అదిరె.. కళ్లు చెదిరె..

అదిరె.. కళ్లు చెదిరె.. - Sakshi


 అంగరంగ వైభవంగాసల్మాన్‌ఖాన్ సోదరి వివాహం

 ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఘనంగా వేడుక

 అర్పితాఖాన్, ఆయుష్ శర్మ జంటను ఆశీర్వదించిన అతిథులు

 హాజరైన అమితాబ్, రజనీకాంత్, ఆమిర్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, కత్రినా


 

 సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ సోదరి అర్పితాఖాన్ వివాహం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ తారల సందడితో హైదరాబాద్‌లోని చారిత్రక తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ మరింత మెరిసిపోయింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్యాలెస్‌లో అంతకంటే ముచ్చటగా తయారైన పెళ్లి జంట అందరినీ ఆకట్టుకుంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు వివాహ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. పెళ్లి కుమారుడు ఆయుష్ శర్మ బ్యాండ్ బాజాలతో గుర్రంపై బారాత్‌గా పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు. వధువు తండ్రి సలీంఖాన్, తల్లి సల్మాఖాన్, సోదరులు సల్మాన్‌ఖాన్, అర్బాజ్‌ఖాన్, సొహేల్‌ఖాన్ ఇతర కుటుంబ సభ్యులు వరుడికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పంజాబీ సంప్రదాయ పద్ధతిలో అర్పిత, ఆయుష్ శర్మ వివాహం జరిగింది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, అగ్రనటులు ఆమిర్‌ఖాన్, చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, కత్రినాైకైఫ్, కాజల్, కరణ్ జోహార్, బాబాసెహగల్‌తో పాటు క్రికెటర్ అజారుద్దీన్ వంటి సుమారు 250 మంది ప్రముఖులు ఈ వివాహానికి తరలివచ్చారు. ప్రత్యేక ఆహ్వానితులంతా    

 వధూవరులను ఆశీర్వదించారు. వారందరికీ సల్మాన్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు.

 

 నిజాం వంటకాలతో విందు

 

 పెళ్లి విందులో నిజాం వంటకాలను అతిథులంతా పసందుగా ఆరగించారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని 101 సీట్ల డైనింగ్‌హల్‌లో దక్కన్ బిర్యానీ, హలీమ్, పత్తార్‌కా ఘోష్, డబల్‌కా మీఠా తదితర వంటకాలు వడ్డించారు. విందు అనంతరం ప్రసిద్ధ కళాకారుల కళా ప్రదర్శనలు కొనసాగాయి. పంజాబ్‌కు చెందిన ప్రముఖ గాయకుడు మైకా, యోయో హోనిసింగ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

 

 ఫలక్‌నుమాలో సందడి

 

 అర్పిత వివాహం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్రాంతంలో పెళ్లి సందడి నెలకొంది. ఉదయం నుంచే సల్మాన్ ఖాన్ బంధుమిత్రులు, అతిథుల రాకతో హడావుడిగా మారింది. మీడియాను ప్యాలెస్ ప్రధాన గేటు వద్దే నిలిపివేశారు. దీంతో వారంతా ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సివచ్చింది. మద్యాహ్నం రెండు గంటల ప్రాంత ంలో సల్మాన్ ఖాన్ ప్యాలెస్‌కు చేరుకున్నారు. వివాహానంతరం రాత్రి ఎనిమిది గంటలకు ఇద్దరు ఫొటోగ్రాఫర్లు, ఇద్దరు వీడియో గ్రాఫర్లను అనుమతించారు. ఇక భారీ సంఖ్యలో అభిమానులు కూడా ప్యాలెస్ వద్దకు రావడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు నానా అవస్థలు పడ్డారు. రంగురంగుల విద్యుల్లతలతో ఫలక్‌నుమా ప్యాలెస్ జిగేల్‌మంది. బుధవారం పెళ్లి విందుతో వివాహ వేడుక ముగియనుంది.

 

 ఫూట్‌పాత్‌పై నుంచి ప్యాలెస్ వరకు..

 

 దిక్కుమొక్కు లేక రోడ్డు పక్కన పూట్‌పాత్‌పై లభించిన అనాథ బాలికను అల్లారుముద్దుగా యువరాణిలా పెంచింది సల్మాన్ ఖాన్ కుటుంబం. ఇప్పుడు ఆ అమ్మాయి కోసమే కోట్లు కుమ్మరించి మరీ చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వివాహం జరిపించింది. యాక్సిడెంట్‌లో తల్లి మృతి చెందడంతో అనాథగా రోడ్డుపక్కన పడి ఉన్న బాలిక అర్పితను సల్మాన్‌ఖాన్ తండ్రి సలీమ్‌ఖాన్ అక్కున చేర్చుకున్నారు. ఆమెను దత్తత తీసుకుని యువరాణిలా పెంచారు. అర్మితకు తన వివాహం ప్యాలెస్‌లో జరగాలని కోరిక. దీంతో ఆమె కోరికను తీర్చేందుకే సల్మాన్ కుటుంబం సుమారు రూ. 2 కోట్లు ఖర్చుచేసింది. ఆరు నెలల క్రితమే ఫలక్‌నుమా ప్యాలెస్‌ను బుక్ చేశారు. ఇక ముంబైలోని కార్టర్‌రోడ్డులో సుమారు రూ. 16 కోట్ల విలువైన మూడు పడక గదుల ఫ్లాట్‌ను సల్మాన్‌ఖాన్ తన సోదరికి పెళ్లి బహుమతిగా ఇచ్చారు. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో అర్పిత డిగ్రీ చదివారు. ఇటీవలే ఆమె సొంతంగా ఓ ఫ్యాషన్ లేబుల్‌ను లాంచ్ చేసింది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top