చిన్న బాహుబలి అనే పిలుస్తున్నారు..

చిన్న బాహుబలి అనే పిలుస్తున్నారు..


బాహుబలి చిత్రంలో చిన్ననాటి అమరేంద్ర బాహుబలిగా.. అదేనండీ చిన్నప్పటి ప్రభాస్‌గా నటించిన నిఖిల్‌ గుర్తున్నాడుగా.. ఆ బాలనటుడు విశాఖలో శుక్రవారం ప్రారంభమైన బాలల జాతీయ చిత్రోత్సవానికి బుల్లి అతిథిగా హాజరయ్యాడు. బాహుబలి చిత్రం తనకు లభించిన గొప్ప అవకాశమనీ, అప్పట్నించీ తన పేరు చిన్న బాహుబలి అయిపోయిందని చెబుతున్నారు. ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న నిఖిల్‌ సాక్షితో కొంతసేపు ముచ్చటించాడు. ఆ విశేషాలే ఇవి..  

         

సాక్షి : హాయ్‌! నిఖిల్, నీ పూర్తి పేరు?

నిఖిల్‌: నిఖిలేశ్వర్‌

సాక్షి : మీది హైదరాబాదేనా?

నిఖిల్‌: మాది అమలాపురం దగ్గర నేదునూరు. కానీ డాడీ వ్యాపార రీత్యా హైదరాబాద్‌లోనే ఉంటున్నాం.

సాక్షి : ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఎలా ఉంది?

నిఖిల్‌: చాలా బాగుంది, నేను బాలల చిత్రోత్సవంలో పాల్గొనటం ఇదే తొలిసారి. ఇక్కడ ఇంత మంది పిల్లలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.



సాక్షి : ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశావు?

నిఖిల్‌: 45 సినిమాలు పూర్తి చేశాను. మరో ఐదు  సినిమాల్లో నటిస్తున్నా.

సాక్షి : నీ మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది?

నిఖిల్‌: నా మొదటి సినిమా లవ్‌లీ. ఆ సినిమా మా డ్యాన్సు మాస్టర్‌ ద్వారా వచ్చింది. నేను చిన్నప్పుడు సుబ్బరాజు మాస్టర్‌ దగ్గర డ్యాన్సు నేర్చుకునేవాడిని. నా ముఖంలో హావభావాలను గుర్తించి లవ్‌లీ డైరెక్టర్‌ నాకు అవకాశం ఇచ్చారు.



సాక్షి : బాహుబలిలో నటించటం ఎలా ఉంది?

నిఖిల్‌: బాహుబలి సినిమా నాకో గొప్ప అవకాశం. నేను ఎక్కడికి వెళ్లినా నా పేరుతో కాకుండా చిన్న బాహుబలి అని పిలుస్తున్నారు.

సాక్షి : బాహుబలి సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?

నిఖిల్‌: బాహుబలి సినిమా కోసం బాల నటుడు కావాలని ప్రకటించారు. రాజమౌళి గారి తండ్రి విజయేంద్రప్రసాద్‌ ఆడిషన్స్ నిర్వహించారు. ఆయనే నన్ను ఎంపిక చేశారు.



సాక్షి : బాహుబలి–2లో కూడా నీ పాత్ర ఉందా?

నిఖిల్‌: ఉంది. కానీ బాహుబలి మొదటి భాగంలోనే ఎక్కువ సేపు కనిపిస్తాను. రెండో భాగంలో నా పాత్ర కేవలం ఐదు నిమిషాలే.

సాక్షి : మీకు బాగా గుర్తుండిపోయే ప్రశంస?

నిఖిల్‌: హీరో నాని అభినందన. కృష్టగాడి వీర ప్రేమగాథ సినిమాలో నటించేందుకు వెళ్లినప్పుడు బాహుబలిలో బాగా నటించావని నాని మెచ్చుకున్నారు.





సాక్షి : రాజమౌళి లాంటి డైరెక్టర్‌తో పనిచేయటం ఎలా అనిపించింది?

నిఖిల్‌: ఆయనతో పనిచేయటం చాలా గొప్ప విషయం. ప్రతీ సీన్ ను వివరించడమే కాకుండా ఎలా చేయాలో కూడా చేసి చూపించేవారు. అందుకే ఆయన డైరెక్షన్ లో చేయడాన్ని చాలా ఇష్టపడతాను.

సాక్షి : మీ అభిమాన హీరో?

నిఖిల్‌: సీనియర్‌ ఎన్టీఆర్, ప్రభాస్‌



సాక్షి : తెలుగులో అందరి హీరోలతో నటించావా?

నిఖిల్‌: లేదండీ.. ఈ మధ్య పవన్ కల్యాణ్‌ గారితో కాటమరాయుడు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆదే రోజు వేరే సినిమా షుటింగ్‌లో ఉండటం వలన నటించలేకపోయాను.

సాక్షి : వైజాగ్‌ ఇంతకు ముందు వచ్చావా?

నిఖిల్‌: ఇక్కడ మాకు బంధువులు ఉన్నారు. అందువలన నేను చాలా సార్లు వైజాగ్‌ వచ్చాను. నాకు ఆర్కే బీచ్‌ అంటే చాలా ఇష్టం. ప్రతీ సారి ఆర్కే బీచ్‌కు వెళ్తాను.

సాక్షి : నీ ఫ్యూచర్‌ ప్లాన్?

నిఖిల్‌: పెద్ద హీరోను కావటం. హీరోను కాకపోతే ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ అవుతాను.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top