వాళ్లలా ఉండాలని సన్నబడ్డాను!

వాళ్లలా ఉండాలని సన్నబడ్డాను!


స్వామి రారా, కార్తికేయ.. ఇలా వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ, హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నారు నిఖిల్. ఆయన నటించిన తాజా చిత్రం ‘సూర్య వెర్సస్ సూర్య’ ఈ నెల 5న విడుదల కానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం నటుడిగా తనకింకా పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకాన్ని నిఖిల్ వ్యక్తం చేశారు. ఆయన చెప్పిన విశేషాల్లో కొన్ని...

 

  సూర్య తేజస్సును తట్టుకోలేని సూర్య అనే యువకుడిగా ఈ చిత్రంలో నటించాను. పార్సీరియా అనే వ్యాధితో బాధపడుతుంటాను. పగటిపూటను భరించలేని నేను, పగలంటే విపరీతంగా ఇష్టపడే అమ్మాయిని ప్రేమిస్తాను. మా ప్రేమ ఎలా సక్సెస్ అయ్యిందనేది సినిమాలో చూడాల్సిందే. ఈ చిత్రంలో ప్రత్యేకంగా విలన్లుండరు. సూర్యుడే శత్రువు. ఎక్కువ శాతం షూటింగ్ రాత్రి పూట చేశాం.

 

  ‘కార్తికేయ’ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని కెమెరామ్యాన్‌గా చేశారు. ‘సూర్య వెర్సస్ సూర్య’ కథను ఆయన చెప్పినప్పుడు ఉద్వేగానికి గురయ్యా. హాలీవుడ్ టాప్ స్టార్స్ టామ్ క్రూజ్, డస్టిన్ హాప్‌మ్యాన్‌ల శరీరాకృతి, హావభావాలు ఒకే వ్యక్తిలో ఉంటే ఎలా ఉంటాడో సూర్య పాత్ర అలా ఉండాలని అప్పుడే చెప్పాడు. దాంతో కొంచెం సన్నబడ్డాను. శారీరక భాష మార్చుకున్నాను.

 

  ఏ పాత్రలో అయినా పూర్తిగా ఒదిగిపోయి, న్యాయం చేస్తా. జయాపజయాలు నా చేతుల్లో ఉండవు. నా గత చిత్రాలకు కష్టపడినట్లుగానే ఈ చిత్రానికీ కష్టపడ్డాను. రెండు విజయాల తర్వాత చేసిన ఈ సినిమా విజయం సాధించి, నాకు ‘హ్యాట్రిక్’ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా విడుదల తర్వాత మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వెళుతున్నా. ఆ తర్వాత న్యూయార్క్ వెళ్లి మూడు నెలలు యాక్టింగ్ కోర్స్ చేస్తా. నటనలో మరిన్ని టెక్నిక్స్ కోసం ఈ కోర్సు  ఉపకరిస్తుందని నా నమ్మకం.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top