క్రేజ్ చూసుకో...క్యాష్ చేసుకో!

క్రేజ్ చూసుకో...క్యాష్ చేసుకో! - Sakshi


 సాధారణంగా ఎవరికైనా ఏడాదికి ఒకసారే జీతాలు పెరుగుతుంటాయ్. సినిమా తారలకైతే సక్సెస్‌కి తగ్గట్టు వీలుంటే సినిమా సినిమాకూ పారితోషికం పెరిగే వీలుంటుంది. ప్రస్తుతం హిందీ రంగంలో ‘టాప్ ఫైవ్’లో ఉన్న తారలు తమ క్రేజ్‌ని భారీగానే క్యాష్ చేసుకుంటున్నారు. ముంబయ్ వార్తల ప్రకారం ఆ తారలు ఇప్పుడు ఎంతెంత పారితోషికం తీసుకుంటున్నారంటే...

 

 ‘కంగానానా? మజాకానా?’ అన్నట్లుగా ఈ బ్యూటీ పారితోషికం తీసుకుంటున్నారట. అందాలు ఆరబోసే పాత్రలే కాదు... అభినయానికి ఆస్కారం ఉన్నవాటిని కూడా బ్రహ్మాండంగా చేయగలుగుతానని ‘తను వెడ్స్ మను’, ‘క్వీన్’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ చిత్రాలతో నిరూపించుకున్నారు కంగన. ఆమె చిత్రాలకు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. అందుకే కంగన ప్రస్తుతం 11 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారట. ఇప్పుడు బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న తారగా కంగన నంబర్ వన్ స్థానంలో ఉన్నారని భోగట్టా.

 

 సినిమాల ఎంపిక విషయంలో సెలక్టివ్‌గా ఉంటున్న కరీనా కపూర్ కథానాయికై, పదేళ్లయ్యింది. కుర్ర తారలకు దీటుగా ఫామ్‌లో ఉన్న కరీనా తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట. అలాగే, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనే కూడా రెండో స్థానంలోనే ఉన్నారు. దాదాపు 9 కోట్లకు అటూ ఇటూగా వీరి పారితోషికం ఉందట.

 

 ఇక, లేడీ ఓరియంటెడ్ చిత్రాలకే కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న విద్యాబాలన్ 7 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారట. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండే కత్రినా కైఫ్ పారితోషికం కూడా ఇంతే. కత్రిన, విద్యా బాలన్‌లు మూడో స్థానంలో నిలవగా, అనుష్కా శర్మ, సోనమ్ కపూర్ సుమారు 6 కోట్లు తీసుకుంటూ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు.

 

 అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ శ్రద్ధాకపూర్ మార్కెట్ మాత్రం పెరగడం లేదని అంటున్నారు. నిర్మాతలు ఆమెకు 5 కోట్లకు మించి పారితోషికం ఇవ్వడానికి ముందుకు రావడం లేదట. ఫలితంగా ఐదో స్థానంలో శ్రద్ధా కపూర్ ఉన్నారు. ఆలియా భట్, పరిణీతి చోప్రా వంటి తారల పారితోషికం 3 కోట్ల రూపాయలకు మించి లేదు. ఒకవేళ లేటెస్ట్ సినిమా రిజల్ట్ అటూ ఇటూ అయితే అప్పుడు ఈ స్థానాలు కూడా అటూ ఇటూ అయిపోతాయ్. అది తెలుసు కాబట్టే... మన అందాల తారలందరూ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు. అదేనండీ... క్రేజ్ ఉండగానే క్యాష్ చేసేసుకుంటున్నారు!




 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top