కథ కంచికి వెళ్లిపోయింది.. చరిత్ర మాత్రం మిగిలింది!

కథ కంచికి వెళ్లిపోయింది.. చరిత్ర మాత్రం మిగిలింది! - Sakshi


ఏయన్నార్ జయంతి స్పెషల్

సుమారు 60 మంది హీరోయిన్‌లతో స్టెప్పులేసి, డ్యూయెట్‌లు పాడి, రొమాన్స్ చేసి, ఆ రోజుల్లో ఓ కలల రాకుమారుడుగా పేరు తెచ్చుకున్న అక్కినేని కలలోకి ఏ హీరోయిన్ రాలేదా?

ఇదే మాట ఆయన్నే నేరుగా అడిగితే ‘ఎందుకు రాలేదు... వచ్చింది... కాకపోతే ఆమె హీరోయిన్ కాదు’ అని అన్నారాయన. హీరోయిన్ కాకపోతే ఇంకెవరయి ఉంటారు? మనసుకి నచ్చిన ప్రతి వారితో ఎంతో చనువుగా ఉంటారాయన. అలాంటిది ఆయన కలల్లోకి చొరబడే ఆ డ్రీమ్‌గర్ల్ ఎవరై ఉంటారు? ‘అమ్మో... నేన్చెప్పనుగాక చెప్పను’ అంటూ ఓ రెండు మూడు రోజులు బతిమాలించుకుని ఆ రహస్యాన్ని బయటపెట్టారాయన - ‘సూర్యకాంతం’ అని.

 

ఈ మాట ఎవరు విన్నా ఆశ్చర్యపోతారు. ఆయన మనల్ని ఆట పట్టిస్తున్నారనుకుంటారు. కానీ ఇది నిజం. ‘భార్యాభర్తలు’ షూటింగ్‌లో... ఓ సీన్‌లో ఆవిడ అద్దం ముందు కూచొని తల దువ్వుకుంటూ ఉంటుంది. ఆవిడ వెనక సోఫాలో నేను కూచొని ఉన్నాను. లావుగా ఉన్నా కళ గల ముఖం అనుకున్నాను. అంతే... అదే సబ్ కాన్షియస్‌లో రిజిస్టర్ అయిపోయిందనుకుంటాను... అదే రోజు రాత్రి ఆవిడ కల్లోకొచ్చింది. ‘ఏ.. ఏ.. ఏ..’ అంటూ పెద్ద అరుపుతో లేచి కూచున్నాను. ‘‘ఏంటండీ... ఏమయ్యింది... ఎప్పుడూ ఇలా నిద్దట్లో అరవలేదు?’’ అంటూ అడిగింది అన్నపూర్ణ. ‘‘సూర్యకాంతం కల్లోకొచ్చింది’’ అని చెప్పాను. అంత అర్ధరాత్రిలోనూ మా ఆవిడ ఒకటే నవ్వు ‘‘ఏ సావిత్రో, జమునో, కృష్ణకుమారో రాకుండా సూర్యకాంతం ఏమిటండీ మరీనూ?’’ అంటూ.

 

‘‘ఈ ఎక్స్‌పీరియెన్స్ నేను షూట్ చేసుకుంటాను’’ అని అడిగాను. ‘‘వద్దు... పెద్దావిడ... బావుండదు... పైగా ఆవిడ నన్ను ‘తమ్ముడూ’ అని అంటుంది. పత్రికల్లోకైతే  ఓకే గానీ విజువల్‌గా వద్దు. పాఠకులు అర్థం చేసుకోగలరు గానీ ప్రేక్షకులు వాళ్లలా ఆలోచించలేరు’’ అని అన్నారు. అంత క్లియర్ కన్విక్షన్ ఉన్న వ్యక్తి ఆయన.

 అలానే కమిట్‌మెంట్ విషయంలో కూడా అటువంటి వ్యక్తిత్వం మరొకరిలో కనబడదు. ‘మా టీవీ’ కోసం చేసిన ‘గుర్తుకొస్తున్నాయి’ షూటింగ్ టైమ్‌లో ‘ఆయనొస్తే కూచోబెట్టండి’ అని ఓ కుర్చీ వేయించి, పక్కన ఇంకేమైనా మంచి లొకేషన్లు ఉన్నాయా అని చూడడానికి వెళ్లి వచ్చేలోగా ఆయనొచ్చి కూచునేవారు. నేను రాగానే లేచి నిలబడేవారు. ‘‘మీకన్నా దాదాపు ముఫ్ఫై ఏళ్ళు చిన్నవాణ్ణి సార్...’’  అని సిగ్గుపడిపోతుంటే ‘‘ఇక్కడ మీరు డెరైక్టరు... నేను మిమ్మల్ని గౌరవిస్తేనే యూనిట్ మిమ్మల్ని గౌరవిస్తుంది’’ అనేవారు అక్కినేని. షూటింగ్ ముగియగానే ‘‘మళ్లీ ఎప్పుడుండొచ్చు?’’ అని అడిగేవారు.



‘‘రెండు రోజుల ముందు నుంచీ ఎర్లీగా పడుకోవాలి. షూటింగ్ టైమ్‌లో ముఖం ఫ్రెష్‌గా కనిపించాలి కదా!?’’ అనేవారు. అంత బాధ్యత ఫీలయ్యే నటీనటులు ఇవాళ ఎంతమంది ఉండి ఉంటారు? అంతవరకూ మనల్ని పేరు పెట్టి పిలిచే అక్కినేని ఒకసారి షూటింగ్ టైమ్ గనుక ఫిక్స్ అయితే ఇంక ఆయన నుంచి వచ్చేది ‘ఓకే సర్’ అనే. ఆ ‘సర్’ అనే పదం షూటింగ్ పూర్తయ్యే వరకూ ఉంటుంది. ప్యాకప్ అయిన వెంటనే మాయమైపోతుంది. మనల్ని మన పేరుతోనే పిలుస్తారు. మనసుకి, మెదడుకి ఎంతో శిక్షణ ఇస్తేనే గాని ఇంతటి క్రమశిక్షణ సాధ్యం కాదు.

 

చాలా విషయాలు నాతో పంచుకునే వారాయన. ‘‘సాయంత్రం ఇంటికి వెళుతున్నప్పుడు వీలైతే ఓసారి రండి’’ అని ఫోన్ చేసేవారు. కారప్పూస, టీ ఆయన ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్స్. వెళ్లేసరికి ఇద్దరికి రెడీగా ఉండేది. ఇక కబుర్లే కబుర్లు. ‘‘కొన్ని పాత్రలు నేను వెయ్యకపోతే అవి ఎందుకు వెయ్యటం లేదో, వాటి గురించి ఎన్టీఆర్‌కి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాణ్ణి. ఎందుకంటే తర్వాత అప్రోచ్ అయ్యేది ఆయన్నే కాబట్టి’’ అని చెప్పారు ఏయన్నార్.

 ‘గుర్తుకొస్తున్నాయి’  తీస్తున్నప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో ఆయనతో విభేదించాల్సి వచ్చేది. ఉదాహరణకి ‘పూజాఫలం’ సినిమాలో ఆయన పక్కన వేసింది జగ్గయ్య అని నేనూ, కాదు రమణమూర్తి అని ఆయనా వాదించుకున్నాం. ఒక్క క్షణం ఆలోచించి ‘‘వద్దు... మీ వెర్షనే కానివ్వండి. యూ ఆర్ ది కెప్టెన్’’ అని మనస్ఫూర్తిగా నేననుకున్న వెర్షన్‌కే తన అనుభవాల్ని చెప్పారు.



మర్నాడు సరిగా ఉదయం 6 గంటలకి... ఏయన్నార్ గారి దగ్గర్నుంచి ఫోన్... ‘‘మీరే కరెక్ట్. ‘పూజాఫలం’లో నా పక్కన యాక్ట్ చేసింది జగ్గయ్యే. మరి రమణమూర్తి అని ఎలా పొరబడ్డానో ఏమిటో?’’ అంటే, ‘‘ఐయామ్ సారీ... షూటింగ్ టైమ్‌లో నేను మీతో అలా ఆర్గ్యూ చేసి ఉండాల్సింది కాదు’’ అని ఆయన అంటూంటే ఆ సంస్కారం ముందు అంగుష్ఠమాత్రుణ్ణయిపోయా.

 నేనేది అడిగినా కాదనేవారు కాదు. ఎంతో కఠి నంగా తీసుకున్న నిర్ణయాలు కూడా నా మీద అభిమానంతో సడలించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి - ఇక జీవితంలో అడుగు పెట్టనన్న సారథీ స్టూడియోస్‌లో దాదాపు ముప్ఫై ఏళ్ల తర్వాత తిరిగి అడుగు పెట్టడం.



నేను జీవితాంతం గర్వంగా చెప్పుకోగలిగిన సంఘటన అది. ‘గుర్తుకొస్తున్నాయి’ 74 ఎపిసోడ్‌లు. తెరపై ఏయన్నార్, సుమ తప్ప ఇంకెవరూ కనిపించరు. 74 ఎపిసోడ్‌లు తెరపై కేవలం ఇద్దరే... టెలివిజన్ చరిత్రలో అదొక రికార్డ్. ‘నా జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు గుండెల్లో దాచుకున్న రహస్యాలతో సహా అన్నీ కవర్ చేసేశారు మీరు. ఈ వయసులో కూడా నా జ్ఞాపకశక్తి అమోఘంగా ఉందని ప్రేక్షకులకి రుజువు చేశారు. నా ఆనందం కొద్దీ ఇస్తున్నాను. కాదనకండి’’ అంటూ ఓ చెక్ ఇచ్చారాయన. ‘నా ఉద్యోగ ధర్మంగా నాకెంతో ఇష్టమైన మీ గురించి చేశాను.



నేనిలా తీసుకోకూడదు’’ అన్నాను. దానికాయన ఎంత మురిసిపోయారో - ‘ఐ లైక్ యువర్ క్యారెక్టర్’ అంటూ అంతటితో ఊరుకోలేదు. నేను పని చేసిన ‘మా టీవీ’ యాజమాన్యాన్ని ఒప్పించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుని, డబ్బుగా ఉంటే ఖర్చయిపోతుందని ఓ బంగారు కంకణం చేయించి ఆయనకు చూపించాను. ‘‘మంచి పని చేశారు. ఉంచండి. ఎప్పటికైనా ఆ కంకణాన్ని నేను మీకు తొడుగుతాను’’ అని అన్నారు అక్కినేని. ఇవాళ... కథ కంచికి వెళ్లిపోయింది... చరిత్ర మాత్రం మిగిలింది... బంగారంలాంటి ఆయనే లేరు. ఆ బంగారు కంకణం మాత్రం ఆయన తొడగకుండానే మిగిలిపోయింది ఆయన గుర్తుగా...!!

- రాజా, మ్యూజికాలజిస్ట్, raja.musicologist@gmail.com

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top