సోను నిగమ్‌కు నాడు గూండాయిజం గుర్తురాలేదా?

సోను నిగమ్‌కు నాడు గూండాయిజం గుర్తురాలేదా?


న్యూఢిల్లీ: మసీదుల్లో, మందిరాల్లో మైకులు పెట్టి ప్రార్థనలు వినిపించడం గుండాయిజమే అంటూ ప్రముఖ పాప్‌ గాయకుడు సోను నిగమ్‌ చేసిన ట్వీట్లపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయనకంటే ముందే స్పందించిన ముంబై హైకోర్టు మసీదుల్లో మైకులను ఎప్పుడో నిషేధించింది. అయినా కోర్టు ఉత్తర్వులు సరిగ్గా అమలు కావడం లేదు. అది వేరే విషయం. ‘మసీదులపై నిలబడి ముల్లాలు ఎందుకు అంత గట్టిగా పిలవాలి అల్లా ఏమీ చెవిటివాడు కాదుకదా!’ అని 15వ  శతాబ్దానికి చెందిన బ్రజ్‌ (పాశ్చాత్య హిందీ కవి) కవి కబీర్‌ ఇంకా ముందే స్పందించారు.

 

కబీర్‌ నుంచి సోనూ నిగమ్‌ వరకు ఎందరో చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. అయితే ప్రతిరోజు మసీదుల్లో, మందిరాల్లోనే వినిపించే ప్రార్థనలే గూండాయిజమా? వినాయకుని నిమజ్జనానికి, దుర్గా పూజకు, క్రిస్మస్‌ పండగకు మైకుల్లో అదరగొట్టే నినాదాలు, భక్తి గీతాలు, గుండెలు ఆగిపోయే రీతిలో డప్పులు మోగించడం, ఢిల్లీలో జరిగే జాగారణ రాత్రుల్లో తెల్లార్లు మైకుల్లో భజనలు, కీర్తనలు వినిపించడం గూండాయిజం కాదా? ఢిల్లీలో జరిగే జాగారణ కార్యక్రమాల్లో కూడా సోను నిగమ్‌ కూడా భక్తి గీతాలు ఆలపించారు. అప్పుడు ఆయనకు గూండాయిజం గుర్తురానట్లుంది.

 

ఆధునిక భారతదేశంలో మత విశ్వాసకులు ఉన్నారు. ఛాందసవాదులున్నారు. హేతువాదులున్నారు. దేవుడిని నమ్మని నాస్తికులు ఉన్నారు. ఇందులో ఏ వర్గం వారు కూడా మరోవర్గంపై తమ అలవాట్లను, ఆచారాలను, సిద్ధాంతాలను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించకూడదు. అలా చేయడమంటేనే గూండాయిజం. ఈ లెక్కన దేశంలో గోవధను నిషేధించడం కూడా గూండాయిజమే. హిందువులు గోవులను పవిత్రంగా భావిస్తారని గోమాంసం తినే ముస్లింలపై నిషేధం విధించడమంటే ఏమిటీ? ఆధునిక భారత దేశంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మతాల్లోనూ విశ్వాసాల్లోను మార్పు రావాలి. ఏ మతమైనా సర్వమానవ కల్యాణాన్ని కోరుకున్నప్పుడు ఒక వర్గం అభిప్రాయలను మరో వర్గంపై బలవంతంగా రుద్దడం అంటే గూండాయిజం కాదా?



అలీగఢ్‌ ముస్లిం యూనివర్శిటీ గ్రంధాల ప్రకారం మహమ్మద్‌ ప్రవక్త ఇస్లాం మతాన్ని స్థాపించినప్పుడు మైకులు లేవు. జనాన్ని పోగేసేందుకు గట్టిగా అరచి పిలిచే శక్తిగల యువకులను ప్రవక్త స్వయంగా నియమించారు. వారు మసీదులపైకి ఎక్కి సమావేశం ప్రారంభం అవుతుందన్న విషయాన్ని సూచించడానికి గట్టిగా పిలిచేవారు. అలా పిలిచేవారే కాలక్రమంలో ముల్లాలయ్యారు. కాలక్రమంలో మైకులు రావడంతో వారు కూడా వాటిని ఉపయోగిస్తున్నారు. నేడు ప్రార్థనా సమయాలు అందరికి తెలుసు. అందరి వద్ద గడియారాలున్నాయి. ఇప్పుడు కూడా మైకులు ఉపయోగించడం అవసరమా? ఇతరులను ఇబ్బంది పెట్టడం ఏ దేవుడు కోరుకుంటారు?

                                              

      ఓ సెక్యులరిస్ట్‌ కామెంట్‌

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top