కొద్దిగా తీరిక చిక్కాకే... అవన్నీ!

కొద్దిగా తీరిక చిక్కాకే... అవన్నీ!


‘‘సంగీతం, రచన... ఈ రెండింటికీ వయసుతో సంబంధం లేదు. మనసులో ఇష్టం, ఆలోచనల్లో కొత్తదనం ఉంటే చాలు. ఏ వయసులోనైనా ఇవి చేయొచ్చు’’ అని శ్రుతీహాసన్ అంటున్నారు. కొన్ని ఆల్బమ్స్‌కి సంగీతం సమకూర్చడంతో పాటు, పాటలు కూడా పాడారామె. శ్రుతి పాటలు, కవితలు కూడా రాస్తుంటారు. కథా నాయికగా చేయాలంటే చాలామంది మీద ఆధారపడాల్సి ఉంటుందనీ, కానీ సంగీతం, రచనలకు ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదనీ శ్రుతీహాసన్ చెబుతూ - ‘‘కథానాయికగా ఓ పాత్రలో ఒదిగిపోవాలంటే, మేకప్‌మ్యాన్ చేసే మేకప్, హెయిర్ స్టయిలిస్ట్ చేసే కేశాలంకరణ చాలా ముఖ్యం.



అలాగే, పాత్రకు తగ్గట్టు కాస్ట్యూమ్ డిజైనర్ సెలక్ట్ చేసే డ్రెస్ వేసుకోవాలి. ఆ తర్వాత డెరైక్టర్ చెప్పినట్లు చేస్తే, కెమెరామ్యాన్ చిత్రీకరిస్తారు. తెరపై కనిపించాలటే ఇంతమంది మీద ఆధారపడాలి. అదేగనక కథలూ, కవితలూ రాయాలనుకోండి... మన బుర్ర, కొన్ని కాగితాలు, కలం చాలు. ట్యూన్స్ తయారు చేయాలన్నా అంతే! సంగీత పరికరాలుంటే మనకు నచ్చిన ట్యూన్ రెడీ చేసుకోవచ్చు. అదే నాయిక పాత్రలనుకోండి... కొన్నేళ్ల తర్వాత చేయలేం. అది తెలుసు కాబట్టే, ఇప్పుడు బిజీగా సినిమాలు చేస్తున్నాను. కొంచెం తీరిక చిక్కాక సంగీతం, రచనలపై దృష్టి సారిస్తా’’ అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top