బాహు బాహుబలి

బాహు బాహుబలి - Sakshi


కొత్త సినిమా గురూ!

బాహుబలి –2




నటీనటులు: అమరేంద్ర బాహుబలి/ మహేంద్ర బాహుబలి (శివుడు) : ప్రభాస్,

దేవసేన: అనుష్క, శివగామి: రమ్యకృష్ణ, భల్లాలదేవ: రానా, బిజ్జలదేవ: నాజర్, కట్టప్ప: సత్యరాజ్,

అవంతిక: తమన్నా తదితరులు

కెమేరా: సెంథిల్‌కుమార్‌

మాటలు: అజయ్, విజయ్‌

సంగీతం: ఎమ్‌.ఎమ్‌. కీరవాణి

నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని

దర్శకత్వం: ఎస్‌.ఎస్‌. రాజమౌళి



కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?ఇది కదా క్వశ్చన్‌! బాహుబలి పార్ట్‌1 టీజర్‌. అవును.. ఎందుకు చంపాడు అని తెలుసుకోడానికే కదా ఆడియన్స్‌ అంతా ‘బాహుబలి 2’కి వెళ్లింది. కాని రాజమౌళి మ్యాజిక్‌తో ఆ సంగతే మర్చిపోయారు! స్క్రీన్‌ప్లే బహు బాగుంది. నటనా కౌశలం బహుబహు బాగుంది. చివరికి సినిమా... ‘బహు బాహుబలి’ అనిపించుకుంది.



కథ: తమ్ముడు ప్రభాస్‌ హ్యాపీ. ‘నువ్వే కింగ్‌’ అని పెద్దమ్మ రమ్యకృష్ణ మాహిష్మతిని అతడికి రాసిచ్చేసిందిగా మరి! పెద్దమ్మ గైడెన్స్‌ అండ్‌ పర్మిషన్‌తో... ఈ హ్యాపీనెస్‌లో ఎంచక్కా కంట్రీ టూర్‌ వేశాడు ప్రభాస్‌. ఈ టూర్‌ అతడి అన్న రానాకు నచ్చలేదు. ఎందుకు నచ్చుతుంది? బ్లడీ ఫెలో కాలకేయుణ్ణి రానా చంపితే... అమ్మ రమ్యకృష్ణ తమ్ముడు ప్రభాస్‌ను  కింగ్‌ను చేయాలనుకుంది. దాంతో పిచ్చ కోపంగా ఉన్నాడు. కానీ, అమ్మను ఎదిరించలేడు. ఎదిరిస్తే... ఏం జరుగుతుందో తెలుసు! కట్టప్పకు చెప్పి చంపించేసినా చంపించేస్తుంది. కన్నకొడుకు కంటే... కంట్రీలో ప్రజల క్షేమమే రమ్యకృష్ణకు ఇంపార్టెంట్‌. ఛాన్స్‌ చూసి తమ్ముణ్ణి చావు దెబ్బ కొట్టాలనేది రానా ప్లాన్‌. సరిగ్గా ఆ టైమ్‌లోనే కంట్రీ టూర్‌కి వెళ్లిన తమ్ముడు ప్రభాస్‌ ఫారిన్‌ కంట్రీ కుంతల ప్రిన్సెస్‌ అనుష్కతో ప్రేమలో పడ్డాడని రానాకు టెలిగ్రామ్‌ వస్తుంది. తమ్ముడు లవ్‌ మేటర్‌ను అమ్మ దగ్గర లీక్‌ చేశాడనుకుంటున్నారా? లేదు.



అనుష్కను నేను లవ్‌ చేస్తున్నానని చెబుతాడు. ఆల్రెడీ అక్కడ కుంతలలో అనుష్కను లవ్‌లో దింపడానికి ప్రభాస్‌ ఫుల్లుగా ట్రై చేస్తుంటాడు. కాబోయే కింగ్‌ అని కాకుండా... కామన్‌మేన్‌గా కుంతలలో అడుగు పెడతాడు. ఈ న్యూస్‌ రమ్యకృష్ణకు తెలీదు. దాంతో కన్న కొడుకు రానా చెప్పిన లవ్‌ కహానీ వినేసి, నమ్మేసి... ‘అనుష్క నీదే’ అని కుంతలకు పెళ్లి కార్డు, నగలు, గట్రా పంపిస్తుంది. మఫ్టీలో కుంతలలోనే ఉన్న ప్రభాస్‌... పెద్దమ్మకు తన లవ్‌ మేటర్‌ తెలిసిందేమోనని హ్యాపీ ఫీలవుతాడు. కట్‌ చేస్తే... ‘తూచ్‌! నా ఇష్టం లేకుండా నా పెళ్లి డిసైడ్‌ చేయడానికి నువ్వెవరు?’ అనే రేంజ్‌లో వాటన్నిటినీ రివర్స్‌లో వెనక్కి పంపిస్తుంది అనుష్క. దాంతో రమ్యకృష్ణ ఈగో హర్ట్‌ అవుతుంది. ఇమ్మీడియట్‌గా అనుష్కను అరెస్ట్‌ చేసి తీసుకురమ్మని ప్రభాస్‌కు మేటర్‌ పోస్ట్‌ చేస్తుంది. అది అందుకునే టైమ్‌కి ప్రభాస్‌ లవర్‌ అనుష్క పక్కనే ఉంటాడు. ఓ పక్క పెద్దమ్మ మాటను కాదనలేడు. మరోపక్క లవర్‌ను అరెస్ట్‌ చేయలేడు. ‘మై హూనా’ అని అనుష్కకు అభయహస్తం ఇచ్చి... మాహిష్మతికి తీసుకు వెళ్తాడు.



అక్కడేమో... రానాను పెళ్లి చేసుకోమని అనుష్కకు రాజమాత రమ్యకృష్ణ హుకూం జారీ చేస్తుంది. ‘నో.. నో! నేను ప్రభాస్‌నే పెళ్లి చేసుకుంటా. అతణ్ణి లవ్‌ చేశా’ అని అనుష్క కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది. రాజ్యమా? లవ్వరా తేల్చుకోమని ప్రభాస్‌ ముందు రమ్యకృష్ణ పజిల్‌ పెడుతుంది. లవ్వరే ముఖ్యం అని, అనుష్కను పెళ్లాడతాడు. దాంతో రమ్యకృష్ణకు కోపం వస్తుంది. రిజల్ట్‌... ప్రభాస్‌కి సేనాధిపతిగా డిమోషన్, రానాకు కింగ్‌గా ప్రమోషన్‌. రానా దీన్ని ఫస్ట్‌ సక్సెస్‌గా ఫీలవుతాడు. అయినా ప్రభాస్‌ హ్యాపీనే! ఎందుకంటే... చిన్నప్పుడు పెద్దమ్మ చెప్పిన ధర్మానికి, న్యాయానికి కట్టుబడి ఉన్నానని. రానా మాత్రం హ్యాపీగా లేడు. తనకంటే తమ్ముడికే ప్రజల్లో ఎక్కువ పాపులారిటీ ఉండడం చూసి సహించలేడు. దాంతో ఓ ప్లాన్‌ ప్రకారం రాజమహల్‌ నుంచి పంపించేస్తాడు. సింహం ఎక్కడున్నా సింహమే అన్నట్టు... రాజమహల్‌ నుంచి వెలి వేయబడ్డ ప్రభాస్‌ను ప్రజలు ఫుల్‌ రెస్పెక్ట్‌తో చూసుకుంటారు.



ఇప్పుడు రానాలో అసహనం, కోపం, బాధ మరింత పెరుగుతాయి. అమ్మకు ప్రభాస్‌పై లేనిపోని మాటలు చెబుతాడు. కొడుక్కి నాజర్‌ ఫుల్‌ సపోర్ట్‌. ఏదో ఒకటి చేసి ప్రభాస్‌ను పైలోకాలకు పంపించాలనేది రానా, నాజర్‌ల ప్లాన్‌. అదీ తమ చేతికి మట్టి అంటకుండా రమ్యకృష్ణ ఆర్డర్స్‌తో చంపించాలనుకుంటారు. వీళ్ల ప్లాన్‌ వర్కౌట్‌ అవుతుంది. మాహిష్మతికి కట్టుబానిస కట్టప్పకు ప్రభాస్‌ను చంపమని రమ్యకృష్ణ ఆర్డర్స్‌ ఇష్యూ చేస్తుంది. కట్టప్ప బాహుబలిని చంపేస్తాడు. అప్పుడు రానా హ్యాపీ. కానీ, రమ్యకృష్ణ అన్‌హ్యాపీ. కన్నకొడుకు ప్లాన్‌ వల్లే పెంపుడు కొడుకు ప్రభాస్‌ను పోగొట్టుకున్నానని ఫీలవుతుంది. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ప్రభాస్‌ కొడుకు, అప్పుడే పుట్టిన బుల్లి ప్రభాస్‌ (మహేంద్ర బాహుబలి)ని రాజుగా ప్రకటిస్తుంది. కానీ, ఏం లాభం? పరిస్థితులన్నీ రమ్యకృష్ణ చేయి దాటేస్తాయి. పుట్టిన బిడ్డను రానా చంపించాలనుకుంటాడు. రమ్యకృష్ణ బిడ్డతో ఊరు దాటుతుంది. పాతికేళ్ల క్రితం జరిగిన ఈ కథ విన్న బుల్లి ప్రభాస్‌ పెదనాన్న రానాపై ఎలా పగ తీర్చుకున్నాడు? అసలు, ప్రభాస్‌ను చంపమని రమ్యకృష్ణ ఆర్డర్‌ ఇచ్చేంతలా రానా, నాజర్‌లు ఆమెకు ఏం చెప్పారు? అనేది మిగతా సినిమా!!





విశ్లేషణ: రూ.100 సినిమా టికెట్‌ను వందలు, వేలు పోసి కొనుక్కుంటున్న ప్రేక్షకులకు, ఇంచు మించు ఏడాదిన్నరగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న జనాలకు ఈ కథంతా ఎందుకు? ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ – ఈ క్వశ్చన్‌కు ఆన్సర్‌ దొరికితే చాలు! ఆన్సర్‌ చాలా సింపుల్‌... రమ్యకృష్ణ చెప్పడంతో కట్టప్ప అలియాస్‌ సత్యరాజ్‌.. బాహుబలిని చంపేశాడంతే. కానీ, రాజమౌళి స్క్రీన్‌పై అంత సింపుల్‌గా చూపించలేదు. బాహుబలిని కట్టప్ప చంపే సీన్‌ వచ్చేసరికి... భారీ ఎమోషన్‌ బిల్డప్‌ చేశాడు. కట్టప్ప బాహుబలిని చంపేయడం గ్యారెంటీ. కానీ, ఎలా చంపుతాడు? అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో రేకెత్తించాడు. అసలు స్క్రీన్‌ మీద సినిమా స్టారై్టన కాసేపటికి ఆ క్వశ్చన్‌ ఎవరికీ గుర్తుండదు. అందంగా ఏనుగు విల్లును ఎక్కుపెడితే, దానిపై ఎక్కిన బాహుబలి మాంచి స్టైల్‌గా బాణం సంధిస్తాడు. ప్రభాస్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ ఇది. వారెవ్వా... అనే రేంజ్‌లో ఉన్న ఈ సీన్‌ చూసిన తర్వాత కట్టప్ప క్వశ్చన్‌ ఏం గుర్తుంటుంది? ఆ తర్వాత వచ్చే ‘సాహోరే బాహుబలి..’ సాంగ్, అనుష్కతో కామెడీ టచ్‌ ఇచ్చిన లవ్‌ ట్రాక్, వార్‌ ఎపిసోడ్, ‘హంసనావ..’ సాంగ్‌లో విజువల్స్‌... ప్రతిదీ ఫెంటాస్టిక్‌. ఈలోపు సినిమా ప్రీ–ఇంటర్వెల్‌కు చేరుకుంటుంది.



అప్పుడు ‘నువ్వు తప్పు చేశావ్‌ అమ్మా. ఆడదాని మనసు తెలుసుకోకుండా మరొకరికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావ్‌’ అని రమ్యకృష్ణకు ప్రభాస్‌ ఎదురుతిరిగే సీన్‌ చూస్తున్నప్పుడు... ఇదేంటి? సినిమా ఇలా టర్న్‌ అవుతుందని ప్రతి ప్రేక్షకుడూ ఫీలయ్యేలా రాజమౌళి తెరపై పాత్రల మధ్య సంఘర్షణను చూపించాడు. రానాను రాజును చేసి, ప్రభాస్‌ను సేనాధిపతి చేసిన సీన్‌ ఫ్లాట్‌గా వెళ్తుందేంటి? అనుకునేలోపు... ఇంటర్వెల్‌లో మాంచి కిక్‌ ఇచ్చాడు రాజమౌళి. సేనాధిపతిగా ప్రభాస్‌ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ‘బాహుబలి... జయహో బాహుబలి’ అని మాహిష్మతి ప్రజలంతా హర్షధ్వానాలు చేస్తుంటే రోమాలు నిక్కబొడుచుకోవడం గ్యారెంటీ. అక్కడ ఇంటర్వెల్‌. సెకండాఫ్‌ స్టారై్టన తర్వాత ఇంకో సీన్‌ ఉంటుంది అసలు... హీరోయిజమ్‌కు పీక్స్‌. అప్పటికే ప్రభాస్‌ను సేనాధిపతి పోస్ట్‌ నుంచి రానా అండ్‌ కో పక్కకు తప్పిస్తారు. చేయని తప్పుకు అనుష్కను దోషిగా చిత్రీకరించి రాజదర్బార్‌లో నిలబెడతారు. వాదోపవాదనలు జరుగుతున్న టైమ్‌లో ప్రభాస్‌ రాజదర్బార్‌లోకి ఎంట్రీ ఇస్తాడు.



నడక, నడత, రాజసం, కోపం... అన్నీ చూపిస్తాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత ‘ఆడదాని మీద చెయ్యేస్తే తెగాల్సింది వేళ్లు కాదు, తల’ అంటూ నరికే సీన్‌ సినిమాకే హైలైట్‌. ఆడియన్స్‌ క్లాప్స్‌ కొట్టే సీన్‌ అది. తర్వాత సీన్‌ బై సీన్‌... బాహుబలిని చంపడానికి రానా, నాజర్‌లు వేసే ఎత్తులు కట్టప్ప చేత ఎలా చంపిస్తారు? కట్టప్ప ఎలా చంపుతాడు? అనే ఆసక్తి రేకెత్తిస్తాయి తప్ప, ఎందుకు చంపుతున్నాడు? అనే ప్రశ్నను ప్రేక్షకుల మనస్సుల్లో ఏ మూలనా రానీయదు. ఈ సీన్‌ పూర్తిగా చెప్పేస్తే థియేటర్లలో సినిమా చూడబోయే ప్రేక్షకులు థ్రిల్‌ మిస్‌ అవుతారు. ఈ సీన్‌ తర్వాత తండ్రిని చంపినోళ్లపై శివుడు పగ తీర్చుకుంటే చూడాలని ప్రేక్షకులు ఆశపడతారు. బాహుబలి మరణంతో ఫ్లాష్‌బ్యాక్‌ ముగిస్తే, భల్లాలదేవను శివుడు  చంపే యుద్ధంతో సినిమా ముగుస్తుంది. యుద్ధం ప్రారంభానికి ముందు ప్రభాస్, రానాల్లో ఒకరినొకరు చంపేయాలనే కసిని రాజమౌళి మలిచిన తీరు సూపర్బ్‌. క్లైమాక్స్‌ హాలీవుడ్‌ సినిమాలను తలపిస్తుంది.



నటీనటులందరూ అద్భుతంగా నటించారు. రాజమౌళి ఊహలను విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌ కమల్‌ కణ్ణన్‌ అద్భుతంగా ఆవిష్కరించారు. కీరవాణి పాటల్లో ‘సాహోరే బాహుబలి..’, ‘హంసనావ..’, ‘హైసా రుద్రస్సా..’ బాగున్నాయి. రీ–రికార్డింగ్‌ అద్భుతం. రాజమౌళి ఊహపై నమ్మకంతో వందల కోట్లను ఖర్చుపెట్టిన నిర్మాతలను తప్పకుండా అభినందించాలి. టేకింగ్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ హాలీవుడ్‌ స్థాయిలో ఉన్నప్పటికీ... మన ప్రేక్షకులకు కావాల్సిన భావోద్వేగాలను రాజమౌళి మిస్‌ కాలేదు. ఇప్పటివరకూ భారతీయ వెండితెరపై ఎవరూ ఆవిష్కరించని ఓ అద్భుత దృశ్యకావ్యం ‘బాహుబలి’!!



రీక్యాప్‌ : ‘బాహుబలి : ది బిగినింగ్‌’ కథ

అవిటివాడు కావడంతో నాజర్‌కు మాహిష్మతికి మహారాజు అయ్యే ఛాన్స్‌ రాదు. అందువల్ల, తమ్ముడు పగ్గాలు చేపడతాడు. దురదృష్టవశాత్తూ నాజర్‌ తమ్ముడు ఓ యుద్ధంలో మరణిస్తాడు. అప్పటికి అతని భార్య గర్భిణి. ఆమె ఓ అబ్బాయికి జన్మనిస్తుంది. అతడే మన హీరో ప్రభాస్‌. అప్పటికే నాజర్, రమ్యకృష్ణ దంపతులకు ఓ అబ్బాయి ఉంటాడు. మహారాజు మరణంతో ఎదురుతిరిగిన సామంతులకు రమ్యకృష్ణ మృత్యుఒడి చూపిస్తుంది. ఆ టైమ్‌లో నాకు దక్కని రాజ్యాధికారం కనీసం నా కొడుక్కి అయినా దక్కుతుందని నాజర్‌ ఆశపడతాడు. రానాను కాబోయే కింగ్‌గా ప్రకటించమంటాడు. కానీ, రమ్యకృష్ణ ఒప్పుకోదు. పెద్దయిన తర్వాత రానా, ప్రభాస్‌లలో ఎవరికి యోగ్యత ఉంటే వాళ్లకి కింగ్‌డమ్‌ రాసిస్తానని చెబుతుంది. వీళ్లిద్దరూ పెద్దయ్యే టైమ్‌కు కాలకేయులు మాహిష్మతిపైకి యుద్ధానికి దిగుతారు. కాలకేయుల కింగ్‌ను ఎవరు చంపితే అతణ్ణి మాహిష్మతికి రాజును చేస్తానని రమ్యకృష్ణ పిల్లలిద్దరికీ టెస్ట్‌ పెడుతుంది.



ఈ టెస్టులో రానా పాసవుతాడు. కానీ, కాలకేయుణ్ణి చంపే క్రమంలో రానా రూల్స్‌ పాటించలేదని ప్రభాస్‌ను రాజుగా ప్రకటిస్తుంది – ఇదీ మెయిన్‌ కథ. అందులో ఇంకో కథ గూడెంలో పెరిగే శివుడిది. అతను పెద్ద ప్రభాస్‌ కొడుకు. మరి గూడెంలో ఎందుకు పెరిగాడు? అతడి తల్లి అనుష్కను మాహిష్మతిలో రానా ఎందుకు సంకెళ్లతో కట్టిపడేశాడు? ఆమెను విముక్తురాలను చేయాలని ప్రయత్నిస్తున్న తమన్నా (అవంతిక) అండ్‌ గ్యాంగ్‌ ఎవరు? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఎన్నో ప్రశ్నలు. వాటన్నిటికీ పార్ట్‌ 2లో సమాధానాలు దొరికాయి.



సాహో రాజమౌళి : క్రిష్‌

సినిమా పూర్తయ్యాక చప్పట్లు కొట్టాను. తెర మీద రాజమౌళి స్టాంప్‌ కనిపించగానే ఈల వేశాను. ‘న్యూ కైండ్‌ ఆఫ్‌ మూవీ’. విజయేంద్రప్రసాద్‌గారు అద్భుతమైన పాత్రలు రాశారు. రాజమౌళిగారు అంతే అద్భుతంగా తీశారు. ప్రభాస్, రానా, అనుష్క.. ఇలా అందరి నటన వంక పెట్టడానికి వీలు లేని విధంగా ఉంది. ∙ఎమోషనల్‌గా ఈ సినిమా ఎపిక్‌ లెవల్‌లో ఉంది. మొదటి నుంచి చివరి వరకూ ఎంతో గ్రిప్పింగ్‌గా తీశారు. అద్భుతమైన మాహిష్మతి ప్రపంచంలోకి తీసుకెళ్లినందుకు సాహో రాజమౌళిగారు.



సినిమా మొదట్లో తల్లి శివగామి (రమ్యకృష్ణ) అడుగు తప్పకూడదని అమరేంద్ర బాహుబలి రథాన్ని ముందుకు తీసుకు వస్తాడు. అది ప్రభాస్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌. అలాగే, సినిమా చివర్లో తల్లి దేవసేన (అనుష్క) అడుగు తప్పకూడదని మహేంద్ర బాహుబలి తపన పడతాడు. ఆరంభంలో ఎంత ఎమోషనల్‌గా ఉందో చివర్లోనూ అంతే ఎమోషనల్‌గా ఈ సీన్స్‌ ఉన్నాయి. నాకు చాలా చాలా నచ్చాయి. ∙నిర్మాతలు శోభు, ప్రసాద్‌గార్లను అభినందించాల్సిందే. ఇండియన్‌ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లే సినిమా నిర్మించారు. వీళ్లకెవరూ సాటి రారు.



నాకా అర్హత ఉందా అనిపించింది : సుకుమార్‌

నేను కూడా సినిమా గురించి అందరిలాగానే ఎదురు చూశాను. బాహుబలి ఎలా ఉండబోతుందో అనే ఆలోచనలతో థియేటర్‌లోకి ఎంటర్‌ అయ్యాను. ఎంటర్‌ అయ్యేటప్పుడు డైరెక్టర్‌ లాగా వెళ్లాను. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ లాగా వచ్చాను. బయటకు వచ్చినప్పుడు ప్రేక్షకులు ఆటోగ్రాఫ్‌లు, ఫోటోగ్రాఫ్‌లు అడుగుతుంటే ఇవ్వాలా? వద్దా అని ఆలోచించాను. ఎందుకంటే... అవి ఇచ్చే అర్హత ఉందా లేదా అని. అంతే కానీ పొగరుతో కాదు. ఇంతకంటే ఏమని చెప్పను సినిమా గురించి. బాహుబలి స్పెక్టాక్యులర్‌ మూవీ.



 బ్లాక్‌ టికెట్‌ @1500

‘బాహుబలి–2’ని చూడాలనే ప్రేక్షకుల ఆసక్తిని క్యాష్‌ చేసుకునే దిశలో ‘బ్లాక్‌ టికెట్స్‌’ అమ్మకం జోరుగా సాగింది. డిమాండ్‌ను, ప్రాంతాన్ని బట్టి ఒక్కో టికెట్‌ను సుమారు రూ. 1000 నుండి రూ.1500 రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు పలువురు ప్రేక్షకులు ఆరోపించారు.  టికెట్లకు డిమాండ్‌ అధికం కావడంతో థియేటర్‌ల మేనేజర్లు ఒత్తిడిని తట్టుకోలేక ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయడం విశేషం. పలు థియేటర్లలో మార్నింగ్‌ షోలకు విద్యుత్‌ అంతరాయం కలగడంతో.. వెంటనే జనరేటర్‌ స్టార్ట్‌ చేసి సినిమాను నడిపించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.



బాహుబలి ఆభరణాల ప్రదర్శన

‘బాహుబలి’ చిత్రానికి అధికారిక జ్యూయలరి డిజైనర్, సరఫరాదారుగా వ్యవహరించిన హైదరాబాద్‌లోని అమ్రపాలి జ్యూయలరి షో రూమ్‌లో చిత్రానికి వాడిన పలు ఆభరణాలను  శుక్రవారం ప్రదర్శించారు. రాజస్థాన్‌కు చెందిన కళాకారులు దాదాపు ఏడాదిన్నర కాలం డిజైన్లు రూపొందించి తయారు చేసినట్లు నిర్వాహుకులు తెలిపారు. వివిధ సైజులు, డిజైన్లతో దాదాపు 1500 రకాలు రూపొందించగా అందులో 150 కిలోల బరువున్న 1000 డిజైన్లను సినిమాలో వాడినట్లు పేర్కొన్నారు. రూ. 600 నుంచి రూ. 58 వేల వరకు విలువ చేసే ఆభరణాలు తయారు చేసినట్లు తెలిపారు.



పిల్లలకు బర్త్‌డే గిఫ్ట్‌... ‘బాహుబలి’

‘బాహుబలి 2’ విడుదల కోసం సామాన్య సినీ ప్రేక్షకులే కాదు.. సినిమాతో పాటు ఇతర రంగాల ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. శుక్రవారం ఆ తరుణం రానే వచ్చింది. ‘బాహుబలి 2’ విడుదలైంది. థియేటర్లలో ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేవు. హంగామా చేశారు. పలువురు సినిమా సెలబ్రిటీలు కూడా ఆ చిత్రాన్ని చూసి తమ ఆనందాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కాగా, శుక్రవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని హీరోయిన్‌ సమంత పలువురు పిల్లలతో కలిసి ‘బాహుబలి 2’ వీక్షించి, తన ప్రేమను చాటుకున్నారు. తమ అభిమాన కథానాయికతో కలిసి సినిమా చూసిన పిల్లలు ఆనంద డోలికల్లో మునిగి తేలారు.



తమిళనాడులో మార్నింగ్‌ షోలు లేవు

‘బాహుబలి–2’ని ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూడాలని తమిళనాడులో ముందే టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. అన్ని థియేటర్ల ముందు  ‘మార్నింగ్‌ షో’ రద్దు అనే బోర్డ్‌ చూసి, కొందరు ఆందోళనకు దిగారు. కొన్ని థియేటర్లలో లాఠీ చార్జ్‌ కూడా జరిగింది. ‘ఆన్‌ లైన్‌’లో టిక్కెట్స్‌ బుక్‌ చేసుకున్నవాళ్లు షో రద్దయిన సమాచారాన్ని మెసేజ్‌ ద్వారా తెలియజేస్తే బాగుండేదని పేర్కొన్నారు. నిర్మాతలు, పంపిణీదారుల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో ఏర్పడిన వివాదం షోల రద్దుకు కారణం అయింది. చివరికి తమిళ పరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించడంతో మధ్నాహ్నం నుంచి షోలు మొదలయ్యాయి.



సెకండాఫ్‌ ముందు!

బెంగళూరులోని పీవీఆర్‌ ఎరేనా మాల్‌లో ‘బాహుబలి–2’ సినిమా చూసినవాళ్లు డబుల్‌ ధమాకా దక్కించుకున్నారు. సినిమా సెకండాఫ్‌ని రెండు సార్లు చూసే ఛాన్స్‌ కొట్టేశారు. అదేంటీ అనుకుంటున్నారా? థియేటర్‌ నిర్వాహకులు పొరపాటున ముందే సెకండాఫ్‌ని ప్రదర్శించారు. సినిమా క్లైమాక్స్‌కి చేరుకుంటున్న సమయంలో తాము రెండో సగం చూస్తున్నామని ఆడియన్స్‌ గ్రహించారు. అంతే.. మొదట్నుంచీ సినిమా ప్రదర్శించమని డిమాండ్‌ చేశారు. చేసిన పొరపాటు దిద్దుకోవాలి కదా. థియేటర్‌ నిర్వాహకులు మళ్లీ సినిమాని ప్రదర్శించారు. ఆ రకంగా సినిమా ద్వితీయార్ధాన్ని ప్రేక్షకులు రెండుసార్లు చూడగలిగారు.



కూకట్‌పల్లిలో ‘బాహుబలి’ బృందం సందడి

హైదరాబాద్‌ కూకట్‌పల్లి వాసులకు ఓ స్వీట్‌ షాక్‌. ‘బాహుబలి’ సినిమా చూడ్డానికి శ్రీ భ్రమరాంబ థియేటర్‌కు వెళ్లినవాళ్లకు ‘బాహుబలి’ చిత్రబృందాన్ని చూసే ఛాన్స్‌ దక్కింది. దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమ, హీరోయిన్‌ అనుష్క, కీరవాణి దంపతులు తదితరులు థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. ప్రేక్షకులు చిత్రబృందాన్ని చూసి ఆనందానికి గురయ్యారు. కొందరు రాజమౌళి వద్దకు వెళ్లి  కరచాలనం చేశారు. మరికొందరు సెల్ఫీల కోసం పోటీలు పడడంతో థియేటర్‌వద్ద సందడి నెలకొంది.



దేశవ్యాప్తంగా 70 కోట్లు!

భారీ అంచనాల నడుమ విడుదలైన ‘భాహుబలి–2’ వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలుపుకుని శుక్రవారం 70 కోట్లు వసూళ్లు వస్తాయని ట్రేడ్‌ పండితులు అంచనా వేశారు. వారాంతానికి 230 నుంచి 240 కోట్ల రూపాయలు వసూలు చేయడం ఖాయమని ఎగ్జిబిటర్‌ అక్షయ్‌ రతి అంటున్నారు. హిందీ అనువాదం మొదటి రోజున 40 కోట్లు వసూలు సాధిస్తుందని, వారాంతానికి 100 కోట్లు దక్కించుకుంటుందని ట్రేడ్‌ విశ్లేషకుడు కోమల్‌ నహతా అంటున్నారు.



మొదటి రోజు కలక్షన్ల పరంగా ‘బాహుబలి–2’ రికార్డ్‌ బ్రేక్‌ చేస్తుందని కూడా ఆయన అన్నారు. ఇండియన్‌ సినిమాల్లో ‘బాహుబలి’ బిగ్గెస్ట్‌ హిట్‌ కావడం ఖాయం అని కూడా పేర్కొన్నారు. అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలు పీకే, దంగల్, సుల్తాన్‌ల రికార్డులను ‘బాహుబలి’ బద్దలు కొట్టడం ఖాయం అని కోమల్‌ నహతా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా మొదటి రోజు 70 కోట్లు వసూళ్లు సాధిస్తే.. ఓవర్సీస్‌తో కలుపుకుని 120 కోట్లు సాధించిందన్నది బాక్సాఫీస్‌ వర్గాల సమాచారం.



ప్రభాస్‌ పెళ్లి ప్రస్తుతానికి సస్పెన్స్‌

నటుడు కృష్ణంరాజు ఆయన సతీమణి శ్యామల ‘బాహుబలి–2’ని వీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘మా అబ్బాయి ప్రభాస్‌ సాధించిన దానికంటే  రాజమౌళి ఘనత గొప్పది. కెప్టన్‌ ఈజ్‌ ఆల్‌వేస్‌ కెప్టెన్‌. కథను ఉపయోగించుకోవడం కానీ , టెక్నిషియన్లను ఉపయోగించుకోవడం గానీ, సినిమాను గొప్ప లెవల్‌కు తీసుకెళ్ళడం డైరెక్టర్‌ గొప్పదనం. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి మరికొన్నేళ్ళు పడుతుందుకున్నా కానీ ‘బాహుబలి’తో ఇప్పుడే అది సాధ్యమైంది. మేం వంద సినిమాలు చేస్తే ఎన్ని గుర్తు ఉంటాయి? నేను 200ల సినిమాలు చేశా. వాటిలో భక్తకన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం.. అలా కొన్ని గుర్తు ఉన్నాయి. సరిగ్గా 20 కూడా గుర్తుకు రావు.



ప్రభాస్‌ ఇంకో 40 సినిమాలు చేసినా ఇలాంటి సినిమా వస్తుందని చెప్పలేం. ఒకటో, రెండో ఉంటాయేమో. అందుచేత ఎన్ని సినిమాలు చేశాం అని కాదు. ఎన్ని గొప్ప సినిమాలు చేశాం అనేదే ముఖ్యం. నాకు రాఘవేంద్రరావుగారు ఎలానో ప్రభాస్‌కు రాజమౌళి అలా. రాజమౌళి మౌల్డ్‌ చేసిన పద్ధతి కానీ, ఫెర్మార్మెన్స్‌ రాబట్టుకున్న తీరుగానీ గొప్పవి. ప్రభాస్‌ ఇప్పుడు ఇంటర్‌నేషనల్‌ ఆర్టిస్టు అయ్యాడు’’ అన్నారు. ఇంతకీ ప్రభాస్‌ పెళ్లెప్పుడు? అనడిగితే – ‘‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్నది ఇన్నాళ్లూ ఎలా సస్పెన్స్‌లా ఉండేదో.. ఇప్పుడు ప్రభాస్‌ పెళ్లి కూడా అంతే. ప్రస్తుతం మేం ‘బాహుబలి–2’ విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాం’’ అని శ్యామల సరదాగా అన్నారు.



 ‘దంగల్‌’ను మించిన బాహుబలి

సెకనుకు 12 టికెట్ల చొప్పున 3.3 (30 లక్షల 30 వేలు) మిలియన్లకు పైగా టిక్కెట్లు ‘బాహుబలి–2’  ప్రీ బుకింగ్‌ కోసం అమ్ముడుపోయాయని బుక్‌ మై షో నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్ట్‌ 1తో పోలిస్తే ఇది 350 శాతం అధికమని వెల్లడించారు. బాహుబలి టిక్కెట్ల బుకింగ్‌ కొరకు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్‌ వచ్చిందని, ముఖ్యంగా సౌత్‌ నుంచి సైట్‌కు ఎక్కువ హిట్స్‌ వచ్చాయని తెలిపారు. సినిమా విడుదలకు రెండు రోజులు సమయం ఉన్నప్పటికీ ఈ ప్రీ బుకింగ్స్‌ బాగా జరిగాయి. ఈ రికార్డు ఇంతకు ముందు ఆమిర్‌ ఖాన్‌ ‘దంగల్‌’ దక్కించుకుందని, తాజాగా ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ ఆ రికార్డుని అధిగమించిందని  వెబ్‌సైట్‌ నిర్వాహకులు పేర్కొన్నారు.



మన తరంలో ఉన్న ఉత్తమ దర్శకుల్లో రాజమౌళిగారు ఒకరు. ఆయన తీసిన అద్భుత చిత్రం ‘బాహుబలి’. ఇటువంటి జినీయస్‌ డైరెక్టర్‌కి నా వంతు సహకారం అందించడం ఆనందంగా ఉంది.

– దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌



‘బాహుబలి–2’ భారతీయ సినిమా ఫైనెస్ట్‌ కాన్వాస్‌. ఒక్క తెలుగు సినిమానే కాదు.. రాజమౌళి మొత్తం భారతీయ సినిమాని వేరే లెవల్‌కి తీసుకెళ్లారు. రాజమౌళి విజన్‌ని తమ అద్భుత నటనతో సపోర్ట్‌ చేసినందుకు ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణలకు అభినందనలు. రాజమౌళి విజన్‌కి జీవం పోయడానికి ఈ చిత్రాన్ని నిర్మించిన శోభు, ప్రసాద్‌లకు, నటించిన ఇతర నటీనటులు, పని చేసిన సాంకేతిక నిపుణులకు అభినందనలు.

– హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌



నువ్వు మా పక్కన ఉన్నంత వరకు తెలుగు సినిమా గురించి మాట్లాడే మగాడు ఇంకా పుట్టలేదు రాజమౌళి మామ. తెలుగు వారందరూ గర్వపడేలా సినిమా తీశారు. సినిమా పండగలా ఉంది.

– హీరో నాని



శుక్రవారం ఉదయం ‘బాహుబలి 2’ చిత్రం చూశా. రాజమౌళిగారికి దండాలు. ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్‌ని, ప్రతి ఒక్కర్నీ ఆయన ప్రేమించారు.

– మంచు మనోజ్‌



బాహుబలిలో సమ్‌థింగ్‌ స్పెషల్‌ ఏదో ఉంది. కొన్ని సినిమాలను చూసినప్పుడు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అనిపిస్తుంటుంది. అలాంటి వాటికి ఉదాహరణే ‘బాహుబలి’.

– హీరో రామ్‌



బాహుబలి ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను. మొత్తం టీమ్‌కి సెల్యూట్‌. ప్రభాస్‌ నటన నచ్చింది. ఈ సినిమా ఓ మాస్టర్‌ పీస్‌ లాంటిది.

– హీరో ధనుష్‌



‘బాహుబలి–2’ గురించి మంచి రిపోర్ట్స్‌ అందుతున్నాయి. ప్రస్తుతం హాలిడే ట్రిప్‌లో ఉన్నాను. ఈ ట్రిప్‌కి ముగింపు పలికి ‘బాహుబలి’ చూడాలనుకుంటేన్నాను. ‘డార్లింగ్‌’ ప్రభాస్, రాజమౌళిగారు తదితర బృందానికి శుభాకాంక్షలు.

– దర్శకుడు కొరటాల శివ



భారతదేశం గర్వించదగ్గ చిత్రాన్ని మాకు బహుమతిగా ఇచ్చినందుకు రాజమౌళిసార్‌కి, ఆయన సైన్యానికి అభినందనలు. ప్రభాస్, రానాతో పాటు నటీనటులు, టెక్నీషియన్స్‌ ఐదేళ్లు అంకితభావంతో చేసిన కృషికి నిదర్శనమే ‘బాహుబలి’.  ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి సినిమాకి గౌరవం ఇవ్వండి. ఇప్పుడిక భారతీయ సినిమా ‘బాహుబలి’కి ముందు ‘బాహుబలి’కి తర్వాత అయింది. ద వన్‌ అండ్‌ ఓన్లీ డార్లింగ్‌ ప్రభాస్‌ ఎప్పటిలాగే తన హీరోయిజాన్ని ప్రదర్శించటానికి ఇంకా ఇష్టపడ్డాడు.  కీరవాణిగారి నేపథ్య సంగీతం ప్రతి క్షణం ఎంతో తీవ్రత కలిగించింది.

– హీరో అఖిల్‌

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top