విభేదాలు లేవు!కలిసే చేస్తున్నాం : దాసరి

విభేదాలు లేవు!కలిసే చేస్తున్నాం : దాసరి - Sakshi


‘‘యావత్ తెలుగు చలన చిత్రపరిశ్రమ ఒక్కతాటిపై నిలబడి చేస్తున్న బృహత్తర కార్యక్రమం ఇది. మా ముందు తరం, మా తరం, మా తర్వాతి తరం.. ఇలా తరాలు మారుతుంటాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు మారుతుంటారు. కానీ, సినిమాకీ, ప్రేక్షకుడికి మధ్య ఉండే ఈ అవినాభావ సంబంధం శాశ్వతమైనది’’ అని డా. దాసరి నారాయణరావు అన్నారు. వైజాగ్ తుపాను బాధితుల సహాయార్థం ఈ నెల 30న ‘మేము సైతం’ పేరుతో చిత్రపరిశ్రమ భారీ కార్యక్రమం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దాసరి మాట్లాడుతూ -‘‘నాటి రాయలసీమ కరువు, దివిసీమ ఉప్పెన.. ఇలా ఏ విపత్తు జరిగినా చిత్రసీమ ముందుండి సహాయం చేసింది.

 

  ఇప్పుడు కూడా అంతే. గత ప్రెస్‌మీట్‌కి దాసరి రాలేదనీ, మరో ప్రెస్‌మీట్‌లో వేరేవాళ్లు రాలేదనీ, విభేదాలున్నందువల్లే ఇలా జరుగుతోందని కొంతమంది అంటున్నారు. ఎవరి వీలునుబట్టి వాళ్లు పాల్గొంటారు. అంతేకానీ, మా మధ్య మాకెలాంటి విభేదాలూ లేవు. అవి వేరేవాళ్లు సృష్టిస్తున్నారు. గతంలో ఇలాంటి భారీ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు సన్నాహాల కోసం ముందు కూడా షూటింగ్స్‌కి సెలవు ప్రకటించేవాళ్లం. అయితే, సాంకేతికాభివృద్ధి కారణంగా... సెలవుల్లేకుండానే పకడ్బందీ ప్రణాళికలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేసుకొనే వీలవుతోంది’’ అని చెప్పారు.

 

 మోహన్‌బాబు మాట్లాడుతూ- ‘‘విపత్తుల బాధితులకు సహాయం చేయాలనే సంప్రదాయం మొదలుపెట్టింది అన్న (ఎన్టీఆర్) గారే. మేమీ స్థాయిలో ఉండటానికి కారకులైన ప్రజలకు సహాయం చేయడానికి మేమున్నామంటూ అందరం ముందుకొచ్చాం. మాలో మాకెలాంటి భేదాభిప్రాయాల్లేవు’’ అన్నారు. ప్రజలకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటామని కృష్ణంరాజు చెప్పారు. 30న జరగబోయే కార్యక్రమాలను డి. సురేష్‌బాబు వివరించారు. కేయస్ రామారావు, ఎన్వీ ప్రసాద్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, అశోక్‌కుమార్, కొడాలి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, లక్ష్మీప్రసన్న, నాని, సందీప్ కిషన్, కమల్ కామ రాజు, శశాంక్, నిఖిల్, నవదీప్, మనోజ్ నందం, ఉత్తేజ్, కాదంబరి కిరణ్, ఖయ్యూమ్ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top