సినిమా దొంగలు

సినిమా దొంగలు


 కథ... నాది కొట్టేసి, వాడు చేసేస్తున్నాడు! సినిమా ఇండస్ట్రీలో కథల చోరీ గురించి విన్నాం. ట్యూన్... నాది నొక్కేసి, వాడు వాయించేశాడు! సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ లేపేయడం గురించి విన్నాం. ఐడియా... ఎవరిదో అరువు తెచ్చుకొని, వాడు వండేశాడు!సినిమా ఇండస్ట్రీలో ‘ఫ్రీ’ మేక్‌లు గురించి వింటూనే ఉన్నాం.కథ, స్క్రీన్‌ప్లే, డెరైక్షన్‌ల దొంగతనాలు దేవుడెరుగు...ఇప్పుడు హోలు మొత్తం సినిమాకే హోల్ పెట్టేస్తున్నారు. అదేనండీ! ఇంటి దొంగలే కన్నం వేసేస్తున్నారు.సినిమా రిలీజ్ కాక ముందే కనుల విందు చేసేస్తున్నారు.

 

 సినిమా షూటింగ్ జరుగుతుండగానే అందులోని సన్నివేశాలు, పాటలు బయటకు లీకై పోవడం ఇటీవలి కాలంలో తెలుగు నాటా బాగా పెరుగుతోంది. పెద్ద హీరోల చిత్రాలకూ, భారీ సినిమాలకూ ఈ బెడద మరీ ఎక్కువగా ఉంది. మచ్చుకు కొన్ని సంఘటనలు...

 

2008లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన ‘జల్సా’ చిత్రంలోని ఒక పాట దృశ్యాలు ఎడిటింగ్ దశలోనే నెట్‌లో దర్శనమిచ్చాయి.

 

2015లో ‘బాహుబలి’ సినిమా రిలీజ్‌కు కొద్ది వారాల ముందే ఆ సినిమాలోని యుద్ధ సన్నివేశాలు బయటకు వచ్చేశాయి. గ్రాఫిక్స్ కోసం పంపిన దృశ్యాలను ఇంటి దొంగలే బయట పెట్టారని తేలింది.  ఈ 2016లో తాజాగా చిన్న ఎన్టీయార్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ ఆడియో ఇంకా రిలీజే కాలేదు. కానీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూర్చిన బాణీల్లో ఒక పాట ఇప్పటికే బయటకు లీకై, వాట్సప్‌లలోకి వచ్చేసింది.

 

 జూలై 21వ  తేదీ... గురువారం...

సూపర్‌స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం ‘కబాలి’కి మరో 24 గంటల సమయమే ఉంది. దేశమంతా రజనీకాంత్ ‘కబాలి’ ప్రీ-రిలీజ్ హంగామాతో ఊగిపోతోంది. ఇంతలో రిలీజ్‌కు కొద్ది గంటల ముందే కొన్ని పైరసీ వెబ్‌సైట్లలో ‘కబాలి’ ప్రింట్ వచ్చేసింది. ఆ మాటకొస్తే, అంతకు మూడు రోజుల ముందరే జూలై 19నే డజన్లకొద్దీ వెబ్‌సైట్లలో ‘లీకైన సినిమా కాపీ’ లింకులు ‘డార్క్ వెబ్’లో ప్రత్యక్షమయ్యాయి. మరింత నష్టాన్ని నివారించడం కోసం, అవన్నీ గాలివార్తలనీ, అసలు పైరసీయే జరగలేదనీ నిర్మాత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. కానీ, శుక్రవారం ఉదయం ‘కబాలి’ ఫస్ట్ షో బొమ్మ థియేటర్లలో పడక ముందే సినిమాలో రజనీ ఇంట్రడక్షన్ సన్నివేశంతో సహా, దాదాపు గంటా యాభై నిమిషాల సినిమా, వెబ్‌సైట్‌లో ఆ పైరసీ ప్రింట్ లింకు - అన్నీ  వాట్సప్ మెసేజుల్లో మోత మోగిపోయాయి. థియేటర్‌లో ‘కబాలి’ టికెట్లు దొరక్క పోయినా, స్మార్ట్‌ఫోన్‌లో సూపర్ క్వాలిటీతో పైరసీ ప్రింట్ ఈజీగా దొరికేసింది.

 

 గత నెలన్నరలో... భారీగా...

 ఇలా రిలీజ్‌కు ముందే మొత్తం ఫిల్మ్ అంతా బయటకు వచ్చేసిన సినిమా గడచిన నెల రోజుల పైచిలుకు కాలంలో ఇది కనీసం అయిదోది. సెన్సార్ బోర్డు నుంచో (హిందీ చిత్రాలు ‘ఉడ్తా పంజాబ్’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’), మరో రకంగానో (సల్మాన్‌ఖాన్ ‘సుల్తాన్’), మన కన్నా ఒక రోజు ముందరే ప్రీమియర్ షో పడే విదేశాల నుంచో (‘కబాలి’), చివరకు ఇండియాలో హాళ్ళలో రిలీజ్ రోజునే విదేశాల్లోని ఎన్నారైలూ నెట్‌లో సినిమా చూసేలా ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా చేస్తున్న ప్రయోగాత్మక మార్కెట్ విస్తరణ అయిన ‘ఆన్‌లైన్ రిలీజ్’ల నుంచో (జూన్‌లో రిలీజైన హీరో కృష్ణ ‘శ్రీశ్రీ’, ముళ్ళపూడి వర దర్శకత్వంలోని ‘కుందనపు బొమ్మ’) కూడా సినిమా పైరసీ అయిపోతోంది.

 

చిత్రం ఏమిటంటే, వీటిలో 90 శాతం ఇంటి దొంగల పనే కావడం! ఒక్క మాటలో  సినిమాల పైరసీకి ఈశ్వరుడైనా పట్టుకోలేని ‘ఇంటి దొంగలు’ తయారయ్యారు. ఒకప్పుడు సినిమా రిలీజైన తర్వాతే పైరసీ భూతం వెంటాడేది. కానీ, ఇప్పుడు విడుదలకు ముందే సెన్సారింగ్ దగ్గరో, పోస్ట్ ప్రొడక్షన్ సమయంలోనో పైరసీ చీడ పట్టేస్తోంది. అటు ఇంటర్నెట్‌లో, ఇటు మార్కెట్‌లో ఆ సినిమా, సీడీలు, పెన్‌డ్రైవ్‌లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సైతం పట్టపగలు పోలీసుల కళ్ళ ముందరే కేవలం యాభై రూపాయలకు రిలీజ్ రోజునే కొత్త సినిమాలు పెన్‌డ్రైవ్‌లో హాట్ హాట్‌గా అమ్ముడవుతు న్నాయి. భారతదేశంలో కన్నా ఒక రోజు ముందరే సినిమాలు రిలీజయ్యే దుబాయ్ నుంచి సాధా రణంగా ఈ సినిమాల పైరసీ సాగుతుంటుందని ఒక అంచనాకు వచ్చారు.



  సెన్సార్ దగ్గరే సమస్య?

 విచిత్రం ఏమిటంటే, సినిమా రిలీజ్ చేయాలంటే సెన్సార్ బోర్డు దగ్గర సర్టిఫి కెట్ తీసుకోవడం తప్పనిసరి. అయితే, అందుకోసం సెన్సార్ బోర్డుకు సినిమా సబ్‌మిట్ చేస్తే, సాక్షాత్తూ ఆ సెన్సార్ కాపీ నుంచే పైరసీ జరుగుతుండడం! ఇటీవల ‘ఉడ్తా పంజాబ్‌‘, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ చిత్రాలు రెండూ రిలీజ్‌కు ముందు అలాగే పైరసీ బారినపడ్డాయని ఆ చిత్రాల దర్శక, నిర్మాతలు ఆరోపించారు. వాళ్ళ ఆరోపణలకు ఆధారం లేకపోలేదు. ‘ఫర్ సెన్సార్’ అంటూ వాటర్‌మార్క్ వేసి మరీ సెన్సారింగ్‌కు వారు సినిమా కాపీ సబ్‌మిట్ చేశారు.

 

 బయటకొచ్చిన పైరసీ ప్రింట్లు కూడా అచ్చంగా అవే వాటర్ మార్కుతో ఉన్నాయి. దాంతో, కంచెలా కాపాడాల్సిన సెన్సార్ బోర్డే కక్షతో ఇలా చేను మేసిందని ఆరోపణలొచ్చాయి. పైరసీకి ముందు సెన్సార్ బోర్డ్ కత్తిరించేయమన్న దృశ్యాల్ని కట్ చేయడానికి నిరాకరించి, ‘ఉడ్తా పంజాబ్’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ చిత్ర నిర్మాతలు ఢిల్లీలోని ‘ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్’ (ఎఫ్.సి.ఎ.టి)ని ఆశ్రయించారు. దాంతో, కక్ష కొద్దీ ముంబయ్‌లోని సెన్సార్ బోర్డు పెద్దలే ఈ ప్రీ-రిలీజ్ పైరసీకి ప్రోత్సహించారంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

 

 కానీ, కేంద్ర సెన్సార్ బోర్డు (సి.బి.ఎఫ్.సి) చైర్మన్ - ప్రముఖ దర్శక, నిర్మాత పహ్లాజ్ నిహలానీ మాత్రం తమ వ్యక్తిగత ప్రమేయం ఏమీ లేదని ఖండించారు. గమ్మత్తేమిటంటే ముంబయ్, ఢిల్లీలతో సంబంధమే లేకుండా, ఆ మాటకొస్తే ట్రిబ్యునల్‌కు వెళ్ళే పనే లేకుండా - ‘యు’ సర్టిఫికెట్‌తో, చెన్నైలోనే సెన్సారైన ‘కబాలి’ కూడా ప్రీ-రిలీజ్ పైరసీ పాలబడింది. మరి, తమ సంబంధమే లేని దీనికేమంటారని నిహలానీ ప్రశ్నించారు.

 

 పైరసీ ఇంటికి దారేది?

 తెలుగులో పెద్ద హీరో పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమా కూడా గతంలో ఇలా ప్రీ-రిలీజ్ పైరసీకి గురైందే. 2013లో ఆ సినిమా అంతా సిద్ధమైనా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ వేడిలో సరైన రిలీజ్ తేదీ కోసం ఎదురుచూడసాగింది. ఆ సమయంలో కొందరు సినీరంగ పెద్దల ప్రేరేపణతో ఇంటి దొంగలే ఆఫీసులోని హార్డ్‌డిస్క్ నుంచి సినిమాను కాపీ చేశారు. పైరసీదారులకు రిలీజ్ చేయడానికి సిద్ధంగా పెట్టుకున్నారు. కానీ, కాపీ చేసిన వ్యక్తి అత్యుత్సాహంతో దాన్ని తన ఫ్రెండ్‌కీ, ఆ ఫ్రెండ్ మరో ఫ్రెండ్‌కీ... ఇలా కాపీలు పంచుకోవడంతో, రిలీజ్ డేట్ ప్రకటించక ముందే సినిమా నెట్‌లో, సీడీల్లో వచ్చేసింది. ఆ విషయం తెలిసేసరికి, దర్శక, హీరోలు హడావిడిగా సిన్మా రిలీజ్ డేట్ ప్రకటించారు. నిర్మాత ఆర్థిక భారాన్నీ తామే మోసి మరీ సినిమా రిలీజ్‌కు సహకరించారు. పైరసీ వచ్చినా జనం హాళ్ళలో ఆ సిన్మాకు పట్టం కట్టారు. నిర్మాత, బయ్యర్లు బతికి బట్టకట్టారు.

 

 చేతులెత్తేసిన చట్టం! నిపుణులు!

 కారణం ఎవరైనా, ఈ పైరసీతో సినీరంగం వెన్ను విరుగుతోందన్నది మాత్రం నిజం. భారీ చిత్రాలు, పెద్ద హీరోల సినిమాల మాట ఎలా ఉన్నా, ఈ పైరసీ దెబ్బకు చిన్న, మధ్యశ్రేణి సినిమాలు మాత్రం రావాల్సిన వసూళ్ళు రాక, ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఏదైనా సినిమా రిలీజైతే, సర్వసాధారణంగా ఆ మరునాటి కల్లా నెట్‌లో పైరసీ ప్రింట్ వచ్చేస్తోంది. ఆ సినిమాలో నటించిన తారాగణం, సినిమా భారీతనం, రిలీజ్‌కు ముందు వచ్చిన ప్రచారాన్ని బట్టి సదరు పైరసీ ప్రింట్ డౌన్‌లోడ్‌కు గిరాకీ ఉంటుంది. సామాన్యంగా ఒక సగటు సినిమాకు రిలీజైన తొలి రెండు రోజుల్లో 30 నుంచి 50 వేల దాకా పైరసీ డౌన్‌లోడ్లు జరుగుతాయని లెక్క. ఇలా పైరసీ చేయడం, నెట్‌లో ఉంచడం కాపీరైట్ ఉల్లంఘన కిందకూ, సైబర్ చట్టాల ప్రకారం డేటా చోరీ కిందకూ వస్తుంది. చట్ట ప్రకారం ఇది శిక్షార్హమైన నేరమైనా, ప్రపంచవ్యాప్తంగా వేల వెబ్‌సైట్లకు కళ్ళెం వేయడం అసాధ్యమవుతోంది.

 

 కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించే ఇలాంటి వెబ్‌సైట్లను అందించవద్దంటూ ‘ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్’ (ఐ.ఎస్.పి)లను ఆదేశించేలా, కోర్టుల నుంచి నిర్మాతలు ‘జాన్ డో’ ఆర్డర్ (లేదా అశోక్ కుమార్ ఆర్డర్) లాంటివి తెచ్చుకున్నా అంతంత మాత్రపు ఫలితమే కనిపిస్తోంది. గత ఏడాది రిలీజైన ‘బాహుబలి’ సహా పలు సినిమాలు ఈ కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాయి. కానీ, రిలీజ్ రోజు సాయంత్రానికే హిందీ వెర్షన్ ‘బాహుబలి’ ప్రింటు ఇంటర్నెట్‌లో యథేచ్ఛగా షికారు చేసింది. తాజాగా ‘కబాలి’ని వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయడానికీ, డౌన్‌లోడ్ చేయడానికీ వీల్లేకుండా ఆ చిత్ర నిర్మాత మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం 169 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు తాఖీదులు పంపారు. అయినా, లాభం లేకపోయింది. ఒకసారి నెట్‌లో ఏదైనా అందుబాటులోకి వచ్చాక, దాన్ని పూర్తిగా తొలగించడం అసాధ్యమని నిపుణులే చేతులెత్తేశారు.

 

పరిశ్రమలో పెరుగుతున్న ఆందోళన

 ఈ పైరసీతో పరిశ్రమ ఎంతగా విసిగిపోయిం దంటే, చివరకు సల్మాన్‌ఖాన్ ‘‘పైరసీదారులు పచ్చిదొంగలు. కష్టపడి పనిచేయ కుండా, ఎవరో పడిన కష్టం మీద డబ్బులు చేసుకుంటున్నారు’’ అని దుమ్మెత్తి పోశారు. ‘‘పైరసీ చేసేవారినీ, ఆ ప్రింట్లను అమ్మేవాళ్ళనూ, కొనేవాళ్ళనూ తీవ్ర వాద, విధ్వంసక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టు చేయాలి’’ అన్నారు.

 

 ఇటీవల వరుసగా పెరుగుతున్న ఈ ప్రీ-రిలీజ్ పైరసీతో సినీ రంగం కూడా తీవ్రంగా ఆందోళనకు లోనవుతోంది. పైరసీ సమస్యపై దృష్టి సారించేందుకు హిందీ నిర్మాతలు, స్టూడియో అధినేతలు గత వారం సమావేశమయ్యారు. సెన్సారింగ్ మొదలు మన దేశంలోని డిజిటల్ ఆపరేటర్లకూ, అలాగే ప్రపంచ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లకూ సినిమా కాపీ పంపడం వరకు సినిమా రిలీజ్ ప్రక్రియలో ప్రతి దశలోనూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘వినోద పరిశ్రమను దెబ్బ తీయడమే కాక, దేశ మేధాసంపత్తి భద్రతకు పెనుముప్పు కలిగించేలా జరుగుతున్న ప్రయత్నం ఇది’’ అని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా పేర్కొంది.  

 

 అయితే, మల్టీప్లెక్సులొచ్చాక విపరీతంగా పెరిగిన టికెట్ రేట్లు, సర్కారు వేస్తున్న రకరకాల పన్నులతో కుటుంబమంతా కలసి సినిమాకు వెళ్ళాలంటే, ఖర్చు వేలల్లోకి వెళ్ళింది. అందుకే, చౌకగా పెన్‌డ్రైవ్‌లలో, నెట్‌లోని పైరసీ వైపు అందరూ ఆకర్షితులవుతున్నారని కొందరి వాదన. పైరసీ ఎవరు చేస్తున్నారు, ఎందుకు ప్రోత్సహిస్తున్నారన్నది అటుంచితే, ఈ ‘ఇంటి దొంగల’ దెబ్బతో సినీ రంగానికి ఇల్లూ, ఒళ్ళూ గుల్లవుతోంది. మరి, ఈ ఇంటి దొంగల్ని పట్టే ఈశ్వరుడెవరన్నదే ఇప్పటికీ జవాబు లేని ప్రశ్న.

  

  రిలీజ్‌కు ముందే... పైరసీ రిలీజ్

2009- ‘ఈనాడు’, ‘ఏక్ నిరంజన్’ పైరసీ సీడీలు సిన్మా రిలీజ్‌కు ముందే మార్కెట్‌లోకొచ్చేశాయి.



2010- కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో శరత్‌కుమార్ నటించిన తమిళ చిత్రం ‘జగ్గూబాయ్’ రిలీజ్‌కు కొద్ది వారాల ముందే నెట్‌లో దర్శనమిచ్చి, కలవరం పుట్టించింది. ఎడిటింగ్, రీ-రికార్డింగ్‌లు పూర్తి కాని రఫ్ కట్ రూపం వేల కొద్దీ పైరసీ సీడీలుగా తయారై, మార్కెట్‌లోకి రావడంతో నిర్మాత, నటి రాధిక కన్నీళ్ళు పెట్టారు.



2013 సెప్టెంబర్ - పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ ఇంటి దొంగల చేతి వాటంతో నెట్‌లో వచ్చేసింది.



2016 జూన్-  సెన్సార్ బోర్డ్‌తో ఢీ కొన్న హిందీ చిత్రం ‘ఉడ్తా పంజాబ్’ పైరసీ అయింది. థియేటర్‌లో రిలీజ్‌కు రెండు రోజుల ముందే సినిమా నెట్‌లోకి వచ్చేసింది. సెన్సార్‌కు సబ్‌మిట్ చేసిన ప్రింట్ నుంచే పైరసీ జరిగింది.



2016 జూన్ - వర ముళ్ళపూడి దర్శకత్వంలో ‘కుందనపు బొమ్మ’ని ఎన్నారైల కోసం ఆన్‌లైన్‌లోనూ రిలీజ్ చేశారు. మార్కెట్ విస్తరణ కోసం ఈ ప్రయత్నం చేసినా, తీరా పైరసీ ప్రింట్ నెట్‌లో ప్రత్యక్షమైంది.

 

2016 జూలై - ఎడల్ట్ కామెడీ ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ సెన్సార్ చిక్కుల్లో పడింది. బోర్డుతో పోరు సాగుతుండగానే, సెన్సార్ ప్రింట్ నుంచి పైరసీ ప్రింట్ వచ్చేసింది. అనుకున్న డేట్‌కి వారం ముందే జూలై 15న రిలీజ్ చేశారు.  6న విడుదలైన సల్మాన్‌ఖాన్ ‘సుల్తాన్’ రిలీజ్‌కు ఒక రోజు ముందే నెట్‌లోకి వచ్చింది. ‘కబాలి’కి కూడా పైరసీ తిప్పలే.

 

 నెట్‌లో... కొట్టుకుపోతున్న కోట్లు


తెలుగు సినిమాల పైరసీ వెర్షన్లను నెట్‌లో పెట్టే పేరుమోసిన సైట్లు 138 దాకా ఉన్నట్లు ఒక లెక్క.

 

♦  గడచిన ఏణ్ణర్ధ కాలంలోనే పైరసీకి గురైన తెలుగు సినిమాలు కనీసం కోటి సార్లు నెట్ నుంచి డౌన్‌లోడ్ అయ్యాయి.

 

♦  ఈ 18 నెలల కాలంలో కొత్త సినిమాల పైరసీ వల్ల ఒక్క తెలుగు సినీ రంగమే దాదాపు రూ. 1064 కోట్ల మేర నష్టపోయిందని నిపుణుల అంచనా.

 

♦  దేశవ్యాప్తంగా చూస్తే, మొత్తం భారతీయ వినోద పరిశ్రమ రమారమి 2500 కోట్ల డాలర్లు నష్టపోయి ఉంటుందని ఉజ్జాయింపు లెక్క.

 

 - రెంటాల జయదేవ

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top