హీరోగా యాభై సినిమాలు వదిలేశా!

హీరోగా యాభై సినిమాలు వదిలేశా! - Sakshi


నచ్చిందే చేయడం, చేసేదే చెప్పడం, ఎవ్వరికీ తలవంచకపోవడం, ఆత్మాభిమానంతో ముందుకెళ్లడం... ఈ లక్షణాలున్నవారు సినీరంగంలో ఇమడటం కష్టం. వెనక సినీ నేపథ్యం ఉంటే ఫర్లేదు. అలాంటిదేం లేకుండా స్వశక్తితో ఎదగాలనుకునేవారికి ఈ లక్షణాలు ప్రతిబంధకాలే. కానీ.. నటుడు శివకృష్ణ మాత్రం కెరీర్ తొలినాళ్లలో కూడా ఆ గుణాలను విడిచిపెట్టలేదు. ఆ మాటకొస్తే ఇప్పటిక్కూడా. ఈ రోజు ఆత్మసంతృప్తితో ఉన్నానంటే కారణం అదే అంటారు శివకృష్ణ. నిర్మాతగా, హీరోగా, కేరక్టర్ నటునిగా ఆయనది 36 ఏళ్ల ప్రస్థానం.  తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం(మా)యకు కార్యనిర్వాహక ఉపాధ్యక్షునిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. త్వరలో మెగా ఫోన్ పట్టనున్న శివకృష్ణ పుట్టిన రోజు నేడు. 59వ పుట్టిన రోజు నేడు ఈ సందర్భంగా  ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్‌వ్యూ...

 

 మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) విధుల్లో బిజీగా ఉన్నట్టున్నారు?

 అవునండీ... అసోసియేషన్ పని ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ప్రైవేటు కార్యక్రమాలు కూడా కొన్ని ఉంటాయి. ఏ రాజకీయ పార్టీలోనూ క్రియాశీలకంగా లేకపోయినా... పరోక్షంగా ఏదో ఒక కార్యక్రమానికి హాజరవుతూ ఉంటా.

 

 ఒకానొక దశలో ఊపిరాడకుండా సినిమాలు చేసిన మీరు ఇప్పుడు స్పీడ్ తగ్గించడానికి కారణం?

 మేం చూసిన క్రమశిక్షణ ఇప్పుడు కనిపించడం లేదు. 36ఏళ్ల నా సినీ ప్రయాణంలో వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా విలువల్ని విస్మరించింది లేదు. ఆ విలువలు ఇప్పుడు లేవు. అందుకే కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాను. అయితే... తెరకు దూరమైనా... జనహృదయాల్లో మాత్రం నా స్థానం పదిలంగానే ఉంది. నేనెక్కడ కనిపించినా... ‘సార్.. మీరు నటించాలి’ అని అడుగుతుంటారు. వారికోసమైనా నటించాలని.. పాత్ర నచ్చితే సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం ఓ అయిదారు సినిమాలున్నాయి.

 

 కెరీర్ తొలినాళ్లలో విప్లవ కథానాయకునిగా ఎక్కువ సినిమాలు చేశారు కదా?

 పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదంటారు కదా. విప్లవభావాలు నాకు చిన్నప్పటుంచీ ఉండేవి. అందుకని నేనేం లీడర్నేం కాదు. ఎవరితోనూ బేధాభిప్రాయాలు కూడా ఉండేవి కావు. క్లాస్‌లో నేనే బెస్ట్ స్టూడెంట్‌ని. సినిమాల్లోకి రాకముందే మేం స్థితిపరులం. మాకు గ్యాస్ సిలిండర్ల మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది. దేశవ్యాప్తంగా కోట్లలో టర్నోవర్. అయినా సరే... ధనాహంకారం నాలో కనిపించేది కాదు. అయితే... కార్యనిర్వహణ విషయంలో అవకతవకల్ని అస్సలు క్షమించేవాణ్ణి కాదు. క్రమశిక్షణ తప్పితే మహాకోపం. సినిమాల్లోకొచ్చాక కూడా ఆ లక్షణాలు వదల్లేదు. ఆ రోజుల్లో విప్లవ కథానాయకుడంటే మాదాల రంగారావుగారు. ఆయన ఎర్రజెండా చూపిస్తూ విప్లవాన్ని పలికించేవారు. నేను అందుకు భిన్నం. ఎర్రజెండా చూపించకపోయినా నాకు విప్లవ కథానాయకుడు ఇమేజ్ పడిపోయింది.

 

 అంత ఆస్తి ఉండి సినిమాల్లోకెందుకొచ్చారు?

 డాక్టర్ అవ్వాలనుకుని ఇంటర్‌లో బైపీసీ తీసుకున్నా. కానీ... నా మార్కులకు ఎంబీబీఎస్‌లో సీటు రాలేదు. దాంతో బీకాం చేశాను. వ్యాపారం చేయడం ఇష్టం లేదు. పైగా ఎన్టీఆర్‌గారి వీరాభిమానిని. దాంతో సినిమాల్లోకి రావాలనుకున్నా. తొలుత ఓ పదిమంది కలిసి దేవదాసు కనకాలగారి దర్శకత్వంలో ‘చలిచీమలు’ తీశాం. పెద్ద హిట్. మాకేం డబ్బులు రాలేదు. నా మిత్రుడు వేజెళ్ల సత్యనారాయణను దర్శకునిగా పరిచయం చేస్తూ ‘మరోమలుపు’ సినిమాను నేనే స్వయంగా నిర్మించాను. హీరోగా నా తొలి సినిమా అది. ఊహించని విజయాన్ని సాధించింది. రాత్రికి రాత్రి స్టార్‌ని అయిపోయాను. అంత స్టార్‌డమ్ వచ్చాక కూడా నాన్న సినిమాలంటే ససేమిరా అన్నారు. అయినా, బతిమాలి ‘ఈ చరిత్ర ఏ సిరాతో’ చేశాను. అదీ  భారీ హిట్టే. నా మూడో సినిమా ‘ఇదికాదు ముగింపు’ కూడా పెద్ద హిట్.  

 

 మరి... మీ అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్‌తో ‘నా దేశం’లో నటించారు కదా! ఆ అనుభవం?

 హిందీ  ‘లావారీస్’ ఆధారంగా ఆ సినిమా తీశారు. హిందీలో సురేశ్ ఓబెరాయ్ చేసిన పాత్రను తెలుగులో ఓ యువహీరోతో చేయించాలనుకున్నారు. అప్పట్లో నేను, చిరంజీవి, భానుచందర్ యంగ్‌హీరోలం. చిరంజీవి అప్పటికే కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు. అందుకే బంతి నా కోర్ట్‌కి వచ్చింది. నా గత విజయాలు, కుటుంబ నేపథ్యం విని, దర్శకుడు బాపయ్యగారు ‘సపోర్టింగ్ రోల్ చేస్తాడా?’ అని సంశయించారు. అయితే నా వీక్‌నెస్ ఎన్టీఆర్‌గారని పరుచూరి బ్రదర్స్ చెప్పడంతో అడిగారు. ‘స్టార్ హోటళ్లలో బస, కార్లు నాకు వద్దు. నాకు ఇల్లు, కారు ఉన్నాయి. నేనే వచ్చి చేసి వెళతాను. ఎన్టీఆర్‌గారితో నటించడం ముఖ్యం’ అన్నాను. మూడ్రోజులు ఆయనతో షూటింగ్. ఆ క్షణాలు జీవితంలో మరపురానివి.

 

 ఎన్టీఆర్‌గారితో మీ అనుబంధం ఎలా ఉండేది?

 ఆయనతో చేసినది మూడ్రోజులే అయినా ఆయన అభిమానాన్ని పొందగలిగాను. ప్రతిభను ప్రోత్సహించడంలో ఆ మహానుభావుని తర్వాతే ఎవరైనా. ‘నేను నిష్ర్కమిస్తున్న సమయంలో మీ రంగప్రవేశం జరిగింది. అది మీ బ్యాడ్ లక్’ అన్నారాయన. దీన్ని బట్టి ఆయన నాపై ఎంతటి మమకారాన్ని చూపించారో అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ పెట్టాక, సినీరంగానికి చెందిన ఎవరినీ ఆయన పార్టీఫండ్ అడిగింది లేదు. ఎవర్నీ పార్టీలోకి ఆహ్వానించిందీ లేదు. కానీ... నన్ను ఆహ్వానించారు. పార్టీ టికెట్ ఇస్తానన్నారు. కానీ నేనే సున్నితంగా తిరస్కరించాను. ఎందుకంటే సినిమాలపై నాకింకా అప్పటికి తృప్తి తీరలేదు.

 

 మంచి సినిమాల్లో నటించి కూడా హీరోగా అనుకున్న స్థాయికి రాలేకపోయారు కారణం?

 నచ్చిందే చేయడం మొదట్నుంచీ అలవాటు. వేషాలు అడగడం, ఒకరి ముందు తలవంచడం, స్టార్‌డమ్ కోసం పాకులాడటం నాకు తెలీదు. కేవలం నచ్చలేదనే కారణంతో హీరోగా 50 సినిమాలు వదిలేశా. అవి నా తోటి హీరోలు చేసి విజయాలు అందుకున్నారు. నా కెరీర్‌లో నేను చేసిన తొలి తప్పు అది. అప్పటికీ ఉగ్రరూపం, ఆగ్రహం, బెబ్బులినాగు, నేను సొంతంగా నిర్మించిన ‘ఆడపడుచు’ చిత్రాలతో నాకు మాస్ ఇమేజ్ కూడా వచ్చింది. కానీ.. నేను చేసిన రెండో తప్పు కెరీర్ మంచి పీక్‌లో ఉండగా 1990లో బీజేపీలో చేరడం. ఆ పార్టీకి 14ఏళ్లు సేవ చేశాను. 1999లో సెన్సార్‌బోర్డ్ చైర్మన్‌గా కూడా పనిచేశాను. అయినా నాకు బాధ లేదు.  ఎందుకంటే... బీజేపీ అంటే ఇప్పటికీ నాకు ఇష్టమే. త్వరలో ఓ సామాజిక కథాంశంతో స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించనున్నాను.

 

 తెలుగు సినిమా మనుగడ ఏంటి? వైజాగ్‌లో పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారా?

 రాష్ట్రం రెండు అయ్యింది. కనుక అక్కడ కూడా ఓ ఇండస్ట్రీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకు కావాల్సిన మౌలిక వసతులు కూడా వైజాగ్‌లో మెండుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. మేం కూడా కొన్ని సలహాలిచ్చాం. పన్ను రాయితీ, సింగిల్ విండో విధానం అమలు చేయాలని కోరాం. వైజాగ్ పరిసరాల్లో ఎక్కడ కెమెరా పెట్టినా పోలీసుల నుంచి సమస్యలు ఉండకూడదని కోరాం. అంతేకాదు, స్టార్ హోటళ్లు, ప్రభుత్వం వారి టూరిజం రిసార్ట్స్‌ల్లో 50-60 శాతం డిస్కౌంట్ కోరాం. నిర్మాతలకు లాభాలు చేకూరే అన్ని అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇక స్టూడియోలంటారా! ప్రస్తుతం వాటితో పనిలేదు. డిజిటల్ యుగంలో ల్యాబ్‌లతో కూడా పనిలేదు. త్వరలోనే వైజాగ్ కూడా సినిమా హబ్‌గా మారబోతోంది. పైగా కళలకు కాణాచి అయిన ఆంధ్ర ప్రాంతంలో లోకల్ టాలెంట్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top