ఓ కూతురిగా గర్వంగా ఉంది
– దర్శకురాలు జయ
‘‘మా అమ్మగారు మంచి క్రిటిక్. నేను ‘లవ్లీ’ సినిమా తీసినప్పుడు కొన్ని లోటుపాట్లు ఉన్నాయన్నారు. ‘వైశాఖం’ సినిమా చూసి, బాగా తీశానని సంతృప్తి చెందారు. అమ్మను ఆనందపరచిన ఓ కూతురిగా నేను గర్వంగా ఫీలవుతున్నాను’’ అన్నారు జయ. బి. హరీశ్, అవంతిక జంటగా ఆమె దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైశాఖం’. బీఏ రాజు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. శనివారం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో ‘సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది’ అన్నారు బీఏ రాజు.
జయ.బి మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు చనిపోయిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ కథ రాసుకున్నా. మా కుటుంబ సభ్యలు సినిమా చూసి చాలా ఫీలయ్యారు. డైరెక్టర్లు సినిమాలు తీసేది ప్రేక్షకుల కోసమే. ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు. ‘‘మానవతా విలువలను గుర్తు చేసే ఒక మంచి సినిమా మీ బ్యానర్లో వచ్చిందని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది. కొత్త కథతో డైరెక్టర్ జయ బాగా తీశారు. మంచి హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. హరీశ్‌తో మరో సినిమా చేయబోతున్నాం’’ అన్నారు బీఏ రాజు. హరీశ్, అవంతిక తదితరులు పాల్గొన్నారు.