సినిమా రివ్యూ: సల్మాన్ ఖాన్ ‘జై హో’

సినిమా రివ్యూ: సల్మాన్ ఖాన్ ‘జై హో’

 

పాజిటివ్ పాయింట్స్:

 సల్మాన్ ఖాన్ నటన

 యాక్షన్ ఎపిసోడ్స్

 సంతోష్ తుండియిల్ ఫోటోగ్రఫీ

 

 మైనస్ పాయింట్స్:

 హీరోయిన్ డైసీ షా

 మ్యూజిక్

 

తారాగణం: సల్మాన్ ఖాన్, డౌసీ షా, టబు, సునీల్ శెట్టి, డానీ, మెహనీష్ బెహల్, మహేశ్ మంజ్రేకర్, జెనిలీయా తదితరులు

 

బాలీవుడ్‌లో ఘన విజయాలతో దూసుకుపోతున్న కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన ఇమేజ్‌కు భిన్నంగా సామాజిక అంశాన్ని నేపథ్యంగా ఎంచుకున్నారు. తెలుగులో ఓ మోస్తారుగా విజయం సాధించిన ‘స్టాలిన్’ చిత్రం ఆధారంగా సోహైల్ ఖాన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. భారీ అంచనాలతో జనవరి 24 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జై హో’ చిత్రం కథేంటో ఓసారి పరిశీలిద్దాం.

 

జై(సల్మాన్ ఖాన్) ఓ మాజీ మిలటరీ ఆఫీసర్. ఓ కారణంగా మిలిటరీ నుంచి సస్పెండైన జై   సమాజంలోని చెడును ఎదిరిస్తూ.. సాధారణ జీవితం గడుపుతుంటాడు. అపదలో ఉన్నవారిని ఆదుకుంటూ.. అన్యాయాల్ని ఎదురించే క్రమంలో హోం మంత్రి(డానీ)తో గొడవ మొదలవుతుంది. హోం మంత్రి అక్రమాలను ఎదుర్కోనే నేపథ్యంలో ముఖ్యమంత్రి పై హత్యాయత్నం జరుగుతుంది. ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు ప్రయత్నించారనే అపవాదు జై  పై పడుతుంది. అయితే హోం మంత్రి ఆగడాలకు ఎలా అంతం పలికాడు? ముఖ్యమంత్రిని ఎలా రక్షించుకున్నాడు? తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ‘జై హో’ చిత్ర కథ. 

 

 జై పాత్రలో సల్మాన్ ఖాన్ గత చిత్రాలకు భిన్నంగా కనిపిస్తాడు. మూస పాత్రలకు పరిమితం కాకుండా సామాజిక అంశాన్ని నేపథ్యంగా ఎంచుకుని.. కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. జై పాత్రలో సల్మాన్ ఖాన్‌ను అభిమానులను ఊపించుకోవడం కొంత కష్టమైనా.. పాత్ర పరిధి మేరకు సల్లూభాయ్ పరిణతిని ప్రదర్శించాడు. 

 

సల్మాన్ సరసన నటించే అవకాశం చేజిక్కించుకుని.. తొలిసారి బాలీవుడ్ తెరపై కనిపించిన డైసీ షా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో సల్మాన్‌కు సరియైన జోడి అని ఒక్క సన్నివేశంలో కూడా ప్రూవ్ చేసుకోలేకపోయింది డైసీ. ముఖ్యంగా హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో పాటలకే పరిమితమైంది. 

 

 చాలాకాలం తర్వాత టబు మళ్లీ బాలీవుడ్ తెరపై దర్శనమిచ్చింది. సల్మాన్ సోదరి పాత్రలో పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించింది.అంగవైకల్యంతో బాధపడే అమ్మాయిగా గెస్ట్ పాత్రలో కనిపించిన జెనిలీయా దేశ్‌ముఖ్‌ మంచి మార్కులే సంపాదించుకుంది. 

 

డానీ విలనిజం ఓకే. సునీల్ శెట్టి, మెహనీష్ బెహల్, మేహ శ్ మంజ్రేకర్, సనా ఖాన్ తదితర పాత్రలు సినిమాకు అదనపు ఆకర్షణ. 

 

విశ్లేషణ: 

వాంటెడ్, దబాంగ్, రెడీ, బాడీగార్డ్, ఏక్తా టైగర్, దబాంగ్-2 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా సల్మాన్ నిలిచాడు. అయితే తన రూట్ మార్చుకుని.. సామాజిక నేపథ్యమున్న 'జై హో’ చిత్రంతో ప్రేక్షకులకు సరికొత్త సల్మాన్‌ను చూపించాడు. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో కొత్త తరహా లుక్ తో సల్మాన్ ఆకట్టుకున్నాడు. సల్మాన్‌లో మాస్ ఎలిమెంట్స్‌ను ఎక్కువగా ఆశించే అభిమానులకు ఈ చిత్రంలో అలాంటి మార్కు ఎక్కడ కనిపించకపోవడం నిరాశ కలిగించే అంశం. గత చిత్రాల్లో కత్రినా, సోనాక్షి, కరీనాలతో జత కట్టిన సల్మాన్.. ఈ చిత్రంలో  డైసీ షాను హీరోయిన్ గా ఎంచుకున్నాడు. అయితే గతంలో సల్మాన్ సరసన నటించిన హీరోయిన్లకు ధీటుగా డైసీ గ్లామర్ పరంగా, అభినయంలోనూ మెప్పించలేకపోయింది. ఇక సల్మాన్ దీటుగా విలనిజం ఎలివేట్ కాకపోవడం ఈ చిత్రంలో ఓ మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సల్మాన్ అభిమానులను మెప్పించేందుకు దర్శకుడు సోహైల్ ఖాన్ తన శక్తిమేరకు ప్రయత్నించాడు. సాజిద్-వాజిద్, దేవి శ్రీప్రసాద్, అమల్ మాలిక్‌లు పాటలకు సంగీతాన్ని అందించారు. అయితే ‘బాకీ సబ్ ఫస్ట్ క్లాస్’, ‘తేరే నైనా’, ‘ఫోటో కాపీ’ పాటలు మాత్రమే ఆకట్టుకునేలా ఉన్నాయి. సందీప్ శిరోద్కర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్యూ చెప్పకుండా.. మరో ముగ్గురికి సహాయం చేయమని చెప్పే థీమ్ కు కథలో బలమైన పాయింట్. అయితే అంతగా తీవ్రత లేని పాయింట్ ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించడం కష్టమే. సెకండాఫ్‌ స్లోగా ఉండటం,  ఉపన్యాసాలు ఎక్కువ కావడం ప్రేక్షకుడ్ని విసిగించేలా ఉంటాయి. కొన్ని ఎపిసోడ్స్ సినిమాకు తక్కువ టెలివిజన్ సీరియల్స్ ఎక్కువలా అనిపిస్తాయి. కమర్షియల్ హంగులకు దూరంగా ఉన్న ఈ చిత్ర  విజయం పూర్తిగా సల్లూభాయ్‌పైనే ఆధారపడి ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారనే విషయాన్ని తెలుసుకోవాలంటే కొద్దిరోజులాగాల్సిందే. 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top