కాపీ కొట్టమంటే సినిమానే వదులుకుంటా!

కాపీ కొట్టమంటే సినిమానే వదులుకుంటా!


‘‘నాకు నచ్చిన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆయన నిర్మాతగా చేసిన   ‘కుమారి 21 ఎఫ్’ ఘనవిజయం సాధించాలని కోరుకున్నా. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు నచ్చుతుందా అని  టెన్షన్ ఉండేది. సుకుమార్ మాత్రం బలంగా నమ్మారు. రీ-రికార్డింగ్ కూడా పూర్తి చేశాక, ‘బ్లాక్ బస్టర్ ఖాయం’ అని సుకుమార్‌తో అన్నాను. మా నమ్మకం హిట్టయ్యింది’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అన్నారు. రాజ్‌తరుణ్‌తో సూర్యప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ‘కుమారి 21 ఎఫ్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.



ఈ చిత్రం విజయానందంతో దేవిశ్రీ ప్రసాద్ మీడియాతో ముచ్చటించారు..


 

* నాకు చిన్నా, పెద్దా తేడా లేదు. ఏ సినిమా అయినా ఒకటే. మంచి పాటలివ్వడానికి సబ్జెక్ట్‌లో స్కోప్ ఉండాలి. నా కెరీర్ స్టార్టింగ్‌లో ‘అభి’ వంటి చిత్రాలు చేశాను. ఆ సినిమాలో ‘వంగ తోట మలుపు కాడ...’ పాట నాకు బాగా నచ్చుతుందని ఇప్పటికీ అల్లు అరవింద్‌గారు అంటుంటారు. పాటల కంపోజింగ్‌కి నేను విదేశాలకు వెళ్లను. నా రికార్డింగ్ స్టూడియోలోనే నాకు సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ, దర్శక-నిర్మాతల ఇష్టం మేరకు ‘అత్తారింటికి దారేది’కి బార్సిలోనా వెళ్లాను. మూడు రోజుల్లో మూడు పాటలు పూర్తి చేశాను. తాజాగా ‘నాన్నకు ప్రేమతో’ కోసం విదేశాలకు వెళ్లాను. నాలుగు రోజుల్లో మూడు పాటలు చేసేశాను.  



* ఏ ట్యూన్ చేసినా అది స్వయంగా నేనే  చేయాలనుకుంటాను. కాపీ ట్యూన్స్ జోలికి వెళ్లను. నా కెరీర్   కొత్తలో ఓ దర్శకుడు ఓ హాలీవుడ్ సాంగ్ చూపించి, అలా చేయమన్నాడు. అప్పుడు నేను ‘సారీ సార్.. మనం భవిష్యత్తులో కలిసి పని చేద్దాం. ఇప్పుడు నా వల్ల కాదు’ అన్నాను. ‘మరీ ఇంత యాటిట్యూడా? పైకి రావు’ అన్నారు. నవ్వుకున్నాను. మొన్నా మధ్య ఫలానా సంగీతదర్శకుడు చేసిన పాట ఫలానా పాటకు కాపీ అంటూ ఎవరో సర్వే నిర్వహించారు. అందులో నా పేరు లేదు. ‘నవ్వు దొరకవా?’ అన్నారు. ఎవరైనా దర్శకులు నా దగ్గర మరో ట్యూన్‌ని కాపీ కొట్టమంటే, సినిమానే వదులుకుంటాను తప్ప ఎప్పటికీ కాపీ చేయను. మనకున్నవి ఏడే స్వరాలు. ఆ స్వరాల చుట్టూ పాట తిరిగే క్రమంలో ఏదో చిన్న సౌండ్ మరేదో పాటలో విన్నట్లు అనిపించవచ్చు. దాన్నేం చేయలేం.

     

* పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ కోసం ఓ సాంగ్ చేశాను. ఒక మంచి మాస్ బీట్ విని, ‘నీ ట్యూన్‌తో నాకు చాలా కిక్ ఇచ్చావ్. నువ్వు చేసినదానికన్నా డబుల్ డ్యాన్స్ చేస్తాను’ అని పవన్ కల్యాణ్ ఫోన్ చేసి, అన్నారు.



* అల్లు అరవింద్, అశ్వనీదత్ వంటివాళ్లు నన్ను హీరోగా పెట్టి, సినిమాలు చేస్తామంటున్నారు. తమిళం నుంచి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ‘100% లవ్’ చిత్రంలో నన్ను హీరోగా నటించమని అడిగారు.  అప్పుడు చెయ్యలేదు. సంగీతదర్శకుణ్ణి కాబట్టి, మ్యూజిక్ బేస్డ్ సినిమా చేశామా? అన్నట్లు కాకుండా కథాబలం ఉన్న చిత్రాలైతే చేస్తా. ఇప్పుడు మనకు చాలామంది హీరోలున్నారు. అందుకని అత్యవసరంగా నేను హీరోగా రంగంలోకి దిగాల్సిన పని లేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top