సీతమ్మ ప్రేమ... రామయ్య క్రికెట్

సీతమ్మ ప్రేమ... రామయ్య క్రికెట్


చిత్రం: ‘సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు’

తారాగణం: రాజ్‌తరుణ్, అర్తన, రాజా రవీంద్ర, సురేఖావాణి, శ్రీలక్ష్మి

కెమేరా: విశ్వ డి.బి

ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్

సంగీతం: గోపీ సుందర్

నిర్మాతలు: ఎస్. శైలేంద్రబాబు, కె.వి. శ్రీధర్‌రెడ్డి, హరీశ్ దుగ్గిశెట్టి

రచన - దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి

 

ప్రేమించిన అమ్మాయి కోసం ఆ అమ్మాయి కుటుంబాన్ని హీరో ఎదిరించడం, ఆ అమ్మా యిని పెళ్ళి చేసుకోవడం కోసం ఒక పందెంలో నిలవడం, అష్టకష్టాలూ పడి ఆఖరుకు గెలవడం - ఈ స్కీమ్ ఆఫ్ ఈవెంట్స్, సీన్లు సినిమాకు కొత్త కావు. ఆ పందెం ఏదో క్రికెట్, కబడ్డీ లాంటి ఆటల చుట్టూ తిరిగితే? అప్పుడెప్పుడో హిందీ ‘లగాన్’ వచ్చినప్పటి నుంచి ఆటల్నీ, ఇలా ప్రేమనీ ముడిపెట్టడం పెరిగింది. జగపతిబాబు ‘కబడ్డీ కబడ్డీ’ లాంటివన్నీ ఆ తాను ముక్కలు. ఆ ఛాయలతోనే ఇప్పుడు వరుస హిట్స్‌లో ఉన్న యువ హీరో రాజ్ తరుణ్‌తో వచ్చింది ‘సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు’.     

 

అనగనగా ఒక ఊరు... రామచంద్రాపురం. ఆ ఊళ్ళో రామ్ (రాజ్ తరుణ్), ఊరి ప్రెసిడెంట్ (రాజా రవీంద్ర) వాళ్ళమ్మాయి సీతామాలక్ష్మి (నూతన పరిచయం అర్తన) చిన్నప్పటి ఫ్రెండ్స్. చిన్నప్పుడే సీత కోసం చదివే స్కూల్ మారిన రకం రామ్. పెద్దయ్యాక అది అతనిలో పిచ్చి ప్రేమగా మారుతుంది. చిన్నప్పుడే చదువు కోసం సిటీ వెళ్ళిపోయి, ఎం.బి.బి.ఎస్. చేస్తున్న సీత పెద్దయ్యాక ఊరికి వస్తుంది. ఇంటర్ కూడా పాస్ కాక, డింకీలు కొడుతూ, ఫ్రెండ్స్‌తో సిగరెట్టు, మందుతో కాలం గడిపే హీరో ఇక హీరోయిన్‌కు తన ఇష్టం వ్యక్తం చేసి, ఆమెను ప్రేమలో పడేసే పనిలో పడతాడు. అంతా ఓకే అవుతోందనుకున్న టైమ్‌లో ఎంతసేపూ ప్రేమని పండించుకొనే పనిలో పడతాడు. మామూలు సినిమాల్లో అయితే, అమ్మాయి సరేనంటుంది. కానీ, ఇక్కడ హీరోయిన్ ఛీ కొడుతుంది. ట్విస్ట్.

 

ఇక సెకండాఫ్‌లోకి వచ్చేసరికి కాసింత కథా తెరపై చూపించాల్సి వచ్చేస్తుంది. దాంతో, సినిమా తప్పక వేగం పుంజుకుంటుంది. గుడిలో పల్లకీ మోసి, నిప్పులగుండంపై నడిచిన హీరోపై ఆటోమేటిగ్గా ప్రేమ పుడుతుంది. తీరా అదే టైవ్‌ుకి హీరోయిన్‌కి మరో అబ్బాయితో పెళ్ళి ఫిక్స్ చేస్తాడు తండ్రి. హీరోలు, క్రికెటర్ల దగ్గరే డబ్బంతా ఉంటుంది కాబట్టి, ఒక క్రికెటర్‌కి అమ్మాయినిచ్చి చేయాలనుకుంటాడు. ఇంకేం.. హీరో వెళ్ళి ఆ క్రికెటర్‌తో ఢీ అంటాడు. క్రికెట్‌లో తమపై గెలిచి, ప్రేమను గెలుచుకోమని అతను హీరోకి సవాలు విసురుతాడు. చిన్నప్పుడెప్పుడో తన వల్ల హీరోయిన్ ముఖానికి బంతి తగిలిం దని క్రికెట్‌నే వదిలేసిన హీరో- మళ్ళీ ఈ పందెం కోసం బ్యాట్ పడతాడు. ఊళ్ళోని మిత్ర బృందం తోడవుతుంది. అక్కడ నుంచి క్రికెట్ మైదానంలో జరిగే పందెం కథ ఏమిటో ఊహించుకోవచ్చు.

 

రాజ్‌తరుణ్ ఎప్పటిలానే అలవాటైన నటన చూపారు. అతనిలోని నటుడికి ఛాలెంజింగ్ అనిపించే సీన్ల కోసం స్క్రిప్ట్‌లో వెతకకూడదు. హీరోయిన్‌గా అర్తన తన నిజ జీవిత వయసుకు తగ్గట్లే చిన్న పిల్లలా ఉన్నారు. కొత్తమ్మాయి కాబట్టి, అతిగా అభినయం ఆశించడం తప్పు! హీరో మిత్ర బృందంలోని నటులు, ముఖ్యంగా అంజి పాత్రలో ‘షకలక’ శంకర్ కొన్నిచోట్ల నవ్విస్తారు. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబిం బించే ఆ వినోదాత్మక దృశ్యాలు, మాటలు చూసేసినవే అయినా ప్రత్యేక ప్రేక్షక వర్గం ఉంటుంది. హీరో తల్లితండ్రులుగా దర్శకుడు ఎన్. శంకర్, సురేఖావాణి కనిపిస్తారు. గోపీ సుందర్ బాణీల్లో సెకండాఫ్ మాంటేజ్ పాటలు వినడానికీ, చూడడానికీ కూడా బాగున్నాయి.

 

తొలి చిత్ర దర్శకుడైన శ్రీనివాస్ గవిరెడ్డి ప్రేక్షకులకు అలవాటైపోయిన కథనే ఎంచుకు న్నారు కాబట్టి, ఇక కథనం మీదే దృష్టి అంతా! దానికి తగ్గట్లు ఆయన వీలైనన్ని ఎక్కువ సీన్లు రాసుకున్నారు. కాకపోతే, సీన్ వెంట సీన్‌లోనూ అవే పాత్రలు, పాత్రధారులు. దాంతో ఫస్టాఫ్‌లో కథ అంగుళాల చొప్పున ముందుకు నడుస్తుంది. వినోదం మీద దృష్టి పెట్టారు. ఉన్న కాసింత కథలో కీలక ఘట్టం అంతా సెకండాఫ్‌లోనే! అక్కడా ఆఖరి పావుగంట క్రికెట్‌మ్యాచ్, రన్నింగ్ కామెంటరీ. హాలులోకి బదులు స్టేడియమ్‌లోకి వచ్చామేమోనని అనుమానం వస్తుంది. రెండు గంటల మీద కాసేపు నిడివే కాబట్టి, సినిమాలో పాత్రల ప్రవర్తనలో, సన్నివేశాల్లో కార్యకారణ సంబంధం ఆలోచించే వేళ కల్లా సినిమానే అయి పోతుంది. వెరసి, క్రికెట్ గెలిపించిన మరో వెండి తెర ప్రేమకథగా ఈ సినిమా లెక్కల్లో మిగిలిపోతుంది.

 - రెంటాల జయదేవ

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top