్థం చేసుకోవడం కష్టమే అయినా సబ్ టైటిల్స్  ఆ కష్టాన్ని తేలికచేశాయి.



కొసమెరుపు: పాకిస్థాన్ నుంచో, ఆ పక్కనున్న అఫ్ఘానిస్థాన్ నుంచో, మరో ప్రాంతం నుంచో పంజాబ్ కు మాదకద్రవ్యాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అక్కడి దాబాలో పరాటాల కంటే వేగంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. అవి.. పంజాబ్ ను మెక్సికో కన్నా క్రూరమైన ప్రాంతంగా మర్చుతున్నాయి. ఇది కాదనలేని నిజం. ఆ వాస్తవ దృశ్యమే 'ఉడ్తా పంజాబ్'.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top