'సుప్రీం' మూవీ రివ్యూ

'సుప్రీం' మూవీ రివ్యూ - Sakshi


టైటిల్ : సుప్రీం

జానర్ : యాక్షన్ డ్రామా

తారాగణం : సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా, మైఖేల్ గాంధీ, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, కబీర్ దుహాన్ సింగ్, రవికిషన్

సంగీతం : సాయికార్తీక్

దర్శకత్వం : అనీల్ రావిపూడి

నిర్మాత : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్



పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న సాయిధరమ్ తేజ్, పటాస్ సక్సెస్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనీల్ రావిపూడి కాంబినేషన్లో సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన సినిమా సుప్రీం. పక్కా మాస్ ఫార్ములాతో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా సాయి, అనీల్ల కెరీర్కు మరో మంచి హిట్ ఇచ్చిందా..?



కథ :

సుప్రీం కథ అనంతపురంలోని జాగృతి సెంట్రల్ ట్రస్ట్ చుట్టూ తిరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా ఆ ట్రస్ట్ను, ట్రస్ట్కు చెందిన వేల ఎకరాల పంట భూమిని నమ్ముకొని పదిహేను వేల మంది రైతులు బతుకుతుంటారు. ఆ ట్రస్ట్ భూముల మీద కన్నేసిన ఇండస్ట్రియలిస్ట్ విక్రమ్ సర్కార్(కబీర్ దుహాన్ సింగ్) దొంగ డాక్యుమెంట్లతో ట్రస్ట్ ను సొంతం చేసుకోవాలనుకుంటాడు. విక్రమ్ సర్కార్ దౌర్జన్యంపై ట్రస్ట్ వ్యవహారాలు చూసే నారాయణరావు(సాయి కుమార్) కోర్టుకెళతాడు. ఆ ట్రస్ట్కు చెందిన వారసుడిని, ఒరిజినల్ డాక్యుమెంట్స్ను తీసుకువస్తే ట్రస్ట్ ఆస్తులను పేద రైతులకు అప్పగిస్తామంటూ, వారసుడిని తీసుకురావడానికి నెల రోజుల గడువు ఇస్తుంది కోర్టు.



తన ట్యాక్సీకి సుప్రీం అని పేరు పెట్టుకున్న క్యాబ్ డ్రైవర్ బాలు( సాయిధరమ్ తేజ్). రోజూ ట్యాక్సీ నడపడం, తన తండ్రి తాగి పడిపోతే ఇంటికి తీసుకొచ్చి సేవలు చేయటం తప్ప పెద్దగా ఆశలు, ఆశయాలు లేని సాదాసీదా కుర్రాడు. అలాంటి బాలు ఆ ఏరియాకు ఎస్ఐగా వచ్చిన బెల్లం శ్రీదేవి(రాశీఖన్నా)తో ప్రేమలో పడతాడు. ప్రేమ కథ అలా నడుస్తుండగానే బాలుకి ఓ ఎనిమిదేళ్ల అనాథ కుర్రాడు రాజన్(మైఖేల్ గాంధీ) పరిచయం అవుతాడు. బాలుకి పరిచయం అయిన రాజన్ ఎవరు..? ఆ కుర్రాడి మూలంగా బాలు జీవితం ఎలా మారిపోయింది...? జాగృతి సెంట్రల్ ట్రస్ట్ గొడవలోకి బాలు ఎందుకు వచ్చాడు...? అన్నదే మిగతా కథ.



నటీనటులు :

గత సినిమాల మాదిరిగానే సుప్రీంలో కూడా సాయిధరమ్ తేజ్ వీలైనంతగా తన మామయ్యలను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడు. యాక్షన్ సీన్స్, డ్యాన్స్ లలో మాత్రం తన మార్క్ చూపిస్తూ ఆకట్టుకున్నాడు. రాశీఖన్నా పాత్రకు కథతో ఎలాంటి సంబంధం లేకపోయినా గ్లామర్ విషయంలో బాగానే వర్క్ అవుట్ అయ్యింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో రాశీ కామెడీతో బాగానే ఆకట్టుకుంది.


మెయిన్ విలన్గా కబీర్ దుహాన్ సింగ్ స్టైలిష్గా కనిపిస్తే, రేసుగుర్రం ఫేం రవికిషన్ మాస్ పాత్రలో కామెడీ విలన్గా మెప్పించాడు. సాయికుమార్, రాజేంద్ర ప్రసాద్లు తమకు అలవాటైన పాత్రలతో మరోసారి తమ మార్క్ చూపించారు. రాజన్ పాత్రలో కనిపించిన బాలనటుడు లుక్తో పాటు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్తో సినిమాకు హెల్ప్ అయ్యాడు. 30 ఇయర్స్ పృథ్వీ, ప్రభాస్ శీను, పోసాని కృష్ణమురళి, శ్రీనివాస రెడ్డిలు కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నారు.



సాంకేతిక నిపుణులు :

పటాస్ సినిమాలో పర్ఫెక్ట్ కామెడీతో పాటు మంచి యాక్షన్ ఎపిసోడ్స్తో ఆకట్టుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి, సుప్రీంలో కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేసే ప్రయత్నం చేశాడు. ఎంటర్టైన్మెంట్ పరంగా ఓకె అనిపించినా పటాస్ స్థాయిలో మెప్పించటంలో మాత్రం తడబడ్డాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ సాగదీసినట్టుగా అనిపిస్తాయి.  సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి బాగుంది. సాంగ్స్తో పాటు ప్రీ క్లైమాక్స్లో వచ్చే చేజ్ సీన్స్ విజువల్గా ఆకట్టుకున్నాయి. సాయి కార్తీక్ సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. రీమిక్స్ చేసిన అందం హిందోళం పాట తప్ప వేరే ఏ పాట థియేటర్ నుంచి బయటకు వచ్చాక తిరిగి గుర్తుకు వచ్చేలా లేదు.



ప్లస్ పాయింట్స్ :

మెయిన్ స్టోరి

రాజన్ క్యారెక్టర్

యాక్షన్ సీన్స్



మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ లవ్ సీన్స్

సంగీతం



ఓవరాల్గా సుప్రీం, రొటీన్ యాక్షన్ డ్రామా



- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top