శాతకర్ణిలో శివరాజ్?

శాతకర్ణిలో శివరాజ్?


నందమూరి తారక రామారావు నటించిన పలు చిరస్మరణీయ సినిమాల్లో ‘భూకైలాస్’, ‘శ్రీకృష్ణ దేవరాయ’ సినిమాలు కూడా ఉంటాయి. ఈ రెండూ కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ నటించిన సినిమాలకు రీమేక్. అలాగే తెలుగులో ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలను కన్నడలో రాజ్‌కుమార్, ఆయన సినిమాల తెలుగు రీమేక్‌లో ఎన్టీఆర్ చేశారు. ఎన్టీఆర్, రాజ్‌కుమార్‌లు మంచి స్నేహితులు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. ఈ స్నేహితులిద్దరి తనయులు కలసి నటించనున్నారట. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో రాజ్‌కుమార్ తనయుడు శివ రాజ్‌కుమార్ అతిథి పాత్ర చేయనున్నారని సమాచారం. ఓ పవర్‌ఫుల్ పాత్రలో కన్నడ హీరో కనిపిస్తారట. శాతకర్ణిగా బాలకృష్ణ, వశిష్ఠదేవిగా శ్రీయ, గౌతమి బాలాశ్రీగా హేమమాలిని తదితరులు నటిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

 

 మహేశ్‌తో నో మల్టీస్టారర్: బాలకృష్ణ, మహేశ్‌బాబు హీరోలుగా ఓ మల్టీస్టారర్ రూపొందించడానికి దర్శకుడు కొరటాల శివ సన్నాహాలు చేస్తున్నారని వార్తలొచ్చాయి. ‘జనతా గ్యారేజ్’ తర్వాతి సినిమా మహేశ్‌తోనే అని కొరటాల ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. ఆ సినిమా ఈ మల్టీస్టారరేనంటూ ఫిల్మ్‌నగర్‌లో షికారు చేస్తున్న పుకారుకి దర్శకుడు చెక్ పెట్టారు. ‘నా నెక్ట్స్ సినిమాలో ఫ్యాన్సీ కాంబినేషన్లు లేవు, మల్టీస్టారర్ కూడా కాదు’ అని కొరటాల చెప్పారు. అంటే... బాలకృష్ణ-మహేశ్ మల్టీస్టారర్ జస్ట్ రూమర్ అన్నమాట.

 

 లెజెండ్.. 950 టు 1000!: బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన సినిమా ‘లెజెండ్’. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు అర్చన థియేటర్‌లో ఈ చిత్రం 950 రోజులు పూర్తి చేసుకుని 1000 రోజుల దిశగా పయనిస్తోంది. నేడు 964వ రోజు. గతంలో రజనీకాంత్ ‘చంద్రముఖి’ సినిమా చెన్నైలోని ఓ థియేటర్లో 891 రోజులు ప్రదర్శింపబడింది. దక్షిణాదిలో వెయ్యి రోజులకు చేరువ కానున్న సినిమా ‘లెజెండ్’ కావడం గమనార్హం.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top